రేర్ సీన్: ఏడుపాయల అమ్మవారి వద్ద పోటాపోటీ ప్రమాణాలు

రాజకీయాలన్న తర్వాత ఆరోపణలు.. ప్రత్యారోపణలు మామూలే. అయితే.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా చోటు చేసుకుంది.

Update: 2023-09-08 04:33 GMT

రాజకీయాలన్న తర్వాత ఆరోపణలు.. ప్రత్యారోపణలు మామూలే. అయితే.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా చోటు చేసుకుంది. తాము చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉంటామని ఒక వర్గం చెబితే.. తనపై వచ్చిన ఆరోపణల్లో వీసమెత్తు కూడా వాస్తవం లేదంటూ గులాబీ ఎమ్మెల్యే భర్త ఒకరు తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. మెదక్ జిల్లాలోని ఏడుపాయల వన దుర్గాభవాని మాత ఎదుట పోటాపోటీగా చేసుకున్న ప్రమాణాలు.. అధికార పార్టీలో కొత్త సెగకు కారణమైంది.

అమ్మవారికి చెందిన బంగారు.. వెండి ఆభరణాల్ని ఆలయ ఈవో శ్రీనివాస్ తన ఇంట్లో ఉంచటం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన మాట్లాడుతూ.. మింట్ నుంచి బంగారం తీసుకొచ్చిన విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే పద్మా భర్త దేవేందర్ రెడ్డికి చెప్పినట్లుగా పేర్కొన్నారు. ఈ ఉదంతంలో ఆయనకు ప్రమేయం ఉందని.. ఆయన భూకబ్జాలకు పాల్పడుతున్నారని.. అక్రమాలు చేస్తున్నారంటూ సొంత పార్టీకి చెందిన అసమ్మతి నేతలు మండిపడ్డారు.

తమ పార్టీకి చెందిన అసమ్మతి వారు తనపై చేసిన ఆరోపణల్ని ఆయన సీరియస్ గా తీసుకున్నారు. అవన్నీ తప్పని ఖండించారు. అక్కడితో ఆగని ఆయన.. తనపై చేసిన ఆరోపణల్లో నిజం లేదని.. ఆ విషయాన్ని అమ్మవారి సమక్షంలోనే నిరూపిస్తానని పేర్కొన్నారు. ఇందులో భాగంగా తాను గుడికి వస్తానని.. ఆలయంలో తడిబట్టలతో అమ్మవారి ఎదుట ప్రమాణం చేస్తానని పేర్కొన్నారు. అందుకు తగ్గట్లే.. 1500 మంది అనుచరులతో ఊరేగింపుగా ఏడుపాలయ ఆలయానికి చేరుకున్నారు.

ఆయనకు పోటీగా అసమ్మతి నాయకులు సైతం 500 మందితో ర్యాలీతో వచ్చారు. ఇరు వర్గాల వారు వేర్వేరుగా మంజీరా నదిలో స్నానం చేశారు. తొలుత దేవేందర్ రెడ్డి స్నానం చేసి తడి వస్త్రాలతో రాజగోపురంలో అమ్మవారి ఎదుట తాను అక్రమాలకు పాల్పడలేదని ప్రమాణం చేశారు. అనంతరం అసమ్మతి నేతలు సైతం అదే రీతిలో స్నానం చేసి.. పసుపు వస్త్రాల్ని ధరించి మరీ ప్రమాణం చేస్తూ.. దేవేందర్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారంటూ కొన్ని పత్రాల్ని అమ్మవారి ఎదుట పెట్టటం సంచలనంగా మారింది. గులాబీ నేతల మధ్య నెలకొన్న పంచాయితీ సంగతి ఎలా ఉన్నా.. విషయం పోటాపోటీ ప్రమాణాల వరకు వెళ్లటం హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News