'యూట్యూబ్' ను కేసీఆర్ సర్కారు కంట్రోల్ చేస్తుందా?
కేంద్రం చేతిలో కీలుబొమ్ముగా యూట్యూబ్ మారిందని..తాజాగా తెలంగాణలోనూ అలాంటి తీరునే ప్రదర్శిస్తుందని మండిపడుతున్నారు
తెలంగాణ అధికారపక్షంపై సరికొత్త ఆరోపణ కాంగ్రెస్ అమ్ములపొదిలో చేరింది. ఇప్పటివరకు ప్రభుత్వ వైఫల్యాలు.. పాలనలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలపై గళం విప్పిన కాంగ్రెస్ ఇప్పుడు మరో కొత్త అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చింది. రెండు రోజుల క్రితం తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్.. ప్రియాంకలు హాజరైన బహిరంగ సభలకు సంబంధించిన ప్రసంగాలకు యూ ట్యూబ్ పెట్టిన హెచ్చరికల సంకేతాలు వివాదాస్పదంగా మారాయి. ఇప్పటికే గూగుల్.. యూట్యూబ్ మీద విరుచుకుపడుతున్న కాంగ్రెస్.. తాజాగా మరోసారి మండిపడింది
కేంద్రం చేతిలో కీలుబొమ్ముగా యూట్యూబ్ మారిందని..తాజాగా తెలంగాణలోనూ అలాంటి తీరునే ప్రదర్శిస్తుందని మండిపడుతున్నారు. దీనికి కారణం.. తెలంగాణలో చేసిన ప్రసంగాలను కాంగ్రెస్ తన అధికారిక యూట్యూబ్ చానళ్లలో అప్ లోడ్ చేసింది. ఈ వీడియోలకు వీక్షకుల విచక్షణ పేరుతో వార్నింగ్ సింబల్స్ ను యూట్యూబ్ పెట్టింది.
సదరు వీడియోలో ఉన్న అంశాలు.. ఆత్మహత్యలు.. స్వీయ హానికారక అంశాలతో కలిగి ఉందన్న అర్థం వచ్చేలా ఉండటం వివాదాస్పదమైంది. అంతేకాదు.. ఈ వీడియోను చూడాలనుకునే వారు.. హెచ్చరిక సందేశాన్ని అర్థం చేసుకొన్నాను.. అయినప్పటికి వీడియో చూసేందుకే మొగ్గు చూపుతున్నానన్న బటన్ నొక్కితే తప్పించి వీడియో ప్లే కాదు. దీనిపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సోషల్ మీడియా వేదికల్ని అధికార పార్టీలు ఎలా కంట్రోల్ చేస్తున్నాయన్న దానికి ఈ పరిణామం ఒక ఉదాహరణగా చెబుతున్నారు.
మరోవైపు సోషల్ మీడియాలను వేదికగా చేసుకొని అధికార పార్టీలు ఎలా కంట్రోల్ చేస్తున్నాయో పేర్కొంటూ ఇటీవల వాషింగ్టన్ పోస్టు ఒక కథనాన్ని పబ్లిష్ చేసింది. ఇదే విధానాన్ని కాంగ్రెస్ విషయంలో యూట్యూబ్ ఇండియా కూడా అనుసరిస్తుందంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ మండిపడుతున్నారు. సోషల్ మీడియా ప్లాట్ ఫాంను అధికార పార్టీలు కంట్రోల్ చేస్తున్నాయన్న మచ్చపై యూట్యూబ్ ఏ రీతిలో రియాక్టు అవుతుందో చూడాలి.