వలసలకు చెక్.. ఎన్నికల వేళ కెనడా సర్కారు కీలక నిర్ణయం

తమ ప్రభుత్వం ఎదుర్కొంటున్న అంతర్గత సమస్యలు.. ప్రభుత్వంపై ఉన్న అసంత్రప్తిని తగ్గించేందుకు ట్రూడో సర్కారు చేస్తున్న పనులు అన్ని ఇన్ని కావు.

Update: 2024-10-24 04:54 GMT

తమ ప్రభుత్వం ఎదుర్కొంటున్న అంతర్గత సమస్యలు.. ప్రభుత్వంపై ఉన్న అసంత్రప్తిని తగ్గించేందుకు ట్రూడో సర్కారు చేస్తున్న పనులు అన్ని ఇన్ని కావు. అన్నింటికి మించి వలసదారులకు చెక్ పెట్టే విషయంలో తమ ప్రభుత్వం సీరియస్ గా ఉందన్న భావన కలిగించేందుకుపడుతున్న అవస్థలు అన్ని ఇన్ని కావు. అదే సమయంలో.. ప్రభుత్వం మీద సానుకూలత పెంచేందుకు వీలున్న ఏ అంశాన్ని వదిలిపెట్టటం లేదు. తాజాగా అలాంటి నిర్ణయాన్నే ట్రూడో ప్రభుత్వం వెల్లడించింది.

తమ దేశంలోకి అనుమతించే వలసదారుల సంఖ్యను భారీగా తగ్గించేందుకు రెఢీ అయిన ప్రభుత్వం.. ఆ దిశగా కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా ప్రకటించినట్లుగా అక్కడి మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి. 2024లో 4,85,000 మందిని శాశ్వత నివాసితులుగా కెనడా గుర్తించింది. 2025లో ఈ సంఖ్య 3,80,000లకు పరిమితం చేయనున్నట్లుగా పేర్కొన్నారు. 2027 నాటికి 3,65,000 మందికే ప్రవేశం కల్పించాలని ఆలోచన చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.

ఇదంతా కూడా వచ్చే ఏడాది జరిగే ఎన్నికలే కారణంగా చెబుతున్నారు. ఇప్పటికి వెలువడిన సర్వే అంచనాలన్నీ కూడా ట్రూడో ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతున్నపరిస్థితి. వలసల కారణంగా నిరుద్యోగం పెరిగిపోతుండటం.. దేశీయంగా ఇళ్ల కొరత విపరీతంగా ఉంది. దీంతో ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించే ఏ అంశాన్ని విడిచిపెట్టటం లేదు. వలసలపై దేశ ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని తగ్గించేందుకు వీలుగా దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు.

ఇందులో భాగంగా విదేశీ విద్యార్థులకు స్టడీ పర్మిట్లు.. వర్కు పర్మిట్ల మీద కూడా పెద్ద ఎత్తున ఆంక్షలు తీసుకురానున్నట్లుగా ప్రకటనలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వలసదారుల సంఖ్యను తగ్గించేందుకు నిర్ణయాన్ని ప్రకటిస్తూ ట్రూడో సర్కారు నిర్ణయం తీసుకుంది. మొత్తంగా కెనడా పౌరుల మనసుల్ని దోచుకోవటం కోసం ఏదైనా సరే.. ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవటానికి అక్కడి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పాలి. దీనికి కెనడియన్లు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.

Tags:    

Similar News