పంచ పాండవుల్లా.. బీఆర్ఎస్ లో మిగిలేది ఆ ఐదుగురు ఎమ్మెల్యేలేనా?
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ లోనే 16 స్థానాలు నెగ్గింది. వీటిలో కంటోన్మెంట్ ను ఉప ఎన్నికల్లో కోల్పోయింది.
తెలంగాణలో దాదాపు పదేళ్లు అప్రతిహతంగా అధికారం చెలాయించిన భారత రాష్ట్ర సమితి.. అధికారం కోల్పోయాక పది నెలలైనా మనుగడ సాగించగలదా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో కనీస సంఖ్యలో అయినా సీట్లు గెలిచి ఉంటే ఎలా ఉండేదో కానీ.. ఖాతా తెరవకపోవడంతో ఆ పార్టీ భవిష్యత్ ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు కారు దిగి అధికార కాంగ్రెస్ లో చేరారు. మరో 10 మంది ఎమ్మెల్యేలు అదే దారిలో ఉన్నారని అంటున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ లో ఖాళీ?
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ లోనే 16 స్థానాలు నెగ్గింది. వీటిలో కంటోన్మెంట్ ను ఉప ఎన్నికల్లో కోల్పోయింది. అంతకుముందు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ కు బైబై చెప్పి కాంగ్రెస్ లో చేరి సికింద్రాబాద్ ఎంపీగానూ పోటీ చేశారు. ఇక హైదరాబాద్ లోని ఎమ్మెల్యేల్లో అత్యధికులు బీఆర్ఎస్ కు టాటా చెప్పేవారేనని, అసలు ఒక్కరూ మిగలరని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా, రెండు రోజుల కిందట మాజీ మంత్రి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి హస్తం పార్టీకి జైకొట్టారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ కూడా వెళ్లిపోయారు.
39-5= 34
బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు సాధించింది. వీరిలో నలుగురు వెళ్లిపోయారు. కంటోన్మెంట్ సీటును పోగొట్టుకుంది. అంటే ప్రస్తుతం 34 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే, వీరిలో గంగుల (కరీంనగర్) వంటి వారిపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కాంగ్రెస్ లోకి వెళ్లినట్లే వెళ్లి వచ్చేశారు.
నికరంగా మిగిలేది వీరే..
బీఆర్ఎస్ లో నికరంగా మిగిలే ఎమ్మెల్యేలు వీరేనంటూ ఇటీవల కొంత చర్చ నడుస్తోంది. పార్టీ అధినేత కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, జగదీశ్వర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి మాత్రమేనని చెబుతున్నారు. వీరిలోనూ.. తనపై పార్టీ మారాలంటూ ఒత్తిడి ఉందని పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఒకవేళ ఆయన ఒత్తిళ్లకు లొంగితే మరో ఎమ్మెల్యే చేజారినట్లే. అయితే, ఇవన్నీ కేవలం అంచనాలే. వినిపిస్తున్న ఊహాగానాలే..