అఖిలమ్మ రక్తంలోనే నంద్యాల...తేల్చుడే మరి
అయితే ఇదే ఒక సంకేతమని, అఖిల ఫ్యామిలీకి నంద్యాలకు సంబంధం ఇక లేదని ప్రచారం చేస్తున్నారు సొంత పార్టీలోని ప్రత్యర్ధులు.
భూమా ఫ్యామిలీ అంటేనే దూకుడుకు మారుపేరు. దానికి ఎన్నో ఉదాహరణలు చరిత్రలో ఉన్నాయి. భూమా నాగిరెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తరువాత మొదట టీడీపీ తరువాత ప్రజారాజ్యం, ఆ తరువాత వైసీపీ, మళ్లీ టీడీపీ ఇలా నాలుగు పార్టీలు మారారు. ఎక్కడకు వెళ్లినా తనకో సీటు, తన సతీమణి శోభా నాగిరెడ్డికి ఒక సీటు తెచ్చుకోవడం ఆనవాయితీ.
భూమా నాగిరెడ్డి హవా అలా చెల్లింది. ఆయన ధాటికి నంద్యాలలో సీనియర్ మోస్ట్ లీడర్ ఆయన కంటే ముందు నుంచి ఉన్న ఎస్ ఎం డీ ఫరూఖ్ వంటి వారు వెనక్కి వెళ్ళిపోయారు. ఇక భూమా నాగిరెడ్డి మరణం తరువాత వారంతా ముందుకు వద్దామని చూస్తున్నారు. అయితే 2017లో నాగిరెడ్డి మరణం సానుభూతిని సొంతం చేసుకోవడానికి ఆ కుటుంబం వారికే చంద్రబాబు టికెట్ ఇచ్చారు. అప్పట్లో మంత్రిగా ఉన్న అఖిలప్రియ హవా కూడా చెల్లింది.
తన కజిన్ భూమా బ్రహ్మానందరెడ్డికి టికెట్ 2019లో కూడా ఆమె ఇప్పించుకున్నారు. అయితే ఆమె సైతం ఆళ్ళగడ్డలో ఓడడం, వివాదాలో కూరుకుని పోవడంతో టీడీపీలో పలుకుబడి తగ్గింది. ఇక ఆళ్లగడ్డ టికెట్ కూడా అఖిలమ్మకు డౌట్ లో పడిన నేపధ్యంలో నంద్యాల ఊసు ఎక్కడిది అన్న చర్చ వస్తోంది.
అయితే కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నంద్యాల గురించి నిర్వహించిన సమీక్షలో ఇంచార్జిగా ఉన్న భూమా బ్రహ్మానందరెడ్డితో పాటు ఫరూఖ్, ఏవీ సుబ్బారెడ్డి వంటి కీలక నేతలను పిలిచారు. అఖిలను కానీ ఆమె సొంత సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డిని కానీ పిలవలేదు. దాంతో ఒకింత గుర్రుగా వారు అధినాయకత్వం మీద ఉన్నారు.
అయితే ఇదే ఒక సంకేతమని, అఖిల ఫ్యామిలీకి నంద్యాలకు సంబంధం ఇక లేదని ప్రచారం చేస్తున్నారు సొంత పార్టీలోని ప్రత్యర్ధులు. దీంతో మొదట జగత్ విఖ్యాత్ రెడ్డి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. నంద్యాల తన తండ్రి చివరి సారిగా గెలిచిన సీటు. అక్కడ నుంచే తన మొదటి రాజకీయ ప్రస్థానం జరుగుతుందని అన్నారు. వచ్చే ఎన్నికలలో తాను నంద్యాల బరిలో ఉంటాను అని చెప్పారు.
ఇపుడు అక్క అఖిలమ్మ కూడా అదే మాట అంటోంది. నంద్యాల మా రక్తంలోనే ఉంది అని ఆమె పవర్ ఫుల్ డైలాగ్ నే వాడారు. నంద్యాలలో మమ్మల్ని తిరగవద్దు అని చంద్రబాబు అనలేదు అని ఆమె స్పష్టం చేశారు. మాకు నంద్యాలలో బలం బలగం ఉన్నాయి. మాది నంద్యాల అంటూ ఆమె చేసిన బిగ్ సౌండ్ టీడీపీలో ప్రకంపనలు పుట్టిస్తోంది.
భూమా ఫ్యామిలీని కాదంటే రెండు సీట్లలో దెబ్బ పడుతుంది. అవును అన్నా కూడా ఇబ్బందే అవుతుంది. దాంతో టీడీపీ అధినాయకత్వానికి అఖిలప్రియ వ్యవహారం చాలా క్లిష్టమైన సవాల్ గా మారింది అని అంటున్నారు. మరో వైపు అక్కా తమ్ముడూ నంద్యాల మాది అని తేల్చేశారు. కచ్చితంగా పోటీ చేస్తామని అంటున్నారు.
ఇక మీదట ఇంకా విగరస్ గా తిరుగుతామని కూడా చెబుతున్నారు. సో నంద్యాల టికెట్ ఇవ్వకపోయినా వారు పోటీకి రెడీ అయితే పార్టీ ఏది అన్నది కూడా చర్చకు వస్తోంది. మరి వైసీపీ నుంచి ఏమైనా సిగ్నల్స్ వస్తున్నాయా అన్నది కూడా చూడాలని అంటున్నారు. ఇదిలా ఉంటే కర్నూల్ జిల్లాలో మొత్తం 14 సీట్లు ఉంటే మెజారిటీ సీట్లు వైసీపీకే ఈ రోజుకీ మొగ్గుతున్నాయి. ఇపుడు భూమా ఫ్యామిలీని సెట్ చేసుకోకపోతే ఇబ్బంది అవుతుంది అని టీడీపీ ఆలోచిస్తోంది అని అంటున్నారు.