మహిళా సీఎం రాష్ట్రంలో మహిళలపై వరాలతో బీజేపీ మ్యానిఫెస్టో
పదేళ్లు పైగా దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉంటూ.. ‘ఢిల్లీ’ని మాత్రం హస్తగతం చేసుకోలేకపోతోంది బీజేపీ.
పదేళ్లు పైగా దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉంటూ.. ‘ఢిల్లీ’ని మాత్రం హస్తగతం చేసుకోలేకపోతోంది బీజేపీ. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టినా చిన్న రాష్ట్రమైన ఢిల్లీలో మాత్రం దాని పప్పులు ఉడకలేదు. విద్యావంతులైన యువత, ప్రజలు దేశ రాజధానిలో కమల వికాసాన్ని కోరుకోలేదు. వరుసగా రెండుసార్లు అర్వింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కే పట్టం కట్టారు. ఇప్పుడు మూడోసారి ఎన్నికలు జరుగుతున్న వేళ ఢిల్లీ కోటను కొట్టేందుకు బీజేపీ శక్తియుక్తులన్నీ ఒడ్డుతోంది.
తమకు పెద్దగా అలవాటు లేని ఉచిత పథకాలతో ఢిల్లీ మ్యానిఫెస్టోను బీజేపీ ప్రకటించింది. శుక్రవారం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దీనిని విడుదల చేవారు. సంకల్ప పత్రం పేరుతో వికసిత ఢిల్లీ కోసం రోడ్ మ్యాప్ తెచ్చామని ఆయన చెప్పారు. అవినీతి లేని ఢిల్లీ బీజేపీ లక్ష్యమని తెలిపారు.
మహిళలపై వరాల జల్లు
ఢిల్లీ బీజేపీ మ్యానిఫెస్టో ప్రకారం.. ఆ పార్టీ అధికారంలోకి వస్తే మహిళా సమ్మాన్ నిధి పథకం తీసుకొస్తుంది. దీనికింద ప్రతి నెలా మహిళలకు రూ. 2,500 సాయం అందజేయనుంది.
అంతేకా పేద మహిళలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ అందజేయనుంది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చాకే సిలిండర్ ధర రూ.వెయ్యికి చేరిందనే విమర్శలు ఉన్న నేపథ్యంలో మహిళలను ఆకట్టుకునేందుకు ఈ పథకం తీసుకొచ్చింది.
హోలీ, దీపావళికి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని బీజేపీ ప్రకటించింది. దేశ రాజధానిలో ఈ రెండు పండుగలకు ప్రాధాన్యం ఉండడం గమనార్హం.
మహిళలకు ఆరు పౌష్ఠికాహార కిట్లు, గర్భిణులకు రూ.21 వేలు సాయం అందజేస్తామని బీజేపీ తమ మ్యానిఫెస్టోలో వివరించింది.
వీటన్నిటికీ తోడు వృద్ధాప్య పెన్షన్ పెంపు గురించి హామీ కూడా ఇచ్చింది. మ్యానిఫెస్టో విడుదల సందర్భంగా మహిళలే తమకు ప్రధాన ప్రాధాన్యం అని చెప్పిన నడ్డా.. ఆప్ లిక్కర్ స్కాంను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. తాము గెలిస్తే ఢిల్లీని అవినీతి రహితం చేస్తామని చెప్పారు.