40 ఏళ్ల తర్వాత 377 టన్నుల విషపూరిత వ్యర్థాల తరలింపు
తాజాగా అంటే.. బుధవారం (జనవరి 1న) రాత్రి యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి దాదాపు 377 టన్నుల (ఒక టన్ను అంటే వెయ్యి కేజీలు) విషపూరిత వ్యర్థాలను పారవేయటం కోసం తీసుకెళ్లిన వైనం వెలుగు చూసింది.
ఇప్పుడు మీరు చదివే సమాచారం విన్నంతనే ఉలిక్కిపడతారు. నిజంగా జరిగిందా? అసలు ఇది కరెక్టేనా? అలా ఎలా సాధ్యం? వ్యవస్థలు మరీ ఇంతలా వ్యవహరిస్తాయా? లాంటి బోలెడన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. అయితే.. ఇలాంటివి మనకు మాత్రమే సాధ్యమని చెప్పాలి. ఇంతకూ విషయంలోకి వెళితే.. నాలలుగు దశాబ్దాల క్రితం మధ్యప్రదేశ్ లోని భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరగటం తెలిసిందే. ఈ దుర్ఘటన అనంతరం టన్నుల కొద్దీ పేరుకుపోయిన విష వ్యర్థాల తరలింపు జరిగిందా? అంటే లేదట.
తాజాగా అంటే.. బుధవారం (జనవరి 1న) రాత్రి యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి దాదాపు 377 టన్నుల (ఒక టన్ను అంటే వెయ్యి కేజీలు) విషపూరిత వ్యర్థాలను పారవేయటం కోసం తీసుకెళ్లిన వైనం వెలుగు చూసింది. భోపాల్ కు 250 కిలోమీటర్ల దూరంలోని ధార్ జిల్లాలో పితంపూర్ పారిశ్రామిక వాడకు 12 సీల్డ్ కంటైనర్ ట్రక్కుల్లో ఈ విషపూరిత వ్యర్థాల తరలింపు జరిగింది.
నిజానికి ఈ విష వ్యర్థాల తరలింపుపై సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. అదిప్పటివరకు వాస్తవ రూపం దాల్చలేదు. భోపాల్ లోని యూనియన్ కార్బైడ్ వ్యర్థాలను తొలగించనందుకు మధ్యప్రదేశ్ హైకోర్టు ఇటీవల తన అసంత్రప్తిని వ్యక్తం చేసింది. అక్కడి విషపూరిత వ్యర్థాలను తరలించటానికి నాలుగు వారాలు గడువు విధించింది. ఒకవేళ తమ ఆదేశాల్ని పాటించకపోతే ధిక్కార చర్యలు తీసుకుంటామని ప్రభుత్వాన్నిహైకోర్టు హెచ్చరించటంతో కానీ.. వ్యర్థాల తరలింపు సాధ్యమైంది.
ఇదిలా ఉంటే.. ఈ వ్యర్థాలు ఎంత విషపూరిత అన్నది అర్థం చేసుకోవటంలో విఫలమైనట్లుగా చీఫ్ జస్టిస్ ఎస్ కే కైట్.. జస్టిస్ వివేక్ జైన్ లతో కూడిన డివిజన్ బెంచ్ పేర్కొంది. పితంపూర్ లోని వ్యర్థ పదార్థాల యూనిట్ లో తొలుత కొంత వ్యర్థాలను కాల్చేస్తామని.. వాటిలో ఇంకా ఏదైనా హానికరమైన పదార్థం మిగిలి ఉందా? లేదా? అని తెలుసుకోవటానికి అవశేషాలను పరీక్షిస్తామని స్వతంత్ర కుమార్ సింగ్ వెల్లడించారు.
విషపూరిత మూలకాల జాడలు లేవని నిర్దారించిన తర్వాతే ఈ బూడిదను మట్టిలోకి.. నీటిలోకి చేరకుండా పూడ్చి వేస్తామన్నారు. మరోవైపు ఈ వ్యర్థాలను కాల్చివేయటం వల్ల సమీప గ్రామాల్లోని మట్టి.. భూగర్భ జలాలు.. నీటి వనరులు కలుషితమవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. 2015లో పీతాంపూర్ లో ప్రయోగాత్మకంగా 10 టన్నుల వ్యర్థాలను కాల్చివేసే సమయంలో ఆందోళన వ్యక్తమైంది. తాజాగా కూడా ఈ వ్యర్థాల తరలింపుపై పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
మరోవైపు.. ఈ వ్యర్థాల తరలింపునకు 12 కంటైనర్ ట్రక్కులు వినియోగించారు. వ్యర్థాలను ప్యాక్ చేసి ట్రక్కుల్లో లోడ్ చేయటానికి అరగంట చొప్పున షిప్టులో సుమారు వంద మంది పని చేసినట్లుగా చెబుతుున్నారు. ఈ సిబ్బంది ఆదివారం నుంచి పని మొదలు పెట్టి.. బుధవారంతో పూర్తి చేశారు. విష వ్యర్థాల తరలింపునకు వినియోగించిన వాహనాలు ఎక్కడా ఆగకుండా ఉండేలా గ్రీన్ కారిడార్ ను ఏర్పాటు చేశారు. ఈ వాహనాల్లో ఏడు గంటల్లో ధార్ జిల్లాలోని పితంపూర్ పారిశ్రామిక ప్రాంతానికి చేరుకున్నాయి.