ఈ రాయలసీమ నేతకు మంచి రోజులు వస్తున్నట్టేనా?
1978, 1983, 1989ల్లో నందికొట్కూరు నుంచి ఎమ్మెల్యేగా బైరెడ్డి రాజశేఖరరెడ్డి తండ్రి శేషయశయనారెడ్డి ఎన్నికయ్యారు.
రాయలసీమలో పేరున్న నేతల్లో ఒకరు.. బైరెడ్డి రాజశేఖరరెడ్డి. కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు అయిన నందికొట్కూరు నియోజకవర్గానికి చెందినవారు ఆయన. ఈ నియోజకవర్గం నుంచి మద్దూరు సుబ్బారెడ్డి, బైరెడ్డి శేషశయనారెడ్డి వంటివారు గతంలో ఎమ్మెల్యేలుగా చేశారు.
1978, 1983, 1989ల్లో నందికొట్కూరు నుంచి ఎమ్మెల్యేగా బైరెడ్డి రాజశేఖరరెడ్డి తండ్రి శేషయశయనారెడ్డి ఎన్నికయ్యారు. ఆయన తదనంతరం 1994, 1999ల్లో ఆయన కుమారుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో కాంగ్రెస్ అభ్యర్థి గౌరు చరిత చేతిలో బైరెడ్డి ఓడిపోయారు.
ఇక 2009లో అప్పటివరకు జనరల్ నియోజకవర్గంగా ఉన్న నందికొట్కూరు ఎస్సీ రిజర్వుడుగా మారింది. దీంతో బైరెడ్డి రాజశేఖరరెడ్డి కర్నూలు జిల్లాలోని పాణ్యం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు
ఆ తర్వాత తెలంగాణ ప్రత్యేక ఉద్యమం జరుగుతున్నప్పుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి సైతం టీడీపీ నుంచి బయటకొచ్చి రాయలసీమ పరిరక్షణ సమితి పేరుతో ప్రత్యేక ఉద్యమం నడిపారు.
రాయలసీమ పరిరక్షణ సమితి పేరుతో బైరెడ్డి కూడా రాయలసీమ స్థాయిలో కీలక నేతగా ఎదగడానికి ప్రయత్నించినా ఆ ప్రణాళిక అస్సలు వర్కవుట్ కాలేదు. వాస్తవానికి రాయలసీమ పరిరక్షణ సమితి పేరుతో బైరెడ్డి రాజశేఖరరెడ్డి పెద్దగా కార్యక్రమాలు చేసిందీ లేదని అంటారు.. అడపదడపా ప్రెస్ మీట్లు పెట్టడం మినహాయించి.
ఆ తర్వాత బైరెడ్డి రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ లోకి అక్కడి నుంచి స్వల్పకాలంలోనే మళ్లీ బీజేపీలోకి వెళ్లారు. అయితే నిలకడలేనితనం వల్ల ఏ పార్టీలోనూ ఇమడలేకపోయారు. బైరెడ్డి కుమార్తె శబరి ప్రస్తుతం బీజేపీలో యువమోర్చాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమె చురుకుగా ఉంటున్నారు.
2014లో బైరెడ్డి శబరి పాణ్యం నుంచి రాయలసీమ పరిరక్షణ సమితి గుర్తుపై పోటీ చేసి ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఆమెకు కేవలం 5 వేలకు పైగా ఓట్లు మాత్రమే వచ్చాయి.
ఈ నేపథ్యంలో తన కుమార్తె భవిష్యత్తుపై పెద్ద ఆశలు పెట్టుకున్న బైరెడ్డి రాజశేఖరరెడ్డి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీలోకి రావాలని భావిస్తున్నట్టు సమాచారం. టీడీపీలో చేరి తన కుమార్తెకు పాణ్యం అసెంబ్లీ లేదా నంద్యాల ఎంపీగా అవకాశం ఇప్పించుకోవాలనేది బైరెడ్డి వ్యూహమని చెబుతున్నారు.
మరోవైపు వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించి అధికారంలోకి రావాలని టీడీపీ అధినేత కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ బలంగా ఉన్న రాయలసీమలో కీలక నేతలపై చంద్రబాబు దృష్టి సారించారని అంటున్నారు. ఈ క్రమంలో బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఆయనకు ఒక మంచి ఆప్షన్ గా కనిపిస్తున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో బైరెడ్డి తన కుమార్తెతో సహా టీడీపీలో చేరడం ఖాయమంటున్నారు.
ఇప్పటికే తన అనుచరులతో సమావేశాలు నిర్వహించిన రాజశేఖరరెడ్డి తాను టీడీపీలో చేరుతున్నానని చెప్పినట్టు తెలుస్తోంది. నంద్యాల నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నట్టు చెప్పినట్టు సమాచారం.