అల్లు అర్జున్ ఇష్యూ.. పవన్ కల్యాణ్ అసలేం మాట్లాడారంటే?
"గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా తెచ్చారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చాలా కష్టపడి పైకి వచ్చారు. ఆయన వెరీ టఫ్ లీడర్.
సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటన, హీరో అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. మంగళగిరిలో సోమవారం జరిగిన మీడియా చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. అయితే పవన్ మాట్లాడిన వీడియో బైట్ లేకపోవడం వల్ల, ఎవరికి అందిన సమాచారం మేరకు వాళ్ళు స్క్రోలింగ్ లు వేసి రకరకాలుగా వార్తలు ప్రసారం చేసారు. బన్నీదే తప్పు అని పవన్ కల్యాణ్ అన్నారని ఒకరు కథనాలు రాస్తే, ఈ ఘటనలో అల్లు అర్జున్ ని ఒంటరిని చేసారని అన్నట్లుగా మరొకరు వార్తలు అందించారు. ఈ నేపథ్యంలో జనసేనాని మీడియా సమావేశానికి సంబంధించిన వీడియోని జనసేన పార్టీ అధికారిక యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసారు. అందులో పవన్ కల్యాణ్ ఏం మాట్లాడారంటే...
"గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా తెచ్చారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చాలా కష్టపడి పైకి వచ్చారు. ఆయన వెరీ టఫ్ లీడర్. ఆయన చాలా బాగా చేస్తున్నారు. కొన్నిసార్లు లైక్ చెయ్యొచ్చు, లైక్ చేయకపోవచ్చు. ప్రతిదాన్ని అభినందించాల్సిన అవసరం లేదు.. ప్రతీ ఒక్కటీ అందరికీ నచ్చాలని లేదు. ఈ ఘటన విషయానికొస్తే, గత వైసీపీ ప్రభుత్వ పాలన మాదిరిగా రేవంత్ పరిపాలన లేదు. వైసీపీ పాలనలో కారణం లేకపోయినా వాళ్ళు గొడవ కోరుకునేవారు. క్యూరియాసిటీతో టికెట్ రేట్లు ఎలా ఉన్నాయని నేను కనుక్కుంటే, ఇక్కడ 50 రూపాయలు అక్కడ 5 రూపాయలు.. ఇక్కడ 75 రూపాయలు అక్కడ 10 రూపాయలు అని చెప్పారు. ఫుట్ ఫాల్స్ ఎక్కువ ఉన్నాయి కానీ, ఐదులు పదులు పాతికలు అన్నారు. కానీ తెలంగాణ గవర్నమెంట్ ఆ విధంగా వ్యవహరించలేదు. 'సలార్' లాంటి బిగ్ ఫిలిమ్స్ కి బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చారు. 'పుష్ప 2' సినిమాకి కూడా అధిక ధరలతో బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చారు. రేట్లు పెంచడం వల్లనే రికార్డ్స్ క్రియేట్ అవుతున్నాయి''
''నార్మల్ గా ఇండియాలో ఏ యాక్టర్ అయినా.. బాంబేలో అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్ అయినా వాళ్ళ ఇళ్లలో నుంచి బయటకు తమ పట్ల ప్రేమ చూపించే అభిమానులకు కనిపించి అదే ప్రేమని చూపిస్తారు. అలానే ప్రతీ హీరో కూడా బయటకు వచ్చి జనాలకు చేతులు ఊపి, అభివాదం చేయాలని అనుకుంటారు. అది కొంచం టఫ్ కూడా. అందులోనూ భారీ అంచనాలు ఉన్న సినిమాకి హీరోలు వస్తున్నారంటే ఎక్కువ మంది వస్తారు. అల్లు అర్జున్ ఘటన ముందు, వెనుక ఏం జరిగిందో నాకు తెలియదు. ఆడియన్స్ కి ఫిలిం ఎక్స్ పీరియన్స్ ని పాడు చేయడం ఎందుకులే అని నేను థియేటర్లకు వెళ్ళను. మూడో సినిమా అప్పటి నుంచే నేను వెళ్లడం మానేసాను. సినిమా బాగుంటే జనాల ప్రశంసలు చూడాలని హీరోలు థియేటర్ కు వెళ్లాలని కోరుకుంటారు. ఎందుకంటే స్తుతి కావాలి. దేవుడికి కూడా మీరు గొప్పవారు అని చెప్పాలి. ఏ పనిలో అయినా ప్రశంసలు కోరుకుంటారు. అలానే తన వర్క్ ఎలా ఉందనేది చూడటానికి హీరోలు థియేటర్లకు వెళ్తారు. 100 కోట్లు, 1000 కోట్లు వచ్చాయనేది మ్యాటర్ కాదు.. అప్రిసియేషన్ కి వెలకట్టలేం. జనరల్ గా థియేటర్ కు వెళ్లడం అందరం మానేసాం. 3 ఏళ్ళు వర్క్ చేసిన మచ్ అవైటెడ్ ఫిలిం కావడంతో ఆరోజు థియేటర్ కు వెళ్లాలని అనుకొని ఉంటాడని భావిస్తున్నా''
''పోలీసులు తమకు ఇంఫార్మ్ చేయలేదని చెబుతున్నారు. నేను పోలీసులను తప్పుబట్టలేను. ఎందుకంటే భద్రత గురించే వారు ఆలోచిస్తారు. అందుకే ఎప్పుడైనా పోలీసులు ఏదైనా చెప్పినప్పుడు మనం తప్పకుండా అర్థం చేసుకోవాలి. అక్కడ తగిన ఏర్పాట్లు, మరిన్ని సన్నాహాలు చేసి ఉండాల్సిందని నాకు అనిపించింది. నా చిన్నప్పుడు చిరంజీవి కూడా థియేటర్లకు వెళ్లేవారు. ఫేస్ కనిపించకుండా ముసుగు వేసుకుని ఎవరు లేకుండా ఒక్కరే వెళ్ళిపోయేవారు. ప్రేక్షకుల అనుభూతిని అర్థం చేసుకోడానికి వెళ్లేవారు. అప్పట్లో ప్రతి ఒక్కరూ అలానే థియటర్ కు వెళ్లేవారు. కానీ ఇప్పుడు కెమెరాల వల్లనో ఏమో అలా కుదరడం లేదు. నేను కూడా ఎప్పుడైనా ఎయిర్ పోర్టులో క్యాప్ పెట్టుకొని వెళ్తే, కళ్ళు చూసి గుర్తు పట్టేస్తున్నారు. ఇక్కడ ఈ ఘటన జరగడం చాలా బాధాకరం. థియేటర్ స్టాఫ్ ముందే అల్లు అర్జున్ కి చెప్పి ఉండాల్సింది. అల్లు అర్జున్ లోపల కూర్చొని సినిమా చూస్తున్నాడు కాబట్టి, ఆయనకు ఇది తెలియకపోవచ్చు. కానీ విషయం తెలిసినవారు ఎవరో ఒకరు వెళ్లి ఇష్యూ గురించి చెప్పాల్సింది. బేసిక్ సెంటిమెంట్ ఏంటంటే.. తెలంగాణ ప్రభుత్వం ఈ ఇష్యూలో సాఫ్ట్ గా వెళ్ళుండొచ్చని కొందరికి అనిపించి ఉండొచ్చు. కానీ చట్టం ముందు అందరూ సమానమే. నేను తప్పు చేసినా నన్ను శిక్షించవచ్చు. నువ్వు ఎంత పాపులర్, ఎంత పవర్ ఫుల్ అనేది పట్టించుకోరు.''
''ఒక్కోసారి ఇలాంటి ఘటనలు జరిగినా మనకు తెలియకపోవచ్చు. కొన్నిసార్లు జనాలు అరుస్తూ ఉంటారు కానీ, అక్కడ ఏం జరిగిందనేది నాకు కూడా అర్థం కాదు. వాళ్ళు ఏం చెప్తున్నారనేది వినిపించదు. సినిమా చూడటానికి వచ్చి ఒక మహిళ చనిపోవడం చాలా బాధాకరం. గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా తెచ్చారు అని ఎందుకు అన్నానంటే, అది జరిగిన తర్వాతి రోజు ఆ బాధిత కుటుంబం ఇంటికి వెళ్ళాల్సింది. హీరో అల్లు అర్జున్ కి కూడా తెలియక్కర్లేదు.. ప్రొడ్యూసర్స్ లేదా డైరెక్టర్ లేదా యూనిట్ లోని ఎవరైనా వెళ్లి మీ బాధలో అండగా మేమున్నాం అని వాళ్ళకి చెప్పి ఉండాల్సింది. అలా చేసారో లేదో నాకు తెలియదు. ఒక్కోసారి మనం తిట్లు తినాల్సి వస్తుంది. ఇన్స్టెంట్ రియాక్షన్ ఉండాలి. ఒక్కోసారి నాకోసం పోస్టర్లు కడుతూ కరెంట్ తీగలు తగిలి చనిపోతారు. నేను వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్లి పరామర్శించాలి. అది ఇక్కడ లోపించింది. మేము దీనికి చింతిస్తున్నాం.. ఇంతమంది మీకు అండగా ఉన్నామని వాళ్ళకి చెప్పి ఉంటే బాగుండేది. థియేటర్ వద్ద తగిన ఏర్పాట్లు చేసుకొని ఉండాల్సింది. ఒక్కోసారి అభివాదం చెయ్యకపోతే, అది సెలబ్రేట్ చేసుకున్నట్లు కాదు. లోపల ఏం జరిగిందనేది తెలియకపోయినా, నేను బయటకు వెళ్లకపోతే నాకు పొగరు అనుకుంటారు. అందుకే బేసిక్ గా ఏ హీరో అయినా చెయ్యి ఊపాలి... నమస్కారం పెట్టాలి అనుకుంటాడు. అది ఎంజాయ్ చేయడం కాదని భావించాలి''
''ఘటన జరిగిన మూడో రోజు ఆ ఫ్యామిలీని హీరో కలిసి ఉండొచ్చు కదా అనుకోవచ్చు. కానీ మన వల్ల ఒక మనిషి చనిపోయారని అతని మనసులో ఒక బరువు ఉంటుంది. అందుకే ఎవరైనా వెళ్లి ఆ బరువుని హ్యాండిల్ చేసుండాలి. అల్లు అర్జున్ తరపున కొంతమంది వెళ్లి కూర్చొని ఆ ఫ్యామిలీతో మాట్లాడాల్సింది. మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయిందని సారీ చెప్పి విచారం వ్యక్తం చేయాల్సింది. ఆ బిడ్డ కోసం ఏదైనా గుడికి వెళ్లి ప్రార్ధనలు చేసి ఉండొచ్చు. సారీ చెప్పడానికి చాలా విధానాలు ఉన్నాయి. నా తప్పు లేదు కానీ, నేను ఉన్నప్పుడు నా ద్వారా జరిగింది కాబట్టి వాళ్ళ టీం ఇదంతా చేసి ఉండాల్సింది. కానీ ఒక హీరోని మాత్రమే బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. సినిమాని ఒక టీం గా తీసినప్పుడు, సమస్యను కూడా టీంగానే తీసుకోవాలి, కానీ ఇక్కడ మొత్తం తీసుకెళ్లి హీరో మీద పెట్టాశారు. అతన్ని ఒంటరి వాడిని చేసారు. అది నాకు కరెక్ట్ అనిపించలేదు. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో ఎవరూ అతన్ని గైడ్ చేయలేదు. ఒకసారి కేసు పెడితే పోలీసులను ప్రశ్నించకూడదు''
"సీఎం రేవంత్ రెడ్డి.. అల్లు అర్జున్ అనే కాదు, ఆ స్థానంలో నేను ఉన్నా అలానే చేసేవారు. అందులో డౌటే లేదు. ఎందుకంటే అతను రేవంత్ రెడ్డి. నువ్వు ఎవరు అనేది కాదు అక్కడ, ఏం జరిగిందనేది. పేరు చెప్పలేదని ఇలా చేశారనడం సరికాదు. అతను అలాంటి వ్యక్తి కాదు. 'పుష్ప 2' సినిమాకి బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లకు సహకారం అందించారు. ఆయన్ను ఎందుకు తప్పుబట్టాలి?. జగన్ లాగా నలిపేస్తే తప్పు అవుతుంది. కానీ ఇక్కడ అలా జరగలేదు. ఆయన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పక్కన నిలబడ్డారు. ఆ ఘటన జరిగిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోయాయి. అది ఎవరి చేతుల్లోనూ లేదు. నేను సీఎం హోదాలో ఉండి అరెస్ట్ చేయొద్దని చెబితే.. మీరు ఇది ఉపేక్షిస్తే రేపు మాకు ప్రాబ్లమ్ వస్తుందని పోలీసులు అంటారు. అది రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. అందుకే ఆయన కఠిన నిర్ణయం తీసుకున్నారు''
''ఓవరాల్ గా ఇవన్నీ చూస్తే, ఎక్కడో మానవతా దృక్పధం లోపించింది అనిపిస్తుంది. ఇక్కడ టీం ఫాల్ట్ కూడా ఉంది. దర్శక నిర్మాతలు హీరో పక్కన నిలబడి, ఫస్ట్ ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఇంటికి వెళ్లి సంతాపం చెప్పి ఉండొచ్చు. కానీ వాళ్ళు అలా చేయలేదు. రేవంత్ రెడ్డి పార్టీ పరంగా ఆలా చేసారని అనుకోడానికి, అల్లు అర్జున్ మామ కాంగ్రెస్ లోనే ఉన్నారు. టికెట్ రేట్లు పెంచి పరోక్షంగా విజయానికి దోహదపడ్డారు. వీళ్లంతా చిన్నప్పటి నుంచీ ఆయన చుట్టుపక్కల తిరిగినవాళ్ళే. రేవంత్ రెడ్డి మాకు చాలా కాలంగా తెలుసు. రామ్ చరణ్, రానా లాంటి వారు జూబ్లీ హిల్స్ లో తిరుగుతున్నప్పుడు రేవంత్ రెడ్డి వీళ్ళందరికీ సూపర్ సీనియర్ అనుకోండి. ఏదేమైనా ఇలా జరగడం దురదృష్టకరం. నేను డిప్యూటీ సీఎం అయినా చట్ట ప్రకారం నా మీద కేసు పెడితే దాన్ని నేను కొట్టేయలేను. అందుకే అందరూ కూర్చొని కరెక్ట్ గా ఆలోచించాల్సింది. గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా తెచ్చారు'' అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.