ఆరెస్సెస్ తో ఆరంభం...మమత కోట బద్ధలవుతుందా ?
పశ్చిమ బెంగాల్ లో మూడు సార్లు వరసగా ముఖ్యమంత్రిగా చేసి బెంగాల్ లేడీ టైగర్ గా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పేరు తెచ్చుకున్నారు.
పశ్చిమ బెంగాల్ లో మూడు సార్లు వరసగా ముఖ్యమంత్రిగా చేసి బెంగాల్ లేడీ టైగర్ గా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పేరు తెచ్చుకున్నారు. ఆమె 2011 నుంచి అప్రతిహతంగా అధికారాన్ని కొనసాగిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ చరిత్రలో దాదాపుగా రెండున్నర దశాబ్దాల పాటు ఏలిన ఘనత జ్యోతిబసుకు ఉంది. ఆయన తరువాత ఎక్కువ కాలం పాలించిన వారు బుద్ధదేవ్ భట్టాచార్య. కమ్యూనిస్టులను గద్దె దించిన మమతా బెనర్జీ ఇప్పటికి పద్నాలుగేళ్ళుగా సీఎం గా ఉన్నారు. వచ్చే ఏడాది మే నెలతో ఆమె పదవీ కాలం 15 ఏళ్ళకు పూర్తి అవుతుంది. ఆ నెలలోనే ఎన్నికలు ఉన్నాయి.
ఢిల్లీని స్వాధీనం చేసుకున్న బీజేపీ కదనోత్సాహంతో ఉంది. ఈసారి టార్గెట్ పశ్చిమ బెంగాల్ అనే అంటోంది. బెంగాల్ ని నిజానికి 2021లోనే గెలవాలని బీజేపీ తనదైన ప్రయత్నాలను ఎన్నో చేసింది. కానీ చిక్కలేదు అయినా సరే ఏకంగా 77 సీట్లు సాధించి బలమైన విపక్షంగా మారింది. అంతకు ముందు 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 3 సీట్లు 10.16 శాతం ఓటు షేర్ తెచ్చుకున్న బీజేపీ 2021 లో అదనంగా 74 సీట్లను గెలుచుకుంది. ఆ పార్టీ ఓటు షేర్ అయితే 38.15 శాతానికి ఎగబాకింది.
తృణమూల్ కాంగ్రెస్ కి ఈ పెరుగుదల వల్ల వచ్చిన నష్టం అయితే ఏమీ లేదు. ఆ పార్టీ కూడా 2016లో తెచ్చుకున్న 211 సీట్ల కంటే మరో నాలుగు అదనంగా దక్కించుకుని 215కి ఎగబాకింది. అంతే కాదు. 2016లో వచ్చిన 44.91 శాతం ఓటు షేర్ ని 2021 నాటికి 48.02 గా పెంచుకుంది. అంటే అదనంగా 3.11 శాతం దక్కించుకుంది అన్న మాట. మొత్తం 294 మంది సభ్యులు కలిగిన బెంగాల్ అసెంబ్లీలో ఈ రెండు పార్టీలే ఓట్లూ సీట్లూ తీసుకుంటే 2016లో 26 సీట్లు సాధించిన వామపక్షాలు కానీ 44 సీట్లు ఉన్న కాంగ్రెస్ కానీ జీరో నంబర్ కి పడిపోయాయి.
అయితే ఈసారి ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీ చేస్తామని ఇప్పటికే మమతా బెనర్జీ ప్రకటించారు. దాంతో వామపక్షాలు కాంగ్రెస్ కలసి పోటీ చేయవచ్చు. బీజేపీ ఈసారి బెంగాల్ కోటను బద్దలు కొట్టి దీదీని మాజీ సీఎం చేస్తామని కంకణం కట్టుకుంది. అరవింద్ కేజ్రీవాల్ తో పాటుగా మమతా బెనర్జీ కూడా ఎక్కువగా మోడీని కేంద్రాన్ని విమర్శిస్తూ వస్తున్నారు. ఇండియా కూటమికి తామే సారధులుగా వారధులుగా చెప్పుకుంటున్నారు.
అందువల్ల సొంత రాష్ట్రంలోనే ఓడించినట్లు అయితే కచ్చితంగా మమత ఇమేజ్ తో పాటు ఇండియా కూటమి కూడా వీక్ అవుతుందని బీజేపీ భావిస్తోంది. ఈ నేపధ్యంతో అన్ని అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుని బీజేపీ రంగంలోకి దిగుతోంది. పొరుగున ఉన్న బంగ్లాదేశ్ లో హిందువుల పట్ల అక్కడి ప్రభుత్వం అనుసరిస్తున్న మారణ కాండ కూడా పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కీలకం కాబోతున్నాయని హిందువుల ఓట్లను ఏకీకృతం చేస్తాయని భావిస్తున్నారు. హిందువులకు రక్షణ కల్పించేది బీజేపీయే అన్నది జనంలోకి బాగా తీసుకుని వెళ్ళడానికి ఆరెస్సెస్ కూడా రంగంలోకి దిగుతోంది.
ఈ నేపధ్యంలో కోల్కతాలో ఈ నెల 16న భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఆరెస్సెస్ సిద్ధపడుతోంది. దానికి అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో కోర్టుకు వెళ్ళి అనుమతిని ఆరెస్సెస్ నేతలు తెచ్చుకున్నారు. ఆరెస్సెస్ సభలో ఆ సంస్థ అధిపతి మోహన్ భగవత్ పాల్గొని ప్రసంగిస్తారు. ఆయన ఏమి మాట్లాడుతారు అన్నది సర్వత్రా ఆసక్తిని పెంచుతోంది.
ఢిల్లీ హర్యానా మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ విజయం వెనక తెర వెనక కీలక పాత్ర పోషించిన ఆరెస్సెస్ బెంగాల్ లోనూ అదే వ్యూహాన్ని అమలు చేయనుందని అంటున్నారు. హిందువులకు రక్షణ విషయంలో ఆరెస్సెస్ మొదటి నుంచి పోరాడుతుంది. బెంగాల్ ప్రభుత్వం మీద ఆరెస్సెస్ ఏ రకమైన విమర్శలు చేస్తుంది అన్నది కూడా చర్చగా ఉంది. మొత్తానికి మమతా బెనర్జీ కోటను బద్ధలు కొట్టేందుకు ఆరెస్సెస్ ఆరంభం పలికింది అని అంటున్నారు.