గుత్తా : తెలంగాణ కౌన్సిల్ పీఠం కదిలినట్లేనా ?!
బీఆర్ఎస్ మాత్రం ఎట్టి పరిస్తితులలో గుత్తాను చైర్మన్ సీటు నుండి దించడం ఖాయం అని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణలో అనూహ్యంగా గత డిసెంబరులో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఆ తరువాత ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాని నేపథ్యంలో తెలంగాణలో మరో కీలక పరిణామానికి రంగం సిద్దం అవుతున్నట్లు తెలుస్తుంది. తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నల్లగొండ ఎంపీ అభ్యర్థిగా తన కుమారుడు గుత్తా అమిత్ ను నిలబెట్టాలని ప్రయత్నించారు. దానికి బీఆర్ఎస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అయినా గుత్తా తన కుమారుడు పోటీ చేయడని వెనక్కి తగ్గి మొదట ఉమ్మడి జిల్లాలోని తన అనుచరులను కాంగ్రెస్ పార్టీలోకి పంపారు. అనంతరం ఎన్నికలకు ముందే తన కుమారుడిని కాంగ్రెస్ లోకి పంపారు. అంతకుముందు నుండే ముఖ్యమంత్రి రేవంత్ ను పొగడడం, కేసీఆర్ మీద విమర్శలు చేయడం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో శాసనమండలి చైర్మన్ స్థానం నుండి గుత్తాకు ఉద్వాసన పలకాలని బీఆర్ఎస్ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తుంది.
తెలంగాణ శాసనమండలిలో 40 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో బీఆర్ఎస్ పార్టీకి 26 మంది, కాంగ్రెస్ పార్టీకి 5, పీఆర్టీయూకు 2, ఎంఐఎంకు 2 సభ్యుల బలం ఉండగా మరో రెండు గవర్నర్ కోటా స్థానాలు ఖాళీగా ఉన్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలుగా ఉన్న మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డిలు ఇప్పటికే పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో బీాఆర్ఎస్ బలం 24కు పడిపోయింది. కాంగ్రెస్ 5, ఎంఐఎం 2, పీఆర్టీయూ 2, పార్టీ మారిన వారు 2, గవర్నర్ కోటా రెండు, చైర్మన్ గుత్తాతో కలిసి కాంగ్రెస్ పార్టీకి 14 మంది సభ్యులు మాత్రమే అవుతారు.
చైర్మన్ కావాలంటే 20 మంది పైగా సభ్యుల సహకారం కావాలి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్సీలను లాగేందుకు గుత్తా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. అయితే అందుబాటులోకి వచ్చిన కొందరి డిమాండ్లు చాంతాడంత ఉన్నట్లు తెలుస్తుంది.ముఖ్యంగా త్వరలో పదవీకాలం పూర్తవుతున్న వారు తిరిగి మండలి పోస్ట్ అడుగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ ఢిల్లీ స్థాయిలో నిర్ణయం జరగాలి కాబట్టి ఆ ప్రయత్నాలు ఫలించడం లేదట. బీఆర్ఎస్ మాత్రం ఎట్టి పరిస్తితులలో గుత్తాను చైర్మన్ సీటు నుండి దించడం ఖాయం అని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.