బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల కొట్లాట.. ఘర్షణకు కారణమిదే..?
అదే సమయంలో అక్కడే ఉన్న కొంతమంది బిజెపి కార్యకర్తలు కర్రలతో బయటకు వచ్చారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఆ పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీని ఉద్దేశించి రెండు రోజుల కిందట లేక చందన బిజెపి నేత రమేష్ బిధూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే నియోజకవర్గంలోని రహదారులన్నింటిని ప్రియాంక గాంధీ బుగ్గలు మాదిరిగా తీర్చిదిద్దుతాను అంటుూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేకెత్తించాయి.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు సదరు బిజెపి నేత వ్యాఖ్యలను ఖండించడంతోపాటు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రియాంక గాంధీపై బిజెపి నేత చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ హైదరాబాద్ నాంపల్లిలోని బిజెపి కార్యాలయంపై దాడికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు యత్నించాయి. యూత్ కాంగ్రెస్ నాయకులు బిజెపి కార్యాలయంపైకి రాళ్లు, గుడ్లతో దాడి చేశారు.
అదే సమయంలో అక్కడే ఉన్న కొంతమంది బిజెపి కార్యకర్తలు కర్రలతో బయటకు వచ్చారు. దాంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా కర్రలు తీసి పోటీగా వెళ్లారు. ఒకరిపై ఒకరు కర్రలతో దాడులు చేసుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. విషయం పోలీసులకు చేరడంతో వెంటనే అక్కడకు చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయితే.. అప్పటికే దాడులు చేసుకోవడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
అయితే.. బిజెపి పార్టీ ఆఫీసు వద్ద మరిన్ని ఉద్రిక్తతలు చోటు చేసుకునే అవకాశం ఉండడంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇరు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలని ఈ సందర్భంగా పోలీసులు సూచించారు. ఇదిలా ఉంటే సదరు బిజెపి నేత చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఎక్కడకక్కడ నిరసనలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెలియజేస్తున్నాయి. ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదంటూ పలువురు నేతలు బిజెపి నేతలను హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ బిజెపి కార్యాలయం వద్ద జరిగిన గొడవ విషయాన్ని బిజెపి అగ్ర నాయకత్వం దృష్టికి పలువురు నాయకులు తీసుకువెళ్లే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. సాయంత్రానికి బిజెపి కార్యాలయం వద్దకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేరుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.