పవన్ చంద్రబాబు మధ్యలో గ్యాప్ పెంచుతున్న బీజేపీ...?
ఏపీలో లేని బీజేపీ పవన్ని మిత్రుడిగా చేసుకుని టీడీపీకి సరిసమానంగా పొత్తుల చర్చలకు సిద్ధం కావాలని చూస్తోంది అని అంటున్నారు.
రాజకీయం అంటేనే ఇది. తమకు అనుకూలంగా పాలిటిక్స్ చేసుకోవడమే నీతి. అడ్డు అనుకున్న వారిని సైడ్ చేయడం, కొన్ని సందర్భాలలో తమ దారికి తెచ్చుకోవడానికి కొత్త మంత్రం వేయడం కూడా జరుగుతుంది. అన్నింటా ఆరితేరిన బీజేపీ ఇపుడు ఏపీలో అలాంటి పాలిటిక్స్ నే ప్లే చేయబోతోందా అంటే జవాబు అవును అనే వస్తోంది.
ఏపీలో పవన్ కళ్యాణ్ కొన్నాళ్ళుగా టీడీపీ వైపుగా సాగుతున్నారని ప్రచారంలో ఉంది. అలాంటి పవన్ వారాహి యాత్ర సందర్భంగా తాను సీఎం అని గట్టిగా అనగలిగారు. మా ప్రభుత్వం వస్తుందని కూడా చెప్పగలిగారు. ఆయన దూకుడు ఒక స్థాయిలో సాగింది అంటే దాని వెనక కమలనాధుల వ్యూహాలు ఉన్నాయని అంటున్నారు.
అదే సమయంలో ఏపీకి చెందిన బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజుని తప్పించి దగ్గుబాటి పురంధేశ్వరిని ఆ పార్టీ నియమించింది. సోము వీర్రాజుతో ఎడముఖంగా ఉన్న జనసేనాని పురంధేశ్వరి నియామకం కాగనే అభినందనలు తెలియచేయడం ఇక్కడ కీలకమైన పరిణామం. దానికి తోడు అన్నట్లుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన పురంధేశ్వరి జనసేన మాత్రమే ఏపీలో బీజేపీకి మిత్ర పక్షం అని గట్టిగా భజాయించారు.
ఇంకో వైపు చూస్తే ఈ నెల 18న ఢిల్లీ వేదికగా ఎన్డీయే పార్టీల కీలకమైన సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తో పాటు దాదాపుగా ఇరవై ఎన్డీయే మిత్ర పార్టీలు ఈ సమావేశానికి హాజరవుతున్నాయి.
చిత్రమేంటి అంటే ఏపీ నుంచి ఒక్క జనసేన మాత్రమే ఈ భేటీకి హాజరవుతోంది. ఆ మేరకు బీజేపీ పెద్దల నుంచి ఆహ్వానం లభించింది. ఇంకా గట్టిగా చెప్పాలీ అంటే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి జనసేన మాత్రమే ఈ అతి ముఖ్యమైన ఎన్డీయే భేటీకి హాజరవుతోంది. ఇలా పవన్ కళ్యాణ్ కి బీజేపీ ఇస్తున్న రాజకీయ ప్రాధాన్యతగా అంతా భావిస్తున్నారు.
ఇక ఎన్డీయే భేటీకి టీడీపీని పిలుస్తారు అని అంతా అనుకున్నారు. ప్రచారం కూడా ఎల్లో మీడియాలో ఒక లెవెల్ లో సాగింది. కానీ తీరా చూస్తే జనసేన మాత్రమే అటెండ్ అవుతోంది. అలా బీజేపీ జాతీయ నాయకత్వం పవన్ కి పెద్ద పీట వేయడం ద్వారా బహుళ ప్రయోజనాలను ఆశిస్తోంది. చాలా కాలంగా కేంద్ర పెద్దల వద్ద తగిన గుర్తింపు లేదని భావిస్తున్న జనసేనానికి ఈ విధంగా ఉత్సాహం కలిగించడం తద్వారా ఆయనను తమ వైపునకు తిప్పుకోవడం ఒక లక్ష్యమైతే ఏపీలో తమకు నమ్మకమైన మిత్రుడు జనసేన మాత్రమే అని టీడీపీకి చెప్పడం మరో లక్ష్యం.
ఇంకోటి ఏంటి అంటే తమ మిత్రుడు పవన్ తోనే తమ రాజకీయ ప్రయాణం సాగుతుందని, పొత్తులు ఎత్తులు అన్నీ కూడా పవన్ తో పాటుగా తమతో ఎవరైనా చర్చించుకోవచ్చు అన్నది ఓపెన్ ఆఫర్ అన్న మాట. ఈ విధంగా ఒక్క శాతం కంటే కూడా ఓటు బ్యాంక్ ఏపీలో లేని బీజేపీ పవన్ని మిత్రుడిగా చేసుకుని టీడీపీకి సరిసమానంగా పొత్తుల చర్చలకు సిద్ధం కావాలని చూస్తోంది అని అంటున్నారు.
ఇక పవన్ కి ఇటీవల కాలంలో గోదావరి జిల్లాలలో ప్రజాదరణ నిండుగా మెండుగా పెరిగింది. ఆ గ్రాఫ్ చూసి కూడా బీజేపీ పెద్దలు ఆయనను దగ్గరకు తీస్తున్నారు అని అంటున్నారు. అదే విధంగా ఏపీలో కాపుల చిరకాల కోరిక అయిన సీఎం పదవిని పవన్ చేపట్టాలీ అంటే తమతో ఉంటేనే అది సాధ్యపడుతుందని చెప్పడానికీ ఈ భేటీకి పిలిచారు అని అంటున్నారు. రేపటి రోజున ఏపీలో పొత్తులు ఉన్నా జనసేన బీజేపీ కలసి టీడీపీతో బేరాలాడి సగం సగం సీట్లను తీసుకునేలా రాయబారాలు సాగాలీ అంటే పవన్ తమతోనే ఉండాలన్నది బీజేపీ ఎత్తుగడ.
మొత్తం మీద చూస్తే పవన్ కళ్యాణ్ ని పిలవడం బాబుని పక్కన పెట్టడం ద్వారా గ్యాప్ అయితే పెనేందుకు కమలనాధులు భారీ ప్లాన్ వేశారని అంటున్నారు ఇక పవన్ కళ్యాణ్ ఈ భేటీకి తప్పక హాజరుతారని అంటున్నారు. ఆయన ఈ నెల 17న బయల్దేరి ఢిల్లీ వెళ్తారు అని అంటున్నారు. తనతో పాటు పార్టీ నేత నాదెండ్ల మనోహర్ ని కూడా తీసుకెళ్తున్నారు. పవన్ ఈ భేటీలో ఏమి మాట్లాడుతారు. టీడీపీతో పొత్తుల గురించి కేంద్ర బీజేపీ పెద్దలకు వివరిస్తారా మూడు పార్టీల పొత్తును 2014 మాదిరిగా ముందుకు తీసుకుని పోతారా అన్నది చర్చగా వస్తోందిపుడు.