బెత్లహేం నగరంలో కానరాని క్రిస్మస్ శోభ... కారణం ఇదే!
ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఆదివారం అర్ధరాత్రి నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి
ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఆదివారం అర్ధరాత్రి నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు అత్యంత భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారు. బెత్లహేం నగరంలో పశువుల పాకలో కన్య మరియ గర్భాన్న యేసు క్రీసు మనిషిగా ఈ భూమిపైకి వచ్చారని తలచుకుంటూ.. సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా క్రిస్మస్ అసలు లక్ష్యాలను దైవసేవకులు ప్రజలకు వివరిస్తున్నారు.
ఈ సమయంలో జీసెస్ క్రైస్ట్ జన్మించిన బెత్లహేం నగరంలో మాత్రం క్రిస్మస్ సంబరాలు కనిపించడం లేదు. అవును... ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లోని క్రైస్తవులు పెద్దఎత్తున క్రీస్తు జన్మదిన సంబరాల్లో మునిగిపోయారు. ఇందులో భాగంగా రంగురంగుల దీపాలతో ఇళ్లను, చర్చిలను, క్రిస్మస్ ట్రీలను అలంకరించారు. కేకులు, బహుమతులను ఇచ్చిపుచ్చుకుంటున్నారు. "క్రీస్తు నేడు పుట్టెను.. హల్లేలూయ" అని నినాదాలు చేస్తున్నారు!
ఆ సంగతి అలా ఉంటే... క్రైస్తవులకు అత్యంత పవిత్ర ప్రదేశాల్లో ఒకటైన జెరూసలెంలోని బెత్లహెంలో మాత్రం ఈ ఏడాది క్రీస్తు జన్మదిన వేడుకలు బోసిపోయాయి. ఇజ్రాయెల్ - హమాస్ మధ్య బీకర యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో.. క్రీస్తు జన్మించిన బెత్లహేం నగరంలో ఈసారి క్రిస్మస్ సంబరాలు నిర్వహించరాదని నిర్ణయించారు.
దీంతో మాంగర్ స్క్వేర్ లో అందంగా అలంకరించే విద్యుత్ దీపాలు, క్రిస్మస్ ట్రీ వంటివి కనిపించలేదు. ఇదే సమయంలో... వెస్ట్ బ్యాంక్ పట్టణానికి పెద్దఎత్తున చేరుకునే టూరిస్టులు, బ్యాండ్ ఊరేగింపుల హడావుడి లేదు. మరోపక్క రష్యా – ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ లో కూడా క్రిస్మస్ సందడి అంతంతమాత్రంగానే ఉంది.
మరోపక్క వాటికన్ సిటీలో జరిగిన వేడుకల్లో పోప్ ప్రాన్సిస్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం శాంతి సందేశమిచ్చారు.
సీ.ఎస్.ఐ. చర్చిలో జగన్!:
ఇదే సమయంలో... ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రోజుల కడప పర్యటనలో భాగంగా మూడో రోజు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా.. ఈరోజు ఉదయం 8:30 గంటలకు ఇడుపులపాయ నుండి బయలుదేరి 8:50 కి పులివెందులలోని భాకరాపురం హెలిపాడ్ కు చేరుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి అక్కడ నుండి నేరుగా సీ.ఎస్.ఐ. చర్చికి వెళ్లారు.
పులివెందులలోని సీ.ఎస్.ఐ. చర్చిలో సీఎం జగన్ తో పాటు, వైఎస్ విజయమ్మ తదితరులు ప్రార్థనల్లో పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం సీఎం జగన్, వైఎస్ విజయమ్మ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.