నాడు మైకేల్ జాక్సన్ షో.. నేడు ‘కోల్డ్ ప్లే’..ఊగిపోతున్న భారత్!
చాలామందికి గుర్తుందో లేదో.. 1996లో ప్రపంచ ప్రఖ్యాత డ్యాన్సర్ మైకేల్ జాక్సన్ భారత దేశానికి వచ్చారు.
చాలామందికి గుర్తుందో లేదో.. 1996లో ప్రపంచ ప్రఖ్యాత డ్యాన్సర్ మైకేల్ జాక్సన్ భారత దేశానికి వచ్చారు. అప్పట్లో టీవీలు ఇంతగా లేవు. సెల్ ఫోన్లూ పెద్దగా లేవు.. సోషల్ మీడియా అసలే లేదు. కానీ, ముంబైలో జరిగిన మైకేల్ జాక్సన్ మ్యూజిక్ కాన్సర్ట్ కు యువత పోటెత్తారు. ముంబై ఎయిర్ పోర్ట్ లోనే జాక్సన్ కోసం 5 వేల మంది పడిగాపులు కాశారు. నగర వీధుల్లో అయితే బారులు తీరారు. జాన్సన్ మన దేశానికి వచ్చాడని తెలుసుకున్న మిగతా ప్రజలూ పులకించిపోయారు. నాడు.. ముంబైలోని అతిపెద్ద మురికివాడ ధారావిని సందర్శించి పేద పిల్లలను పలకరించిన మైకేల్ జాక్సన్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. మొత్తమ్మీద భారత్ ను జాక్సన్ ఒక ఊపు ఊపి వెళ్లిపోయారు.
మళ్లీ దాదాపు 30 ఏళ్ల తర్వాత మైకేల్ జాక్సన్ షో స్థాయిలో ఓ కార్యక్రమం దేశాన్ని ఊపేస్తోంది. వణికించే చలిని కూడా లెక్క చేయకుండా పోటెత్తేలా చేస్తోంది. వేలాది మందిని ఒక్కచోటకు చేర్చి గట్టిగా గళమెత్తి పాడిస్తోంది. అదే.. బ్రిటీష్ రాక్ బ్యాండ్ కోల్డ్ ప్లే. దీనికీ యువతే భారీగా హాజరవుతున్నారు.
కోల్డ్ ప్లే భారత్ కు వస్తోందని సెప్టెంబరులో ఖరారైంది. ఆ కాసేపటికే ఆన్ లైన్ లో టికెట్లు బుక్ అయి పోయాయి. బుక్ మై షో హ్యాంగ్ కూడా అయిందట. కాగా, కోల్డ్ ప్లే కాన్సర్ట్ లకు టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ బుమ్రా, సినీ హీరోయిన్ కాజల్ అగర్వాల్, ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ కూడా హాజరయ్యారంటే పాపులారిటీని అర్థం చేసుకోవచ్చు.
లక్షమంది మధ్యన బుమ్రా..
అహ్మదాబాద్ స్టేడియంలో లక్షమంది మధ్యన ఒత్తిడి లేకుండా వన్డే ప్రపంచ కప్ ఫైనల్స్ ఆడిన బుమ్రా అదే అహ్మదాబాద్ స్టేడియంలో లక్షమంది మధ్య జరిగిన కోల్డ్ ప్లేలో మాత్రం కాస్త సిగ్గుపడ్డాడు. కోల్డ్ ప్లే అంటే బ్రిటీష్ రాక్ బ్యాండ్. సరిగ్గా మైకేల్ జాక్సన్ భారత్ కు వచ్చిన 1996లోనే సింగర్ క్రిస్ మార్టిన్, గిటారిస్ట్ జానీ బక్ లాండ్ దీనిని ప్రారంభించారు. యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ లండన్ విద్యార్థులైన వీరు తమ రాక్ బ్యాండ్ కు పెక్టోరాల్జ్ గా పేరు పెట్టారు. అయితే, బేసిస్ట్ బెర్రిమాన్ చేరాక పేరు స్టార్ ఫిష్ అయింది. తర్వాత డ్రమ్మర్ విల్ చాంపియన్ కూడా కలవడంతో 1998 లో ‘కోల్డ్ ప్లే’గా మారింది.
2000లో కోల్డ్ ప్లే మొదటి ఆల్బమ్ పారాచూట్స్ బాగా సక్సెస్ అయింది. ఆ తర్వాత ఎల్లో, షివర్ వంటివి కూడా సూపర్ హిట్ కావడంతో పాటు గ్రామీ అవార్డులు వరించాయి. 2002లో ‘ఎ రష్ ఆఫ్ బ్లడ్ టు ది హెడ్’తో ఇక పాశ్చాత్య సంగీత ప్రపంచంలో తిరుగు లేకుండా పోయింది.
21వ శతాబ్దంలో అత్యంత విజయవంతమైన బ్యాండ్ గా కోల్డ్ ప్లేనే కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా వీరివి 100 మిలియన్ల ఆల్బమ్ లు అమ్ముడయ్యాయి. పారాచూట్స్, ‘ఎ రష్ ఆఫ్ బ్లడ్ టు ది హెడ్’, ఎక్స్ అండ్ వై యూకేలో అత్యధికంగా అమ్ముడైన 50 ఆల్బమ్స్ లో ఒకటిగా నిలిచాయి. ఫోర్బ్స్.. ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంత బ్యాండ్ గా 2013లో కోల్డ్ ప్లేను గుర్తించింది. అంతేకాదు.. మ్యూజిక్ యాప్ స్పాటి ఫైలో పదేళ్ల కిందటే కోల్డ్ ప్లే పాటలు 100 కోట్ల స్ట్రీమ్స్ దాటాయి. ఈ ఘనత దక్కిన తొలి బ్యాండ్ కోల్డ్ ప్లేనే కావడం విశేషం.
సూపర్ బౌల్ -50లో ఈ గ్రూప్ షో కు ప్రపంచ చరిత్రలోనే అత్యధిక శాతం మంది హాజరయ్యారు. తమ టూర్ల ద్వారా కోల్డ్ ప్లే బిలియన్ డాలర్లను ఆర్జించడం గమనార్హం. 7 గ్రామీలు, 39 నామినేషన్లు కోల్డ్ ప్లేకు దక్కాయి. సాంగ్ ఆఫ్ ది ఇయర్, రికార్డ్ ఆఫ్ ది ఇయర్ కూడా వీరివే.
కోల్డ్ ప్లే కాన్సర్ట్ మ్యూజిక్, నిర్వహణ భిన్నం. వీరి పాటల థీమ్ లు లవ్, లాస్, హోప్. ఇవి కూడా భావోద్వేగాలను కదిలిస్తాయి. గిటార్స్, పియానోలు, సింథసైజర్లు, వోకల్స్, డ్రమ్స్ దేనికవే భిన్నమైన వాయిద్య పరికరాలను దీనిలో వాడతారు.
ఆ ‘బ్యాండ్’..
కోల్డ్ ప్లే బ్యాండ్ ఎంత పాపులరో.. వారి కాన్సర్ట్ లోని రిస్ట్ బ్యాండ్లూ అంతే ఫేమస్. ఇవి ఎల్‌ఈడీ వెలుగులతో తళుక్కుమంటుంటాయి. జైలో రిస్ట్ బ్యాండ్లు అయిన వీటిని ప్రేక్షకుల అందజేస్తారు. మ్యూజిక్ కు తగ్గట్లు వివిధ రంగుల్లో మెరుస్తుంటాయి. కోల్డ్ ప్లే ముంబై, అహ్మదాబాద్ టూర్ లు చేసినప్పుడు ట్రెండ్ గా మారింది.