ఉత్తరాంధ్రా నుంచే శ్రీకారం చుట్టనున్న జగన్
వైసీపీ అధినేత జగన్ జిల్లాల టూర్ కి రంగం సిద్ధం అవుతోంది. సంక్రాంతి పండుగ ముందు ఆయన లండన్ కి బయలుదేరి వెళ్ళారు.
వైసీపీ అధినేత జగన్ జిల్లాల టూర్ కి రంగం సిద్ధం అవుతోంది. సంక్రాంతి పండుగ ముందు ఆయన లండన్ కి బయలుదేరి వెళ్ళారు. అక్కడ ఆయన తన చిన్న కుమార్తె డిగ్రీ పట్టా ప్రదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అలా కొన్ని రోజుల పాటు కుటుంబంతో ఉల్లాసంగా గడిపి ఈ నెలాఖరుకు ఏపీకి తిరిగి వస్తున్నారు.
జగన్ గతంలో చెప్పినట్లుగానే ఫిబ్రవరి తొలి వారం నుంచి జిల్లాల పర్యటనలు చేపడతారని పార్టీ వర్గాలు తెలిపాయి. జగన్ ప్రతీ బుధవారం జిల్లా పర్యటనలు పెట్టుకుంటారు. శుక్రవారం వరకూ ఆయన మూడు రోజుల పాటు అక్కడే బస చేస్తారు. అలా ప్రతీ జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గం కార్యకర్తలు నాయకులతో ఆయన భేటీ అవుతారు. వారి నుంచి మొత్తం విషయాలను గ్రహిస్తారు.
క్షేత్ర స్థాయిలో పార్టీ ఎలా ఉంది అన్నదే జగన్ ఈ సందర్భంగా వాకబు చేస్తారని అంటున్నారు. ఈ పర్యటనల ముఖ్య ఉద్దేశ్యం పార్టీని పునరుత్తేజం చేయడమే అని అంటున్నారు. దాంతో జగన్ పర్యటనలు జనాల కంటే కూడా ఎక్కువగా పార్టీ జనాలకే ఉద్దేశించి సాగుతాయని అంటున్నారు.
మరో వైపు చూస్తే వైసీపీ నుంచి ఎంతో మంది నేతలు ఇటీవల కాలంలో బయటకు వెళ్ళిపోతున్నారు. వారి ప్లేస్ లో కొత్త వారికి చాన్స్ ఇవ్వాలని చూస్తున్నారు. అలాగే యూత్ కి ప్రయారిటీ అని పెట్టుకున్నారు. అలాగే పార్టీలో పనిచేయని వారి విషయంలోనూ ఒకసారి చెప్పి చూసి సీరియస్ గానే రియాక్టు కావాలని అధినాయకత్వం భావిస్తోందిట.
నాయకులు జనం నుంచి తయారు అవుతారని పార్టీ పట్ల జనంలో ఆదరణ ఉంటే మళ్ళీ కొత్త నాయకత్వంతో దూసుకుని పోవచ్చు అన్న ఆలోచనతోనే పార్టీ పెద్దలు ఉన్నారని అంటున్నారు. ఇదిలా ఉంటే జగన్ జిల్లాల పర్యటనలు మొత్తం 26 కొత్త జిల్లాలలో సాగుతాయని అంటున్నారు.
ఇక జగన్ ఈసారి ఉత్తరాంధ్ర సెంటిమెంట్ ని ఫాలో అవుతారని అంటున్నారు. దాంతో పాటుగా పార్టీ 2024 ఎన్నికల్లో బాగా నష్టపోయింది కాబట్టి ఉత్తరాంధ్ర నుంచి రంగం సిద్ధం చేసుకుంటేనే గాడిలో పడుతుంది అని భావిస్తున్నారుట.
ఉత్తరాంధ్రాలోని శ్రీకాకుళం జిల్లా నుంచి జగన్ పర్యటనలు ఉంటాయని చెబుతున్నారు. తొందరలోనే యాక్షన్ ప్లాన్ తో సహా అన్నీ ప్రకటించేందుకు వైసీపీ అధినాయకత్వం సన్నాహాలు చేస్తోంది. ఉత్తరాంధ్రాలో ఇపుడు కూటమి హవా గట్టిగానే ఉంది. దాంతో పాటు వైసీపీకి కేవలం రెండు అసెంబ్లీ సీట్లు మాత్రమే దక్కాయి. దాంతో ఫ్యాన్ పార్టీ రిపేర్లు ఇక్కడ నుంచే మొదలుపెట్టాలని అధినేత భావించారు అని అంటున్నారు. చూడాలి మరి ఉత్తరాంధ్ర జగన్ కి ఏ విధంగా హుషార్ తెప్పిస్తుందో.