బీసీలకు ఏ పార్టీ ఎన్ని టికెట్లు ఇచ్చింది?

తెలంగాణ ఎన్నికల్లో బీసీ నినాదం జోరందుకుంది. ఇప్పటికే బీజేపీ తమ ముఖ్యమంత్రి బీసీ అవుతారని ప్రకటించటం తెలిసిందే.

Update: 2023-11-11 11:30 GMT

తెలంగాణ ఎన్నికల్లో బీసీ నినాదం జోరందుకుంది. ఇప్పటికే బీజేపీ తమ ముఖ్యమంత్రి బీసీ అవుతారని ప్రకటించటం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ హాజరైన సభలో..ఆయనే స్వయంగా బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పటం తెలిసిందే. బీసీ నినాదాన్ని అధికార బీఆర్ఎస్ తో పాటు విపక్ష కాంగ్రెస్ సైతం వల్లె వేస్తోంది. రాష్ట్ర జనాభాలో అత్యధికంగా ఉండే బీసీకి రాజ్యాధికారం కట్టబెట్టాలన్న నినాదం అంతకంతకూ ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. మరి.. మాటల్లో బీసీల మీద ప్రేమ పొంగించే రాజకీయ పార్టీలు.. కీలకమైన ఎన్నికల్లో తమ అభ్యర్థులుగా బీసీలను ఎంతమందిని ఎంపిక చేశారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

ప్రధాన రాజకీయ పార్టీలు ప్రకటించిన అభ్యర్థుల్ని చూసినప్పుడు బీసీలకు ఆయా పార్టీలు కేటాయించింది ఎంతమందికి? అన్న విషయంపై క్లారిటీ రానుంది. రాష్ట్రవ్యాప్తంగా బీసీ అభ్యర్థుల్ని ఏ పార్టీ ఎక్కువగా నిలిపింది అన్న విషయంలోకి వెళితే.. అధికార పార్టీ 24 మంది బీసీ అభ్యర్థులకు టికెట్లు ఇస్తే.. కాంగ్రెస్ పార్టీ 23 మంది బీసీలను అభ్యర్థిలను ఎంపిక చేసింది. 2018 ఎన్నికల అనుభవాన్ని తీసుకున్న కాంగ్రెస్ పార్టీ బీసీలకు టికెట్ల కేటాయింపులో పెద్ద పీట వేసింది.

లోక్ సభ నియోజకవర్గానికి రెండు చొప్పున 34 మంది బీసీలకు సీట్లు ఇవ్వాలని భావించారు. అయితే.. అభ్యర్థుల ఎంపిక.. గెలుపు ఓటముల అంశంతో పాటు.. ఆర్థిక అంశాల్ని కూడా పరిగణలోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. అధికార పార్టీ అభ్యర్థుల్ని ధీటుగా ఎదుర్కొనే వారికే పెద్దపీట వేసినట్లుగా చెబుతున్నారు. కాంగ్రెస్ జాబితాలో అత్యధికంగా రెడ్డి సామాజిక వర్గానికి పెద్ద పీట వేశారు. మొత్తం 43 మంది రెడ్డిలకు ఇవ్వటం కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి రెండు చోట్ల పని చేస్తున్నారు. రెడ్ల తర్వాత వెలమలకు 9 సీట్లు. బ్రాహ్మణ.. కమ్మ సామాజిక వర్గానికి మూడేసి చొప్పున సీట్లు దక్కాయి. 58 శాతం సీట్లు అగ్రవర్ణాలకు.. ముస్లిం మైనార్టీలకు ఆరు సీట్లు దక్కాయి.

బీసీలకు దక్కిన 23 సీట్లలో మున్నూరు కాపులకు ఐదు.. యాదవులకు రెండు.. గౌడలకు నాలుగు.. కురుములకు రెండు.. ముదిరాజులకు మూడు.. ఆర్య మరాఠా బొందిలి.. చిట్టెపురెడ్డి.. వాల్మీకి.. మేరు పద్మశాలి.. రజకులకు ఒక్కొక్కరికి సీట్లు దక్కాయి. 19 ఎస్సీ రిజర్వు సీట్లలో పది మాదిగలకు.. తొమ్మిది మాలలకు ఇచ్చారు. ఎస్టీ రిజర్వులోని 12 సీట్లలో 7 లంబడాలకు.. నాలుగు కోయిలకు.. ఒకటి గోండు జాతికి ఇచ్చారు. తాము చెప్పే బీసీ నినాదానికి మర్యాదను ఇస్తూనే.. ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా టికెట్ల పంపిణీ సాగటం గమనార్హం. మరి.. తుది ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News