పాత -కొత్తల పంచాయితీ: పటాన్ చెర్వు కాంగ్రెస్ లో లొల్లి!

ఇదిలా ఉండగా తాజాగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పాత కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు పిలుపునిచ్చారు.

Update: 2025-01-23 11:20 GMT

పఠాన్ చెర్వు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న లొల్లి ఇప్పుడు దాడుల వరకు వెళ్లింది. పటాన్ చెర్వు ఎమ్మెల్యేగా ఉన్న గూడెం మహిపాల్ రెడ్డి ఎన్నికల వేళ బీఆర్ఎస్ లో ఉండటం.. గెలిచిన తర్వాత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవటం తెలిసిందే. ఇదిలా ఉండగా.. నియోజకవర్గంలో కొత్త - పాత కాంగ్రెస్ మధ్య పంచాయితీ నడుస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పాత కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు పిలుపునిచ్చారు. అది కాస్తా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది.

సేవ్ కాంగ్రెస్ - సేవ్ పఠాన్ చెర్వు స్లోగన్స్ తో కార్యకర్తలు.. నాయకులు పటాన్ చెర్వులోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద ధర్నాకు దిగారు. దీంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు భారీగా మొహరించారు. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన అనుచరులతో పాత కాంగ్రెస్ నాయకులపై దాడి చేస్తున్నట్లుగా కాట శ్రీనివాస్ గౌడ్ వర్గం నేతలు ఆరోపిస్తున్నారు.

అసలీ పంచాయితీ మొత్తం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి.. బొల్లారానికి చెందిన పాత కాంగ్రెస్ నేతల్ని తిట్టటంతో ఇష్యూ మొదలైంది. కాంగ్రెస్ పార్టీలోకి నీలం మధు ముదిరాజ్.. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చేరికను మొదట్నించి పటాన్ చెర్వు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ వ్యతిరేకిస్తున్నారు. 2018, 2023లోజరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గూడెం మహిపాల్ రెడ్డి చేతిలో ఓడిపోయారు కాట శ్రీనివాస్. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్.. కాంగ్రెస్ తరఫు టికెట్ ఆశించిన భంగపడిన నీలం మధు బీఎస్పీ తరఫు పోటీ చేయటం.. మూడో స్థానానికి పరిమితం కావటం తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ లో చేరిన ఆయన.. మెదక్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో.. ఈ ముగ్గురు నేతల మధ్య నియోజకవర్గంలో తరచూ అధిపత్య పోరు నడుస్తోంది. దీంతో కాంగ్రెస్ అధిష్ఠానానికి ఇదో తలనొప్పిగా మారింది.

తాజాగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ఈ రోజు (గురువారం) కాటా శ్రీనివాస్ గౌడ్ అనుచరులు ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దగ్థం చేసేందుకు ప్రయత్నించారు. దీన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాటా అనుచరులు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ముట్టడికి పిలుపునివ్వటమే కాదు.. ఆఫీస్ పై దాడికి పాల్పడ్డారు. దీనిపై ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పార్టీకి చెందిన కొందరుచేసిన ఈ దుశ్చర్యను అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తానని.. ఫర్నీచర్ ను ధ్వంసం చేసిన వారిపై పోలీసులకు కంప్లైంట్ చేస్తానని పేర్కొన్నారు. ఒక గూండా.. రౌడీలా తన మనుషుల్ని కాటా శ్రీనివాస్ ఉసిగొల్పారన్న గూడెం మహిపాల్ రెడ్డి.. తాము గాజులు తొడుక్కోని లేమని.. సరైన సమయంలో సరైన రీతిలో బుద్ధి చెబుతామంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

క్యాంప్ ఆఫీస్ అంటే ఒక ఇల్లు లాంటిదని.. అక్కడ ఏ ఫోటో పెట్టుకోవాలి.. ఏది పెట్టుకోకూడదన్నది తన ఇష్టమన్నారు. 35 ఏళ్ల నుంచి రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులను చూశానని.. ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై అధినాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Tags:    

Similar News