చిరు వ్యాఖ్యలపై వైసీపీ రియాక్షన్ ఇది... తెరపైకి "పోకిరీ" డైలాగ్!

చిరు వ్యాఖ్యలపై స్పందించిన బొత్స... సినీ పరిశ్రమ ఒక పిచ్చుక అని అంగీకరించారా? చిరంజీవి చెప్పాలని ప్రశ్నించారు

Update: 2023-08-09 04:40 GMT

మంగళవారం మొత్తం ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి వ్యాఖ్యలు.. ఆ వ్యాఖ్యలకు వైసీపీ నేతల కౌంటర్లు, సెటైర్లతోనే సాగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వాలు ఏమి చేయాలి, ఏమి ఆలోచించాలి అనే విషయంపై చింరజీవి స్పందించగా... ఆ మాటలకు కౌంటర్ గా కొడాలి నాని, పేర్ని నాని స్పందించారు. ఈ సమయంలో బొత్స వ్యాఖ్యలు కీలకంగా మారాయి.

అవును... ఏపీ ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీలోని రెమ్యునరేషన్స్ గురించి ఎందుకు.. ఆలోచించాల్సినవి ఇంకా చాలానే ఉన్నాయి.. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా ఇండస్ట్రీపై పడతారెందుకు అని చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఈ సందర్భంగా చిరంజీవికి కౌంటర్ ఇచ్చారు.

చిరు వ్యాఖ్యలపై స్పందించిన బొత్స... సినీ పరిశ్రమ ఒక పిచ్చుక అని అంగీకరించారా? చిరంజీవి చెప్పాలని ప్రశ్నించారు. "ఏపీలో సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి. చిరంజీవి ఎందుకు వ్యాఖ్యలు చేశారో చెప్పాలి. ప్రతి సమస్యపై ప్రభుత్వం స్పందిస్తుంది. చిరంజీవి వ్యాఖ్యలు చూశాక పూర్తి స్థాయిలో స్పందిస్తాను" అని మంత్రి బొత్స అన్నారు.

ఇదే సమయంలో "మేం వారాహి యాత్రను అడ్డుకోం. యాత్రల పేరుతో చట్టాలను చేతుల్లోకి తీసుకుంటే మాత్రం ఊరుకోం. ప్రజాస్వామ్యంలో యాత్రలు ఎవరైనా చేసుకోవచ్చు. విశాఖలో పవన్‌ వారాహి యాత్రపై దేశమంతా చర్చ జరుగుతుందంటున్నారు. చంద్రబాబు పుంగనూరు యాత్ర మాదిరిగా విధ్వంసం చేయాలని చూస్తున్నారా?" అని బొత్స ప్రశ్నించారు.

మనకెందుకురా బాబూ... కొడాలి కౌంటర్:

వాల్తేరు వీరయ్య 200 డేస్‌ ఫంక్షన్‌ లో చిరంజీవి చేసిన పొలిటికల్‌ కామెంట్లకు గుడివాడ ఎమ్మెల్యే, ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని పరోక్షంగా కౌంటర్‌ ఇచ్చారు. "సినీ పరిశ్రమలో చాలామంది పకోడీగాళ్లున్నారు. ప్రభుత్వం ఎలా ఉండాలో ఆ పకోడీగాళ్లు కూడా సలహాలు ఇస్తున్నారు" అంటూ సెటైర్లు వేశారు.

ఇదే సమయంలో.. "ప్రభుత్వం గురించి మనకెందుకురాబాబు" అని సలహాలు ఇవ్వొచ్చు కదా అని సూచించారు. మనం డాన్స్‌ లు, ఫైట్స్, యాక్షన్ గురించి చూసుకుందామని చెప్పొచ్చు కదా అని అన్నారు. కేవలం ఒక్క ప్రభుత్వానికే కాకుండా... ఇద్దరికీ సలహాలు ఇస్తే బాగుంటుందని కొడాలి తెలిపారు.

గిల్లితే గిల్లుతారు... పేర్ని సమాధానం:

ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు పేర్ని నానీ సమాధానం ఇచ్చారు. చిరంజీవికి వ్యక్తిగతంగా తాను అభిమానిని అని మొదలుపెట్టిన పేర్ని నాని... హైదరాబాద్ ఫిల్మ్ నగర్ నుంచి ఏపీ సచివాలయానికి ఎంత దూరమో.. ఏపీ సచివాలయం నుంచి ఫిల్మ్ నగర్‌ కి అంతే దూరం అని చెప్పాలకున్న విషయాన్ని చెప్పేశారు!

ఇదే సమయంలో పోకిరీ సినిమాలోని ప్రకాశ్ రాజ్ క్యారెక్టర్ చెప్పినట్లు... గిల్లితే గిల్లించుకోవాలి - అరవకూడదు.. అనే డైలగ్ రాజకీయాల్లో వర్తించదని తెలిపారు. సినిమాల్లో గిల్లినోళ్లకూ గిల్లించుకున్నోళ్లకు.. ఇద్దరికీ డబ్బులు ఇస్తారని చెప్పిన నాని... రాజకీయాల్లో గిల్లిన వాళ్లను తిరిగి గిల్లుతారని మరింత క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేశారు.

అనంతరం... సినిమాని సినిమాగా.. రాజకీయాన్ని రాజకీయంగా చూడాలి. చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, మహేష్, రాం చరణ్ మీద ఏ రాజకీయ పార్టీ అయినా మాట్లాడిందా? వారి రెమ్యునరేషన్‌ గురించి ఎవరైనా అడిగారా? అని సూటిగా ప్రశ్నించారు పేర్ని నాని.

ఇదే సమయంలో... ఏపీకి ప్రత్యేక హోదా గురించి ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలని చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై కూడా పేర్ని సూటిగా స్పందించారు. ఇందులో భాగంగా... "రాష్ట్ర విజభన సమయంలో చిరంజీవి ఏ పార్టీలో ఉ‍న్నారు? చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ఏపీకి ప్రత్యేక హోదా హామీ వచ్చింది.. రాష్ట్రానికి అన్యాయం జరిగితే అప్పుడు చిరంజీవి ఎందుకు మాట్లాడలేదు?" అని ప్రశ్నించారు.

తమ్ముడికి జ్ఞానబోధ అవసరం... అమర్నాథ్ సూచనలు:

చిరంజీవి వ్యాఖ్యలపై మంత్రి అమర్నాథ్‌ స్పందించారు. తనదైన శైలిలో కౌంటరిచ్చారు. సినిమాలను పిచ్చుక అని తక్కువ చేస్తే ఎలా అని మంత్రి గుడివాడ ప్రశ్నించారు. సినిమాల్లోకి రాజకీయాలను తెచ్చిందే పవన్‌ కల్యాణ్‌ అని చెప్పిన ఆయన... ముందుగా చిరంజీవి తన తమ్ముడికి జ్ఞానబోధ చేయాలని, శుభ్రం చేయాల్సింది ముందుగా తన తమ్ముడినే అని తెలిపారు. ఆ తర్వాత రాజకీయ పార్టీలకు సూచనలు చేయవచ్చు అంటూ ఘాటుగా విమర్శలు చేశారు.

Tags:    

Similar News