కలవడానికి వస్తే బిల్‌ గేట్స్‌ నే గుర్తించలేదు!

తన సతీమణి మిలిండా గేట్స్‌ తో కలిపి మిలిండా–గేట్స్‌ ఫౌండేషన్‌ పేరుతో బిల్‌ గేట్స్‌ ప్రపంచవ్యాప్తంగా భారీ భూరీ విరాళాలు అందజేస్తున్నారు.

Update: 2024-03-01 10:07 GMT

మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ గురించి పరిచయం అక్కర్లేదు. ప్రపంచంలోనే టాప్‌ టెక్‌ దిగ్గజాల్లో ఒకరైన ఆయన ప్రపంచంలోని అపర కుబేరుల్లో ఒకరు. అంతేనా ఏటా లక్షల కోట్ల రూపాయలను స్వచ్ఛంధ సంస్థలకు, సేవా కార్యక్రమాలకు విరాళాలుగా ఇస్తున్నారు. తన సతీమణి మిలిండా గేట్స్‌ తో కలిపి మిలిండా–గేట్స్‌ ఫౌండేషన్‌ పేరుతో బిల్‌ గేట్స్‌ ప్రపంచవ్యాప్తంగా భారీ భూరీ విరాళాలు అందజేస్తున్నారు.

అలాంటి బిల్‌ గేట్స్‌ ను కలవాలని ఎంతోమంది ఆశ పడతారు. కనీసం ఆయన సమీపానికి వెళ్లినా చాలని సంబరపడతారు. అలాంటి బిల్‌ గేట్సే స్వయంగా ఒక వ్యక్తిని కలవడానికి ఏకంగా అమెరికా నుంచి భారత్‌ కు వస్తే ఆయన బిల్‌ గేట్స్‌ ను గుర్తుపట్టలేకపోయాడు. ఇప్పుడీ అంశం హాట్‌ టాపిక్‌ గా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. డాలీ చాయ్‌ వాలాగా సామాజిక మాధ్యమాల్లో బాగా పేరు సంపాదించిన మహారాష్ట్రలోని నాగ్‌ పూర్‌ కు చెందిన సునీల్‌ పాటిల్‌ ను బిల్‌ గేట్స్‌ కలవాలనుకున్నారు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవేముంది అన్నట్టు ఆయన పర్యటనకు అధికారులు, గేట్స్‌ వ్యక్తిగత సిబ్బంది ఏర్పాట్లు చేశారు. దీంతో గేట్స్‌.. సునీల్‌ పాటిల్‌ వద్దకు చేరుకున్నారు.

సునీల్‌ పాటిల్‌ ఇచ్చిన తేనీటిని బిల్‌ గేట్స్‌ సేవించారు. ‘వన్‌ చాయ్‌ ప్లీజ్‌’ అని టీని ఆర్డర్‌ చేసిన ఆయన.. డాలీ చాయ్‌ వాలా సునీల్‌ తనదైన శైలిలో తేనీటిని సిద్ధం చేస్తుంటే ఆసక్తిగా తిలకించారు.

టీ తాగుతూ.. ‘చాయ్‌ పే చర్చా’ కోసం ఎదురుచూస్తున్నా అని బిల్‌ గేట్స్‌ తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ గా మారింది.

కాగా టీ ఇచ్చేటప్పుడు బిల్‌ గేట్స్‌ ను చాయ్‌ వాలా సునీల్‌ పాటిల్‌ గుర్తు పట్టలేకపోయారు. గేట్స్‌ సైతం తాను ఫలానా అని అతడికి చెప్పలేదు. తాను బిల్‌ గేట్స్‌ను గుర్తుపట్టలేదని సునీల్‌ తెలిపారు. ఆయన ఫారిన్‌ కంట్రీకి చెందిన ఎవరో ఒక వ్యక్తి అని అనుకున్నానన్నారు. ఆయనను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదని చెప్పారు. తాను సౌత్‌ సినిమాలు చూసి స్టైల్‌ నేర్చుకున్నానన్నారు.

తమ వీడియో వైరల్‌ గా మారిన తర్వాతే బిల్‌ గేట్స్‌ ఎవరో తెలిసిందని సునీల్‌ చెప్పారు. ఆయనతో వీడియో చిత్రీకరణ కోసమే తనను హైదరాబాద్‌ తీసుకెళ్లారని కూడా తెలియదని వివరించాడు. ఇలాగే ఏదో ఒకరోజు ప్రధాని మోదీకి టీ ఇవ్వాలని ఉందని డాలీ చాయ్‌ వాలా సునీల్‌ తన కోరికను వ్యక్తం చేశాడు.

మరోవైపు భారత పర్యటనలో చాయ్‌ ని ఆస్వాదించిన బిల్‌ గేట్స్‌ సంబంధిత వీడియోను ఇనస్ట్రాగామ్‌ వేదికగా షేర్‌ చేశారు. భారత్‌ లో ఎక్కడ చూసినా ఆవిష్కరణలు కనిపిస్తాయని.. సాధారణ టీ తయారీలో కూడా అంటూ ఆయన ప్రశంసల వర్షం కురిపించారు, కాగా ఈ వీడియోను హైదరాబాద్‌ లో చిత్రీకరించారు.

Tags:    

Similar News