కోమ‌టిరెడ్డి పేరు చెప్పి కాంగ్రెస్‌ను చీల్చ‌డ‌మే బీఆర్ఎస్ ప్లాన్‌?

కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి పేరు చెప్పి తెలంగాణ కాంగ్రెస్‌లో చీలిక కోసం ప్ర‌య‌త్నిస్తున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Update: 2024-04-23 16:30 GMT

చేజారిన అధికారం.. గ‌ల్లంతైన ఆశ‌లు.. పుంజుకోవ‌డానికి పోరాటం.. ఇప్పుడు తెలంగాణ‌లో బీఆర్ఎస్ ప‌రిస్థితి ఇది. తెలంగాణ ఏర్ప‌డ్డాక వ‌రుస‌గా రెండు ఎన్నిక‌ల్లో గెలిచిన ఆ పార్టీ.. ఇప్పుడు ఉనికిని కాపాడుకోవ‌డం కోసం పోరాటం చేసే ప‌రిస్థితుల్లో ఉంది. గ‌త తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మితో ఢీలా ప‌డ్డ పార్టీకి ఇప్పుడు లోక్‌స‌భ ఎన్నిక‌లకు ముందు త‌మ నాయ‌కులు కాంగ్రెస్లోకి వెళ్తుండ‌టం మ‌రింత షాక్ క‌లిగిస్తోంది. దీంతో ఏం చేయాలో తోచ‌ని స్థితిలో బీఆర్ఎస్ నేత‌లు కొత్త ప్ర‌చారానికి తెర‌లేపార‌నే చెప్పాలి. కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి పేరు చెప్పి తెలంగాణ కాంగ్రెస్‌లో చీలిక కోసం ప్ర‌య‌త్నిస్తున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఇటీవ‌ల ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌చారంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఓ స‌భ‌లో మాట్లాడుతూ.. తెలంగాణ కాంగ్రెస్‌లో త‌న‌తో పాటు సీఎం అయ్యే అర్హ‌త కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డికి ఉంద‌ని అన్నారు. న‌ల్గొండ జిల్లాలో కోమ‌టిరెడ్డి సోద‌రుల‌కు ఉన్న ప‌ట్టు, వెంక‌ట్‌రెడ్డి సీనియ‌ర్ నాయ‌కుడు కావ‌డంతో రేవంత్ అలా వ్యాఖ్యానించిన‌ట్లు తెలుస్తోంది. అప్పుడు రేవంత్ ప‌క్క‌నే వెంక‌ట్‌రెడ్డి ఉన్నారు. ఆ స‌భ ముగిసింది. కాంగ్రెస్ పార్టీలోని సీనియ‌ర్ నాయ‌కులు కూడా రేవంత్ వ్యాఖ్య‌ల‌పై ఎలాంటి అభ్యంత‌రాలు లేవ‌నెత్త‌లేదు. కానీ బీఆర్ఎస్ నేత‌లు మాత్రం దీనిపై నెగెటివ్ ప్ర‌చారం మొద‌లెట్టార‌నే టాక్ ఉంది.

అంటే కాంగ్రెస్‌లో వెంక‌ట్‌రెడ్డిని మించిన నాయ‌కులు లేరా అని బీఆర్ఎస్ నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు. అంతే కాకుండా భ‌ట్టి విక్ర‌మార్క‌, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, జ‌నారెడ్డి త‌దిత‌ర సీనియ‌ర్ నాయ‌కుల‌ను కాద‌ని సీఎం అయ్యే అర్హ‌త వెంక‌ట్‌రెడ్డికి ఉంద‌ని ఎలా చెబుతార‌ని అంటున్నారు. దీని ద్వారా మిగతా కాంగ్రెస్ నాయ‌కుల‌ను రెచ్చ‌గొట్టి పార్టీలో మ‌రోసారి అంత‌ర్గ‌త విభేదాలు సృష్టించేందుకు బీఆర్ఎస్ ప్ర‌య‌త్నిస్తోంద‌ని తెలుస్తోంది. కానీ ఇది ఒక‌ప్ప‌టి కాంగ్రెస్ కాదు. ఇప్పుడు తెలంగాణ‌లో అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత సీనియ‌ర్లు ఎవ‌రి పని వాళ్లు చేసుకుంటున్నారు. ప్ర‌స్తుతం అంద‌రూ క‌లిసి లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో పార్టీకి మెజారిటీ స్థానాలు ద‌క్కేలా చేసేందుకు క‌ష్ట‌ప‌డుతున్నారు. అందుకే బీఆర్ఎస్ ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా ఫ‌లితం ఉండ‌ద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News