రూ.6 వేల కోట్ల స్కాంలో ఇద్దరు టీమ్ ఇండియా స్టార్లు.. మరికొందరూ?
ఇప్పడు ఇలానే పొదుపు చేయబోయి టీమ్ ఇండియా క్రికెటర్లు చిక్కుల్లో పడ్డారు.
భారీగా వచ్చి పడే డబ్బును అంతే సవ్యంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉన్నప్పటికీ కొన్నిసార్లు మన చేతుల్లో ఏమీ ఉండదు. ఇప్పడు ఇలానే పొదుపు చేయబోయి టీమ్ ఇండియా క్రికెటర్లు చిక్కుల్లో పడ్డారు. బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ రేటు ఇస్తామని గుజరాత్ లోని పలు ప్రాంతాల ప్రజలను నమ్మించి మోసగించారు భూపేంద్ర సింగ్ ఝలా అనే వ్యక్తి. ఇది పోంజీ స్కామ్ గా దేశవ్యాప్తంగానూ సంచలనం రేపింది. ఈ స్కామ్ ప్రకంపనలు ఇప్పుడు క్రికెటర్లనూ తాకాయి.
మోసం 6 వేల కోట్లు..
అధిక వడ్డీ పేరిట బీజెడ్ గ్రూప్ సీఈవో భూపేంద్ర సింగ్ ప్రజలను రూ.6 వేల కోట్లకు మోసం చేశాడనేది అభియోగం. ఈయనను గుజరాత్ సీఐడీ అరెస్టు కూడా చేసింది. అయితే, ఇదే కేసులో ఐపీఎల్ జట్టు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ తో పాటు ఆ జట్టు సభ్యులు సాయి సుదర్శన్, రాహుల్ తెవతియా, మోహిత్ శర్మ కూడా పెట్టుబడి పెట్టారు. ఈ నేపథ్యంలో వీరందరికీ నోటీసులు జారీ అయ్యాయి. వీరి నుంచి వివరాలు సేకరించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకోనుంది.
గిల్ పెట్టుబడి రూ.1.95 కోట్లు
బీజెడ్ గ్రూప్ లావాదేవీల్లో గిల్ రూ.1.95 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. మిగతావారు కాస్త తక్కువ మొత్తం పెట్టారని తెలుస్తోంది. ఈ గ్రూప్ నకు చెందిన రూ.450 కోట్ల లావాదేవీలపై గుజరాత్ సీఐడీ ఆరాతీస్తోంది.
ప్రశ్నించడం ఖాయమా?
టీమ్ ఇండియా కీలక బ్యాటర్ అయిన శుబ్ మన్ గిల్ ప్రస్తుతం బోర్డర్ గావస్కర్ ట్రోఫీ సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో ఉన్నాడు. నోటీసులు జారీ అయిన మిగతా క్రికెటర్లలో సాయి సుదర్శన్ టీమ్ ఇండియా తరఫున ఆడాడు. మోహిత్ శర్మ వెటరన్. తెవతియా ఇంకా అరంగేట్రం చేయాల్సి ఉంది. కాగా, గిల్ భారత్ కు వచ్చాక సమన్లు అందజేసి విచారణ చేపట్టే అవకాశం ఉంది.
బీజెడ్ గ్రూప్ అధినేత భూపేంద్ర.. అధిక వడ్డీ ఆశ చూపి గుజరాత్ వ్యాప్తంగా డబ్బు సేకరించాడు. సంస్థ పనితీరుపై అనుమానం రావడంతో 3 నెలల క్రితం సీఐడీకి ఫిర్యాదులు వెళ్లాయి. కుంభకోణం వెలుగులోకి వచ్చాక బీజెడ్ సంస్థకు చెందిన 10 మందికి పైగా ఏజెంట్లను అరెస్ట్ చేశారు. కార్యాలయాలపై దాడులు చేశారు. భూపేంద్ర ప్రజలను సేకరించిన డబ్బుతో విలాసంగా జీవించినట్లు తేలింది.