కెనడా ఎయిర్ పోర్టులో ఘరానా దోపిడీ.. భారత్ లో ఈడీ వేట

2023 ఏప్రిల్‌.. కెనడాలోని టొరంటో విమానాశ్రయం.. స్విట్జర్లాండ్‌ నుంచి ఓ కార్గో విమానం దిగింది. అందులో ఓ కంటైనర్‌.. దాంట్లో 400 కేజీల 6,600 బంగారు కడ్డీలు..

Update: 2025-02-21 17:30 GMT

2023 ఏప్రిల్‌.. కెనడాలోని టొరంటో విమానాశ్రయం.. స్విట్జర్లాండ్‌ నుంచి ఓ కార్గో విమానం దిగింది. అందులో ఓ కంటైనర్‌.. దాంట్లో 400 కేజీల 6,600 బంగారు కడ్డీలు.. ఇప్పడు బంగారం ధర మండిపోతోంది కాబట్టి అప్పటి ధరలోనే చూసినా.. కంటైనర్ లోని కడ్డీల విలువ 20 మిలియన్‌ కెనడియన్‌ డాలర్లు. బంగారంతో పాటు టొరంటో బ్యాంక్‌ లో భద్రపర్చేందుకు 2.5 మిలియన్‌ కెనడియన్‌ డాలర్ల నగదును కూడా తీసుకొచ్చారు.

గోదాం చేరింది.. కథ మారింది

విమానం నుంచి కంటైనర్ ను దింపి విమానాశ్రయంలోనే ఉన్న గోదాంకు చేర్చారు. అయితే, తర్వాతి రోజు పోలీసులు వెళ్లి చూడగా.. కంటైనర్‌ లోని బంగారం, నగదు గాయబ్. దీంతో గగ్గోలు రేగింది. కెనడా చరిత్రలోనే ఇదే అతిపెద్ద దోపిడీ కావడంతో పెను సంచలనం. తర్వాత పోలీసుల దర్యాప్తులో నకిలీ పత్రాలతో వేర్‌ హౌస్‌ సిబ్బందే మాయం చేసినట్లు గుర్తించారు.

మనోళ్ల చుట్టూ ఉచ్చు..

కంటైనర్ దోపిడీ కేసులో భారత్‌ కు చెందిన సిమ్రన్‌ ప్రీత్ పనేసర్‌ ను నిందితుడిగా చేర్చారు. ఇప్పుడు పంజాబ్‌ లోని మొహాలీలో ఉన్న అతడి ఇంట్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనిఖీలకు దిగింది. సిమ్రన్ ప్రీత్ ను ప్రశ్నించనుంది. కాగా, ఎక్కడో కెనడాలో చోరీ జరిగితే మొహాలీలోని సిమ్రన్ ప్రీత్ కు ఏం సంబంధం అంటారా?

32 ఏళ్ల సిమ్రన్‌ప్రీత్‌ కంటైనర్ దోపిడీ సమయంలో ఎయిర్‌ కెనడా సంస్థలో మేనేజర్‌. అందుకే అతడిపై ఆరోపణలు వచ్చాయి. కేసు కూడా నమోదైంది. అరెస్టు వారెంట్‌ జారీ అయింది. అనంతరం భారత్ కు వచ్చి చండీగఢ్‌ లో ఉంటున్నాడు. ఇక ఇదే వ్యవహారంలో ఈడీ అధికారులు సిమ్రన్‌ ప్రీత్‌ పై మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేశారు.

కంటైనర్ దోపిడీ సమయంలో సిమ్రన్‌ ప్రీత్‌, మరో భారతీయుడు పరంపాల్‌ సిద్దూ కూడా గోదాంలో ఉద్యోగంలో ఉన్నారు. వీరిద్దరితో పాటు 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిరుడు మే నెలలో పరంపాల్‌ ను అరెస్టు చేశారు. సిమ్రన్‌ ప్రీత్‌ పరారీలో ఉన్నాడు.

కొసమెరుపు: భారీగా బంగారం, నగదు చోరీకి గురైనా.. రెండేళ్లు అవుతున్నా పోలీసులు ఇంకా గుర్తించలేదు. కొంత మొత్తం నగదు దొరకబట్టగలిగారు అంతే..

Tags:    

Similar News