కూటమిలో కుంపటి!: బీజేపీ ఇలా చేసిందేంటి?
మూడు పార్టీలు ఉమ్మడిగా ముందుకు సాగుతున్న సమయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది
మూడు పార్టీలు ఉమ్మడిగా ముందుకు సాగుతున్న సమయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ-టీడీపీ-జనసేన కలిసి ప్రస్తుత ఎన్నికల్లో వైసీపీపై పోరాడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ మూడు పార్టీలూ టికెట్లు పంచుకున్నాయి. బీజేపీకి 10 అసెంబ్లీ, ఆరు పార్లమెంటు స్థానాలు దక్కాయి. వీటిలో ఆరు పార్లమెంటు స్థానాలను ఇప్పటికే ఖరారు చేసుకుని అభ్యర్థులను కూడా ప్రకటించారు. ఇక, తాజాగా అసెంబ్లీకి సంబంధించి 10 స్థానాలను ప్రకటించారు.
అయితే.. వీరిలో ఒకరు కూడా మహిళలు లేకపోవడం గమనార్హం. పార్లమెంటు స్థానాల్లో రాజమండ్రికి పురందేశ్వరి, అరకు పార్లమెంటు స్థానానికి కొత్తపల్లి గీతలకు అవకాశం ఇచ్చారు. కానీ, అసెంబ్లీకి వచ్చే సరికి మాత్రం మహిళా అభ్యర్థులకు అవకాశం లేకుండా పోయింది. అంతేకాదు.. చిత్రమైన విషయాలు రెండు మూడు చోటు చేసుకున్నాయి. ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యానంటూ.. 2019లోనే ప్రకటించి న మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌కు కైకలూరు టికెట్ ఇచ్చారు.
ఇక, మైనారిటీలు, బీసీలు ఎక్కువగా ఉన్న విజయవాడ వెస్ట్ సీటును కమ్మ వర్గానికి చెందిన సుజనా చౌదరికి ఇచ్చారు. ఇంతకు ముందే.. టీడీపీ తన ఖాతాలో వేసుకున్న రెండు నియోజకవర్గాలను బీజేపీ ఇప్పుడు తీసేసుకోవడం గమనార్హం. అంటే.. అరకు అసెంబ్లీ సీటును గతంలోనే (30 రోజుల కిందట) చంద్రబాబు టీడీపీ యువ నేత దొన్ను దొరకు ఇచ్చారు. ఆయన అక్కడ ప్రచారం కూడా చేసుకుంటున్నా రు. ఇంతలో తాజాగా కనీసం మాట మాత్రం కూడా చెప్పకుండా.. బీజేపీ ఇక్కడ అభ్యర్థిని ప్రకటించింది.
అరకు నుంచి పంగి రాజారావును బీజేపీ ప్రకటించింది. అలానే.. తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని కూడా.. కూటమి పంపకాల్లో బాగంగా టీడీపీనే తీసుకుంది. ఇక్కడ నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని ప్రకటించింది. అంతేకాదు.. ఆయన కూడా ప్రజల్లొకి వెళ్లిపోయారు. ప్రచారం కూడా చేసుకుంటున్నారు. కట్ చేస్తే.. తాజాగా బీజేపీ ప్రకటించిన జాబితాలో అనపర్తి సీటుకు శివరామకృష్ణ రాజును ఎంపిక చేశారు. దీంతో టీడీపీనేతలకు దిమ్మ తిరిగిపోయింది.
ఇది మరీ క్యామెడీ!
కూటమి పార్టీల్లో ఇది మరీ క్యామెడీగా మారింది. కడప జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం 'బద్వేల్' స్థానాన్ని టీడీపీ తీసుకుంది. ఇక్కడ కూడా.. అభ్యర్థిని ప్రకటించింది. ఆయనే సొంగా రోషన్ కుమార్. మాల సామాజిక వర్గానికి చెందిన నేత. ఈయన కూడా టీడీపీ కండువాలు కప్పుకొని ప్రచారం చేస్తున్నారు. కానీ, తాజాగా ''ఈయన మావాడే'' అంటూ బీజేపీ లాగేసుకుంది! చిత్రంగా ఉన్నా.. ఇది నిజం. బద్వేల్ నుంచి సొంగా రోషన్‌కు టీడీపీ ఇప్పటికే టికెట్ ఇచ్చి.. ప్రచారంలోకి దింపాక.. బీజేపీ అనూహ్యంగా రోషన్ తమవాడేనని చెప్పుకొని.. ఆయనకు బీజేపీ టికెట్ ఖరారు చేసింది. అంటే.. ఇదెంత క్యామెడీగా ఉందో అర్ధం అవుతుంది. ఇలాంటి చిత్రాలు ఇంకెన్ని ఉంటాయో చూడాలి.