2024: షర్మిల ఓ దివాస్వప్నం!
సీనియర్ల నుంచి జూనియర్ల వరకు కూడా.. పార్టీ పునర్వైభవం వస్తుం దని భావించారు.
అది.. ఫిబ్రవరి, 16వ తేదీ 2024.. ఢిల్లీ వేదికగా ఏపీ కాంగ్రెస్ పగ్గాలను వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ.. వైఎస్ షర్మిలకు అప్పగిస్తున్నట్టు ఆ పార్టీ సీనియర్ నాయకుడు కేసీ వేణుగోపాల్ మీడియా సమావేశంలో ప్రక టించారు. అప్పటికే ఓ వారం అటు ఇటుగా ఆమె తన సొంత పార్టీ వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. అనంతరం.. ఆమెను ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా నియమించారు. దీంతో ఏపీలో కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకున్నారు. సీనియర్ల నుంచి జూనియర్ల వరకు కూడా.. పార్టీ పునర్వైభవం వస్తుం దని భావించారు.
అనంతరం.. కుమారుడి వివాహం నేపథ్యంలో బాధ్యతలు తీసుకోవడం కొంత ఆలస్యమైనా.. తర్వాత మార్చి మొదటి వారంలో ఏపీలోకి వచ్చారు షర్మిల. ఆమె ముందు అత్యంత కీలకమైన బాధ్యత ఉంది. అదే.. పడిపోయిన పార్టీ గ్రాఫ్‌ను తిరిగి నిలబెట్టాల్సి ఉంది. అదేసమయంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకును తిరిగి పెంచాల్సి ఉంది. ఈ రెండు అంశాల్లోనూ వైఎస్సార్ తనయగా ఆమె దూకుడు చూపించి.. పార్టీకి జవజీవాలు అందిస్తారని అందరూ ఆశించారు. పార్టీ అధిష్టానం కూడా ఇదే ఆశలు పెట్టుకుంది.
అయితే.. అందరూ ఆలోచించిన విధంగా అయితే.. షర్మిల అడుగులు వేయలేక పోయారు. తన సోదరుడు అప్పటి ముఖ్యమంత్రి జగన్‌ను టార్గెట్ చేయడంతోపాటు.. తమ బాబాయి వివేకానందరెడ్డి హత్య కేసు విషయాన్ని ఎన్నికల సమయంలోప్రచారం చేశారు. ఊరూ వాడా ఈ రెండు విషయాలనే ఆమె ప్రచారం చేయడం గమనార్హం. ఇది ఆమెకు వ్యక్తిగతంగా కలిసి రావొచ్చేమో.. కానీ, పార్టీ పరంగా సీనియర్లను హర్ట్ అయ్యేలా చేసింది. ఎన్నికల సమయంలోనూ.. తన కోటరీని ఏర్పాటు చేసుకున్నారని.. వారికే టికెట్లు ఇచ్చుకున్నారన్న చర్చ కూడా సాగింది.
ఇక, ఎన్నికల సమయంలోనూ.. ఆమె కడప నుంచి పార్లమెంటుకు పోటీ చేసినా.. కొంగు చాపి అర్ధించినా.. డిపాజిట్లు దక్కించుకోలేక పోయారు. అయితే.. వైసీపీని గద్దె దించడంలో మాత్రం కీ పాత్ర పోషించారన్న ఒక్క అంశం మాత్రమే ఆమెకు ఈ సంవత్సరం మిగిల్చింది. తర్వాత కూడా.. పార్టీపై దృష్టి పెట్టలేక పోయారు. పార్టీని గ్రౌండ్ లెవిల్లో ముందుకు తీసుకువెళ్లలేక పోయారు. పైగా.. ఆస్తుల వివాదం సహా.. ప్రజా సమస్యల్లోనూ.. వైసీపీని జొప్పించి.. చేసిన విమర్శలు వంటివి ఓ వర్గం ప్రజలకు ఎక్కలేదు.
మరీ ముఖ్యంగా తనను విమర్శిస్తున్నవారిని కత్తికట్టినట్టు పార్టీ నుంచి సస్పెండ్ చేయించారన్న పేరు మోయాల్సి వచ్చింది. పార్టీ అధిష్టానం కూడా.. షర్మిల విషయంపై చూసీచూడనట్టు వ్యవహరించింది. ఇక, ఇంత జరుగుతున్నా పార్టీ అధిష్టానం పట్టించుకోనప్పుడు.. తమకెందుకని సీనియర్లు కూడా తప్పుకొన్నారు. ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్‌లో షర్మిల తప్ప.. మరొకరు మాట్లాడడం లేదు. ఇతరుల మాట వినిపించడం లేదు. మొత్తానికి 2024 షర్మిలకు పగటి కలగానే(దివాస్వప్నం) మారిందనేది కాంగ్రెస్ నేతల మాట. ఎంతో స్కోప్ ఉన్నా.. ఎదిగేందుకు అనేక అవకాశాలు ఉన్నా.. ఆమె సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యారు.