వేల కోట్ల ఆస్తిపరుడు.. మెట్రో ట్రైన్ లో జర్నీ
సింఫుల్ గా మెట్రో రైల్లో ప్రయాణిస్తుంటారు.తాజాగా హురున్ విడుదల చేసిన జాబితా ప్రకారం భారతదేశంలో టాప్ 50 మంది సంపన్నుల్లో నిరంజన్ హీరానందనీ ఒకరు.
ప్రముఖుల్లోనూ కొందరు ఇట్టే పాపులర్ అయిపోతుంటారు. మరికొందరు మాత్రం అందుకు భిన్నంగా బయటకు పెద్దగా ఫోకస్ కారు. కానీ.. వారి తీరుతో అందరికి ఆకట్టుకుంటారు. ఆ కోవలోకే వస్తారు ప్రముఖ వ్యాపారవేత్త నిరంజన్ హీరానందని. ఈ పేరు ఎప్పుడూ వినలేదే? అనే వాళ్లు.. కాస్త ఒపికగా చదివితే.. ఆయనకు ఇప్పట్లో మర్చిపోరంతే. ఎందుకంటే.. ఆయన తీరు అంత సింఫుల్ గా.. స్పెషల్ గా ఉంటుంది మరి.
రియల్ ఎస్టేట్ పరిశ్రమలో నిరంజన్ హీరానందనికి ఉన్న పేరు.. ‘ఇండస్ట్రీ గురు’. రియల్ ఎస్టేట్ మొదలు డేటా సెంటర్స్.. ఇండస్ట్రియల్ లాజిస్టిక్స్ బిజినెస్ వరకు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుపోయే హీరానందని గ్రూప్ కంపెనీస్ కు ఆయన యజమాని. వేలాది కోట్ల ఆస్తులకు యజమాని అయినప్పటికీ.. సాదాసీదాగా ఉండటం ఆయనకు మాత్రమే చెల్లు. అంతేనా.. ఆయన తలచుకుంటే కోట్లాది రూపాయిల విలువైన కార్లు బారులు తీసేలా చేస్తారు. కానీ.. ఆయన మాత్రం అలాంటివేమీ చేయరు.
సింఫుల్ గా మెట్రో రైల్లో ప్రయాణిస్తుంటారు.తాజాగా హురున్ విడుదల చేసిన జాబితా ప్రకారం భారతదేశంలో టాప్ 50 మంది సంపన్నుల్లో నిరంజన్ హీరానందనీ ఒకరు. ఆయన ఆస్తుల విలువ రూ.12 వేల కోట్లకు పైనే అని చెబుతారు. విలాసవంతమైన కార్ల కలెక్షన్ కు కొదవ లేదు. కానీ.. ఆయన మాత్రం ముంబయి లోకల్ ట్రైన్ లోనూ.. మెట్రో రైళ్లలోనూ ప్రయాణిస్తుంటారు. ఎందుకిలా? అంటే కారణం లేకపోలేదు.
ముంబయి మహానగరంలో ట్రాఫిక్ ఏ స్థాయిలో ఉంటుందో అందరికి తెలిసిందే. అంతటి ట్రాఫిక్ లో జర్నీకి చాలా టైం తీసుకుంటుంది. అందుకే.. సమయానికి విలువనిచ్చే నిరంజన్.. ట్రాఫిక్ లో తన టైంను వేస్టు చేసుకోవట సుతారం ఇష్టపడరు. అందుకే.. టైం వేస్టు చేయకుండా లోకల్ ట్రైన్లలో ప్రయాణిస్తుంటారు. అంతేకాదు.. లోకల్ ట్రైన్ లో ప్రయాణించే వేళలో సాధారణ వ్యక్తులతో కలిసి జర్నీని అస్వాదించొచ్చన్నది ఆయన భావన.
ఆయన్ను అందరూ సెల్ఫ్ మేడ్ బిలియనీర్ గా పిలుస్తుంటారు. చార్టర్డ్ అకౌంటెంట్ కావాలన్న లక్ష్యంతో సీఏ చదువును అభ్యసించిన ఆయన.. తర్వాత అకౌంటింగ్ టీచర్ గా తన కెరీర్ ను షురూ చేశారు. వాణిజ్య రంగంలో కొన్నేళ్ల తర్వాత తన సోదరుడితో కలిసి హీరానందని గ్రూపును స్థాపించారు. 1981లో వస్త్ర వ్యాపారాన్ిన స్టార్ట్ చేసిన ఆయన ఆ తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తిరిగి చూసుకునే అవకాశం లేకుండా ఎదిగిపోయారు.