బీజేపీది అతి ధీమాతో కూడిన జోస్యమా?
దేశంలో నాలుగు విడతల ఎన్నికలు ముగియగానే బీజేపీ తాము అనుకున్న లక్ష్యాన్ని చేరువ అయ్యామని చెబుతోంది.
దేశంలో నాలుగు విడతల ఎన్నికలు ముగియగానే బీజేపీ తాము అనుకున్న లక్ష్యాన్ని చేరువ అయ్యామని చెబుతోంది. 370 సీట్లు గెలుస్తామని అంటోంది. అసలు నాలుగు విడతల్లో దేశంలో మొత్తం లోక్ సభకు ఎన్నికలు జరిగినవే 376 గా చెబుతున్నారు.
వీటిలో నుంచి బీజేపీ ఏకంగా 370 టార్గెట్ రీచ్ అయినట్లుగా ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రచారం చాలా విడ్డూరంగా ఉందని అంటున్నారు. అంటే ఇప్పటికి జరిగిన ఎన్నికల్లో మొత్తానికి మొత్తం సీట్లను బీజేపీ గెలుచుకుంటుందని వారి నమ్మకమా అని ప్రశ్నిస్తున్నారు.
నాలుగు విడతల ఎన్నికల్లో తమిళనాడు, కేరళ కూడా ఉన్నాయి. అలాగే ఏపీ కూడా ఉంది. ఏపీలో కూటమితో కలుపుకుని పాతిక ఎంపీ సీట్లూ మాకే అని కమలనాధులు ఢంకా భజాయించినా తెలంగాణాలో మొత్తం 17 ఎంపీ సీట్లలూ అన్నీ క్లీన్ స్వీప్ చేస్తామని చెబుతున్నారా అన్నది కీలకమైన ప్రశ్న.
మరో వైపు చూస్తే బీజేపీకి కర్నాటకలోనే గతసారి వచ్చిన పాతిక ఎంపీ సీట్లలో కోత పడబోతోంది అని చెబుతున్నారు. ఇక ఇప్పటిదాకా చూసుకుంటే కనుక . నాలుగవ విడతను కలుపుకుంటే 376 ఎంపీ సీట్లకు పోలింగ్ పూర్తి అయినట్లు అన్న మాట.
మరి ఈ నంబర్ లో బీజేపీ 300కి పైగా సీట్లు గెలిచేస్తోంది అని ప్రచారం మొదలెట్టేశారు అగ్రశ్రేణి కమలనాధులు. దీని మీదనే ఇపుడు చర్చ సాగుతోంది. ప్రతీ విడత పోలింగ్ ముగియగానే మాకే ఎక్కువ సీట్లు అని అమిత్ షా నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచార సభలలో గట్టిగానే చెబుతున్నారు.
మొదటి రెండు విడతలలో 192 ఎంపీ సీట్లకు పోలింగ్ ముగియగానే సెంచరీ కొట్టామని అమిత్ షా మీడియా తో మాట్లాడుతూ చెప్పారు. వందకు పైగా సీట్లు తొలి రెండు విడతలలోనే సాధించబోతున్నామని ఆయన అన్నారు. ఇక మూడవ విడత ముగియడంతోనే ఆ నంబర్ ని కాస్తా 200 కి పెంచేశారు. ఇపుడు నాలుగు విడతల పోలింగ్ పూర్తి అయింది.
దాంతో మూడు వందలకు పైగా సీట్లు అని బీజేపీ నేతలు అంటున్నారు. దీంతో ఇది ధీమాతో చెబుతున్న మాటా లేక జోస్యంగా చెబుతున్నారా లేక సర్వేలు చేయించుకుని చెబుతున్నారా అన్న చర్చ అయితే ముందుకు వస్తోంది. నిజానికి చూస్తే కనుక ఉత్తరాదిన బీజేపీని పెద్దగా అనుకూలత ఈసారి లేదని విశ్లేషణలు ఉన్నాయి. గతానికి కంటే తక్కువ సీట్లు వస్తాయని కూడా చెబుతున్న నేపధ్యం ఉంది.
ప్రముఖ న్యాయ నిపుణుడు ప్రశాంత్ భూషణ్ అయితే తాజాగా మీడియాతో మాట్లాడుతూ బీజేపీకి 200 సీట్ల కంటే ఎక్కువ రావు అని అన్నారు. అది కూడా మొత్తం పోలింగ్ పూర్తి అయిన తరువాత అన్న మాట. అటువంటిది బీజేపీ మాత్రం ప్రతీ విడత పోలింగ్ ముగియగానే యాభై నుంచి వంద దాకా సీట్లు పెంచుకుని పోతోంది.మరి ఇది మిగిలిన ప్రాంతాలలో పోలింగ్ జరగని చోట్ల ఓటర్లను మభ్యపెట్టడానికే లేక నిజంగా దేశంలో కమల ప్రభంజనం ఉందా అన్న చర్చ సాగుతోంది.
దేశంలో కమలానికి అనుకూలంగా ఉంటే బీజేపీ నేతలు ఈ పొత్తుల ఎత్తులతో ఎందుకు ముందుకు సాగుతారు అన్నది కూడా ప్రశ్నగా ముందుకు వస్తోంది. మరో వైపు చూస్తే బీజేపీకి పట్టున్న చోటనే ఈసారి ప్రతికూలతలు ఎదురవుతాయన్నది సర్వేలు చెబుతున్న అసలు మాట అని అంటున్నారు.
దీని మీద తెలంగాణా సీఎం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిన రేవంత్ రెడ్డి కూడా ఇటీవల మాట్లాడుతూ బీజేపీ అతి అంచనాల మీద సెటైర్లు వేశారు. నాలుగు విడతల పోలింగ్ లో ఎన్నికలు జరిగిన ఎంపీల సంఖ్య కంటే తక్కువ సీట్లకు పోటీ చేస్తున్న బీజేపీకి అన్ని సీట్లు ఎలా వస్తాయని ఆయన అంటున్నారు. అలాగే సౌత్ లో చూస్తే బీజేపీ కి ఎక్కడా పెద్దగా అవకాశాలు లేవని కూడా విశ్లేషణలు ఉన్నాయి.
కానీ పోలింగ్ జరిగితే చాలు గెలిచేది మేమే అంటూ చెబుతున్న ఈ తరహా సర్వేలను బీజేపీ నేతల కామెంట్స్ ని సీరియస్ గా తీసుకునే వారున్నారా అన్నదే పెద్ద ప్రశ్న. ఏది ఏమైనా బీజేపీకి ఈసారి సీట్లు తగ్గుతాయని అంతా అంటున్న మాట. కానీ బీజేపీ మాత్రం సొంతంగా 370, ఎన్డీయే కూటమితో 400 సీట్లు అంటూ పదే పదే తన టార్గెట్లను జనంలో పెట్టడం అంటే అది ఒక రకమైన మైండ్ గేమ్ అని అంటున్నారు.