హిందూత్వ సెంటిమెంట్ తోనే బీజేపీ చేతికి రాజదండం...!
ఇక భారతదేశం మౌలిక స్వరూపం తెలిసి కూడా గతంలో పాలించిన కాంగ్రెస్ సెక్యులర్ అంటూ కొత్త పోకడలు పోయింది
భారతతేశం సనాతన దేశం. ఎంత ఆధునికత పైకి కనిపిస్తున్నా లేక ఎంత వామపక్ష భావజాలం వ్యాప్తి చెందినా కూడా దేశంలో నూటికి డెబ్బై నుంచి ఎనభై శాతం మందిలో ఇంకా మత విశ్వాసాలు అలాగే నిలిచి ఉన్నాయి. భారత దేశం భౌగోళిక స్వభావం స్వరూపం ఎటు చూసినా ఎక్కడికి వెళ్లినా కనిపించేవి గుళ్ళూ గోపురాలు. అడుగడుగున గుడి ఉంది అని అందుకే అంటారు.
ఇక భారతదేశం మౌలిక స్వరూపం తెలిసి కూడా గతంలో పాలించిన కాంగ్రెస్ సెక్యులర్ అంటూ కొత్త పోకడలు పోయింది. దేశానికి స్వాతంత్రం లభించిన కొత్తలో కాంగ్రెస్ కి బలమైన ఆకర్షణీయమైన నాయకత్వం ఉండడంతో పాటు దేశభక్తి కూడా తోడు కావడంతో మొదటి నాలుగు దశాబ్దాలు కాంగ్రెస్ జెండా దేశంలో వైభవంగా ఎగిరింది.
అప్పట్లో విపక్షాలు కూడా గట్టిగా లేకపోవడం మరో కారణం. ఎనభై దశకం నుంచి పరిస్థితిలో మార్పు వచ్చింది. కాంగ్రెస్ నుంచి అధికారం రాబట్టుకునే విషయంలో మధ్యేవాద పార్టీలు కొంత సక్సెస్ అయినా దాన్ని వారు కొనసాగించలేకపోయారు. దానికి కారణం బలమైన రాజకీయ సిద్ధాంతం లేకపోవడమే అని భావించాలి.
అదే సమయంలో కేవలం అధికార మార్పిడి కోసమే విపక్షాలు కట్టిన కూటములు ఆ తరువాత అధికారంలో వాటా కోసం వచ్చిన పేచీలతో పేక మేడల మాదిరిగా కూలిపోతూ వచ్చాయి. ఇది జనాలకు కూడా మధ్యేవాద పార్టీల మీద పూర్తి వైముఖ్యానికి కారణం అయింది. ఒకవైపు ఇందిరా గాంధీ తరువాత అంతటి బలమైన నాయకత్వం కాంగ్రెస్ కి కరవు కావడం కొంతవరకూ సమర్ధుడు అని భావించే రాజీవ్ గాంధీ ఆకస్మికంగా దారుణ హత్యకు గురి కావడం ఇవన్నీ కూడా బీజేపీకి బాగా కలసి వచ్చాయి.
బీజేపీ ఎవరు ఏమి అనుకున్నా భారతీయత ఆత్మను తట్టింది. దేశ అస్థిత్వాన్ని కూడా లేపే ప్రయత్నం చేసింది. ఈ దేశానికి దేశ భక్తి దైవ భక్తి రెండూ అవసరం. అలా ఆ రెండింటినీ మేళవించి తనదైన రాజకీయ సిద్ధాంతాలను ప్రజల మధ్యనే చర్చకు పెట్టి వారిని విజయవంతంగా ఒప్పించింది.
ఈ ప్రక్రియ అంతా సాగడానికి బీజేపీకి అచ్చంగా మూడున్నర దశాబ్దాల సమయం పట్టింది. అదే సమయంలో కాంగ్రెస్ కావాల్సినంతగా బలహీనం కావడం బీజేపీకి కలసి వస్తోంది. ఈ రోజున ప్రాంతీయ పార్టీలు కుటుంబ నేపధ్యంతో ఉన్నాయి. మరో జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ నాయకత్వ సంక్షోభంతో ఉంది.
రాహుల్ గాంధీ బలమైన సిద్ధాంత భూమికతో బీజేపీని ఢీ కొట్టేందుకు సిద్ధంగా లేరు. దేశంలో బీజేపీ భావజాలానికి సర్వామోదం లభిస్తోంది. ఎవరికైనా తన దేశం గెలిస్తే గొప్పే. అలాగే తన దైవం కళ్ళ ముందు వైభవంగా ఉంటే ఇంకా గొప్పే. ఇపుడు బీజేపీ అదే చేస్తోంది. కమ్యూనిస్టులు అడగవచ్చు. కూడు గూడు గుడ్డ దేశానికి ముఖ్యం కదా. ఇవన్నీ ఎందుకు అని.
కానీ సగటు మనిషికి వాటికి మించి వీటి మీద భక్తి అనురక్తి ఉంది. ఇది సెంటిమెంట్. వంట బట్టిందంటే పోదు. బీజేపీ సరిగ్గా ఆ పాయింట్ నే పట్టుకుంది. అక్కడే గెలుస్తోంది. ఈ దేశాన్ని నరేంద్ర మోడీ ప్రపంచం ముందు పెద్దగా చూపిస్తున్నారు అన్నది సగటు జనం సంతోషం. అయోధ్య రామాలయం కట్టి శతాబ్దాల హిందూత్వ నినాదానికి అతి పెద్ద ఊపిరి పోశారని కూడా మోడీ అన్నా బీజేపీ అన్నా మక్కువ పెంచుకుంటున్నారు
అందుకే మూడవసారి కూడా బీజేపీదే విజయం అని సర్వేలు చెబుతున్నారు. వారు చెప్పకపోయినా జరిగేది మాత్రం ఇదే. మతాన్ని రాజకీయాల్లోకి చొప్పించవచ్చా అని మేధావులు తెలివిగా ప్రశ్న వేస్తూంటారు. కానీ రాజకీయంలో అన్నీ ఉంటాయి. దేనికి ఎందుకు వేరుగా చూడాలి. ఓటేసేది జనాలు వారి సెంటిమెంట్లు కూడా పట్తింపుగానే బీజేపీ లాంటి పార్టీలు చూస్తాయి.
బీజేపీ హయాంలో దేశం ఎంత మేరకు అభివృద్ధి చెందినది అన్నది వేరే ప్రశ్న. కానీ బీజేపీ సగటు జనం లో ఒక గర్వం పెరిగేలా చేసింది అన్నది నిజం. పాకిస్తాన్ చైనా వంటి పొరుగు దేశాలు భారత్ అంటే ఎంతో కొంత భయపడుతున్నాయంటే బీజేపీ కారణం అనుకుంటారు జనాలు. హిందూత్వకు పెద్ద పీట వేస్తోంది బీజేపీ మాకు ఏమి కావాలి అనుకునే జనాలు కోట్లలో ఉన్నారు.
ఈ సెంటిమెంట్ ని పట్టుకుంది బీజేపీ. ఇక 2024 లో బీజేపీ గెలిస్తే ఎన్నికలు ఉండవు, అధ్యక్ష తరహా పాలన వస్తుంది. దేశంలో ప్రజాస్వామ్యానికి ముప్పు అని వామపక్షాలు ఇప్పటి నుంచే అంటున్నాయి. రేపటి రోజున బీజేపీ మూడవసారి కేంద్రంలో పీఠమెక్కితే మాత్రం చాలా మార్పులే జరుగుతాయి. అవి హిందూత్వ సెంటిమెంట్ ని మరింత రాజేసి భారత్ ని హిందూస్థాన్ గా పరిపూర్ణంగా చేయడంలో మాత్రం నూరు శాతం సక్సెస్ అయ్యే చాన్స్ ఉంది. అదే బీజేపీ నినదిస్తున్న 2047 దాకా కేంద్రంలో బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టినా ఆశ్చర్యం అయితే లేదు.