మొన్న 'పుష్ప', నిన్న 'మంచు'... బౌన్సర్లు ఎవరిపై అయినా దాడి చేయొచ్చా?
మొన్న సంధ్య థియేటర్ లో 'పుష్ప-2' బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే.
మొన్న సంధ్య థియేటర్ లో 'పుష్ప-2' బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో.. అల్లు అర్జున్ కు రక్షణగా వచ్చిన బౌన్సర్లు.. అభిమానులను తోసేస్తూ చేసిన హడావుడి కాస్తా తొక్కిసలాటకు కారణమైందనే చర్చ జరిగింది. ఇక నిన్న ‘మంచు’ ఫ్యామిలీ వ్యవహారంలోనూ బౌన్సర్ హాట్ టాపిక్!
ప్రధానంగా మంచు విష్ణు 40 మంది బౌన్సర్లను తెచ్చుకున్నారని.. మనోజ్ వెంట 30 మంది బౌన్సర్లు ఉన్నారని కథనాలొచ్చాయి. ఇక.. మంగళవారం రాత్రి బలవంతంగా గేటు తోసుకుని లోపలికి వెళ్లిన మనోజ్ చిరిగిన చొక్కాతో బయటకు రావడం వెనుక బౌన్సర్ల హస్తం ఉందని.. మీడియా ప్రతినిధులపై జరిగిన దాడిలోనూ వీరి పాత్ర ఉందని అంటున్నారు.
ఇక.. సాధారణంగా పబ్బులు, షాపింగ్ మాల్స్, బార్లు, సినిమా ఫంక్షన్లు, ప్రముఖుల పర్యటనల సందర్భంగా ఈ బౌన్సర్లు ఎక్కువగా కనిపిస్తుంటారు. ఆ సమయంలో అడ్డొచ్చిన వారందరినీ పక్కకు జరిపేస్తూ.. ప్రశ్నించినవారిపై కొన్ని సందర్భాల్లో భౌతిక దాడులకు పాల్పడుతూ హడావిడి చేస్తుంటారని అంటారు.
ఈ నేపథ్యంలోనే అసలు బౌన్సర్ల నియామకం, వారి విధులు ఏమిటనే చర్చ తెరపైకి వచ్చింది. ఇటీవల కాలంలో చాలా మంది బౌన్సర్లను రిక్రూట్ చేసుకుంటున్న నేపథ్యంలో... నకిలీ ఏజెన్సీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయని.. నేర చరిత్ర ఉన్నవారిని ఈ ఏజెన్సీలు బౌన్సర్లుగా నియమించుకుంటున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
అవును... ఇటీవల కాలంలో కాస్త దేహదారుఢ్యం, ఎత్తు ఉంటే చాలు బౌన్సర్లుగా తీసేసుకుంటున్నారనే చర్చ తెరపైకి వచ్చిందని అంటున్నారు. హైదరబాద్ లో బౌన్సర్లుగా చలామణి అవుతున్నవారిలో చాలా మంది నేర చరిత్ర ఉన్నవాళ్లని.. సెలబ్రెటిలతో ఫోటోలు దిగి సెటిల్ మెంట్లు చేస్తుంటారని అంటున్నారు. వీరి ఆదాయం లక్షల్లో ఉంటుందని చెబుతున్నారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... బౌన్సర్ల నియామకం, విధులపై ప్రత్యేక నిబంధనలంటూ ఏమీ లేవని అంటున్నారు! అయితే... ది ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ చట్టం (పస్రా) - 2025 ప్రకారం వీరిని సెక్యూరిటీ సిబ్బందిగా పరిగణించాలని.. వీరి నియామకం విషయంలో ఏజెన్సీలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు.
ఇందులో భాగంగా... రిజిస్టరైన ఏజెన్సీలు నేర చరిత్ర, ప్రవర్తన ఆధారంగానే భద్రతా సిబ్బందిని తీసుకోవాలి. ఇదే సమయంలో రిక్రుట్ మెంట్ అనంతరం.. బౌన్సర్లుగా వారు ప్రవర్తించాల్సిన తీరు, ఇతర అంశాలపై పక్కాగా శిక్షణ ఇవ్వాలి. కేవలం భద్రత కల్పించడమే తప్ప.. ఇతరులపై దాడి చేయడం చేరాదనే విషయం బుర్రకెక్కించాలని అంటున్నారు!
ఇక... బౌన్సర్లు దాడి చేస్తే వారిపై కేసు నమోదు చేయొచ్చని చెబుతున్నారు. ఈ సందర్భంగా వారిని ఎంపిక చేసుకున్నవారిని, వారి సేవలు పొందుతున్నవారి మీదా చర్యలు తీసుకోవచ్చని చెబుతున్నారు. ఇక ప్రధానంగా... బౌన్సర్లు యూనిఫాం ధరించాలి.. దానిపై కంపెనీ పేరుతో పాటు పీ.ఎస్.ఎల్.ఎన్. లైసెన్స్ నెంబర్, దాని పక్కన స్టేట్ కోడ్ తప్పనిసరిగా ఉండాలి.
ఈ కోడ్ ను పస్రా వెబ్ సైట్ లో వెతికితే వారి వివరాలు రావాలి! అయితే... ఇవేవీ లేకుండా ఇటీవల బౌన్సర్ల పేరుతో కొంతమంది ప్రజల్ని భయపెడుతున్నరనే ఆరోపణలు ఉన్నాయి. ఇది పెద్ద సమస్యగా మారుతోందని అంటున్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టిసారించాల్సిన సమయం ఆసన్నమైందని చెబుతున్నారు.