అమెరికన్లను వణికించిన మరో విమాన ప్రమాదం
అమెరికాలోని హ్యూస్టన్ నుంచి న్యూయార్క్ కు వెళ్లే యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానం ప్రమాదానికి గురైంది.
ఒకటి తర్వాత మరొకటి అన్న చందంగా అగ్రరాజ్యం అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గడిచిన మూడు రోజుల్లో రెండు భారీ విమాన ప్రమాదాలు చోటు చేసుకోవటం.. మరణాలు చోటు చేసుకోవటం తెలిసిందే. తాజాగా మరో విమానం ప్రమాదం చోటు చేసుకుంది. లక్కీగా ఎవరికి ఏమీ కాకపోవటంతో అందరూ గట్టిగా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే..
అమెరికాలోని హ్యూస్టన్ నుంచి న్యూయార్క్ కు వెళ్లే యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానం ప్రమాదానికి గురైంది. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం.. (భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున) జార్జిబుష్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక విమానం టేకాఫ్ అవుతోంది. దాని రెక్కల్లో ఒకదానిలో మంటలు చెలరేగాయి.
దీంతో స్పందించిన విమానాశ్రయ సిబ్బంది.. విమానాన్ని ఆపేసి ప్రయాణికుల్ని విమానం నుంచి దింపేశారు. ఈ క్రమంలో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. త్రుటిలో పెను ప్రమాదం తప్పింది.
ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలుకాలేదని హ్యుస్టన్ ఫైర్ డిపార్ట్ మెంట్ వెల్లడించింది. అయితే.. ఈ ప్రమాద సమయంలో విమాన ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.