ప్రపంచ కుబేరుడి చేతికి పెద్దన్న గల్లాపెట్టె తాళం చెవి

అమెరికా ప్రభుత్వ ఖజానా నుంచి జరిగే ప్రతి నగదు చెల్లింపుపై సమీక్ష జరిపే అధికారాన్ని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు దఖల పరుస్తూ నిర్ణయం తీసుకున్నట్లుగా పేర్కొన్నారు.

Update: 2025-02-03 05:30 GMT

మీకెంతో సన్నిహితుడు ఉంటాడు. అతనితో మీకున్న అనుబంధం పెద్దదనే అనుకుందాం. ఆ మాత్రానికే మీ బ్యాంకు ఖాతాల సమాచారాన్ని ఇవ్వటమే కాదు.. ఖర్చు చేసే ప్రతి రూపాయి లెక్క చూసే యాక్సిస్ ఇస్తారా? ఎంత తోపు ఫ్రెండ్ అయినా ఇందుకు ససేమిరా అంటారు. వ్యక్తిగతంగానే ఇలాంటి పరిస్థితి ఉంటే.. ఒక దేశానికి సంబంధించిన చెల్లింపుల వ్యవహారాలన్నింటిని ఒకరి చేతిలో పెట్టటంలో అర్థమేమైనా ఉందా? అన్నది ప్రశ్న. ఇప్పుడు అలాంటి నిర్ణయాన్నే తీసుకుంది ట్రంప్ సర్కారు. సంచలనంగా మారిన ఈ వ్యవహారాన్ని ప్రముఖ మీడియా సంస్థ న్యూయార్క్ టైమ్స్ తన తాజా కథనంలో వెల్లడించింది.

అమెరికా ప్రభుత్వ ఖజానా నుంచి జరిగే ప్రతి నగదు చెల్లింపుపై సమీక్ష జరిపే అధికారాన్ని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు దఖల పరుస్తూ నిర్ణయం తీసుకున్నట్లుగా పేర్కొన్నారు. మస్క్ టీంకు ట్రెజరీ పేమెంట్ సిస్టమ్స్ పై యాక్సెస్ చేసే సదుపాయాన్ని కలుగజేయటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయంతో ఏ మంత్రిత్వ శాఖ అయినా చెల్లించే ప్రతి మొత్తం మస్క్ టీంకు తెలియనుంది. అంతేకాదు.. ప్రభుత్వ పథకాల లబ్థిదారులకు ఎంతెంత మొత్తాల్ని అమెరికా ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లింపుల వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటారు.

ఇలా ప్రభుత్వ చెల్లింపుల విధానానికి సంబంధించిన డేటా మస్క్ చేతికి అందేలా ఎందుకు చేస్తారు? అని ప్రశ్నిస్తున్నారు. అత్యంత రహస్యమైన ప్రభు్వ చెల్లింపుల విధాన డేటా మొత్తం మస్క్ టీం చేతిలో ఉంచటం సరికాదని.. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన చెల్లింపులను ఈ టీం కావాలనుకుంటే తొక్కి పెట్టే వీలుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

రాజకీయ దురుద్దేశంతో చెల్లింపుల విషయంలో అనవసర జోక్యం దేశ ఆర్థిక పరిస్థితి మీద ప్రభావం చూపుతుందన్న ఆందోళనను వ్యక్తం చేస్తూ దేశ ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ కు రాన్ వైడెన్ అనే సెనేటర్ లేఖ రాశారు. ఈ సందర్భంగా మరో అంశం తెర మీదకు వచ్చింది. అమెరికా ఆర్థిక శాఖ తాత్కాలిక ఉప మంత్రిగా పని చేసిన ప్రభుత్వ అధికారి డేవిడ్ లెబ్ రిక్ రాజీనామా వెనుక కూడా.. మస్క్ టీంకు యాక్సిస్ ఇవ్వాలన్న ఒత్తిడి కారణంగానే .. ఆయన రాజీనామా చేసి ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ట్రంప్ సర్కారు తీరుపై ఆందోళన వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News