బీజేపీలో ఫెయిల్యూర్ బ్యాచ్.. ప్రచార పగ్గాలు దానికే!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం కోసం.. బీజేపీ వ్యూహం సిద్ధం చేసింది. మొత్తం 40 మందితో కూడిన బ్యాచ్‌ను త్వరలోనే విడతల వారీగా రంగంలోకి దింపనుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం కోసం.. బీజేపీ వ్యూహం సిద్ధం చేసింది. మొత్తం 40 మందితో కూడిన బ్యాచ్‌ను త్వరలోనే విడతల వారీగా రంగంలోకి దింపనుంది. జిల్లాలుగా విభజన చేసి.. వారికి బాధ్యతలు కూడా అందించేందుకు రెడీ అయింది. ఈ బ్యాచ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ సహా కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. ఇక, పొరుగు రాష్ట్రాలకు చెందిన కమలం నేతలు కూడా రానున్నారు.
కట్ చేస్తే.. ఇదే 40 మంది బ్యాచ్.. కర్ణాటకలోనూ ఈ ఏడాది మేలో ప్రచారం చేసింది. కానీ, అక్కడ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. దరిమిలా.. ఈ బ్యాచ్‌పై ఫెయిల్యూర్ ముద్ర పడిపోయింది. ఈ విషయాన్ని బీజేపీ నాయకులే చెబుతున్నారు. "ఫెయిల్యూర్ బ్యాచ్‌ను మాపై రుద్దుతున్నారు" అంటూ.. కొందరు నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదేసమయంలో కొందరు ప్రచారం కోసం ముందుకు వచ్చినా.. వారిని పక్కన పెట్టిన విషయాన్ని సెలవిస్తున్నారు.
ఇక, తాజాగా నిర్ణయించిన 40 మందిలో ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్‌షా, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, పురుషోత్తం రూపాల, అర్జున్ ముండా, భూపేంద్ర యాదవ్, సాధ్వి నిరంజన్ జ్యోతి, ఎల్.మురుగన్ తదితరులు ఉన్నారు. ఇక, పొరుగు రాష్ట్రాలకు చెందిన వారిలో ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి ఒక్కరే ఉన్నారు. కర్ణాటక నుంచి యడియూరప్ప, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు.
మిగిలిన వారిలో తెలంగాణకే చెందిన బండి సంజయ్, డీకే అరుణ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు, ఫైర్‌బ్రాండ్ రాజాసింగ్, తదితరులు ఉన్నారు. అయితే.. వీరిలో మెజారిటీ నాయకులు ఫెయిల్యూర్ బ్యాచ్ కావడంతో ఇప్పుడు తెలంగాణ వంటి బలమైన రాష్ట్రంలో ఏమేరకు సక్సెస్ అవుతారనేది చర్చనీయాంశంగా మారింది.