చంద్రన్న సంక్రాంతి కానుకలు లేనట్లేనా?
అయితే ఈ ఏడాది సంక్రాంతి సమీపిస్తున్నా ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు సంక్రాంతి కానుకలపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఏపీలో ఈ సంక్రాంతికి ప్రత్యేక కానుకలు లేనట్లేనని తెలుస్తోంది. చంద్రబాబు 3.0 సర్కారులో ఏటా ఈ పథకం కోసం రూ.287 కోట్లు ఖర్చు చేసేవారు. రాష్ట్రంలో మొత్తం కోటి 30 లక్షల మంది కార్డుదారులకు ఆరు రకాల సరుకులు ఉచితంగా పంపిణీ చేసేవారు. అయితే ఈ ఏడాది సంక్రాంతి సమీపిస్తున్నా ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు సంక్రాంతి కానుకలపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ ఇవ్వాలని అనుకుంటే జనవరి 1వ తేదీ నుంచే పంపిణీ చేయాల్సివుంది.
తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతిని ప్రతిపేదవాడు ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో 2014-19 మధ్య ఏటా క్రిస్మస్, సంక్రాంతి, రంజాన్ పండుగలకు చంద్రన్న కానుకలుగా ఆరు రకాల సరుకులను సరఫరా చేసేవారు. అందులో కిలో గోధుమపిండి, కిలో పామాయిల్, అరకిలో శనగలు, అరకిలో బెల్లం, వంద గ్రాముల నెయ్యి, అర కిలో కందిపప్పు ఉండేవి. ఒక్కోకార్డుదారుకి రూ.220 విలువ గల సరుకులను ఉచితంగా పంపిణీ చేసేవారు. అప్పట్లో ఈ పథకం కింద రూ.287 కోట్లను ప్రభుత్వం వెచ్చించేది. అయితే ఇప్పుడు కార్డుదారుల సంఖ్య పెరగడంతో ప్రభుత్వంపై అదనపు భారం పడుతుంది.
ఆరు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. గత ఐదేళ్లకు ముందు అమలు చేసిన అనేక పథకాలను పునరుద్ధరించింది. ప్రజలు ఎంతో ఆదరించిన చంద్రన్న సంక్రాంతి కానుకలు మళ్లీ ఇస్తారని కార్డుదారులు కూడా ఆశించారు. కానీ, ప్రస్తుతం ప్రభుత్వంపై ఈ పథకంపై అస్సలు ఆసక్తి చూపలేదు. ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోవడంతో నెలనెల పింఛన్లు, జీతాలకే ప్రభుత్వం కటకటలాడాల్సివస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని రకాల సంక్షేమ పథకాలను ప్రస్తుతానికి వాయిదా వేయాలనే ప్రభుత్వ అధినేత ఆలోచించినట్లు చెబుతున్నారు.
ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ధరలు మండిపోతున్నాయి. కిలో కందిపప్పు రూ.140 పలుకుతోంది. రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం కిలో రూ.70 చొప్పున సరఫరా చేయడంతో కందిపప్పు ధర ఇప్పుడిప్పుడే దిగివస్తోంది. గతంలో రూ.200 ఉన్న కందిపప్పు ప్రభుత్వ చర్యలతో రూ.140కి చేరింది. అయిన్పటికీ పండగ పూట ప్రభుత్వమిచ్చే ఉచిత సరుకుల కోసం ప్రజలు ఆశగా చూస్తున్నారు. అయితే ఈ ఏడాది సరుకులు సరఫరా చేసే పరిస్థితి లేదని తెలిసి ఉసూరుమంటున్నారు.