మోహన్ బాబుపై బీ.ఎన్.ఎస్. సెక్షన్ 118 కింద కేసు నమోదు!

దీంతో... మోహన్ బాబుపై కేసు నమోదైంది. మీడియా ప్రతినిధులపై దాడి నేపథ్యంలో పహాడీ షరీఫ్ పోలీసులు బీ.ఎన్.ఎస్. 118 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.

Update: 2024-12-11 03:48 GMT

మోహన్ బాబు కుటుంబ వివాదం విషయం మంగళవారం రాత్రికి మరింత హాట్ టాపిక్ గా మారింది. జల్ పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఓ పక్క మనోజ్ బౌన్సర్లు, మరోపక్క విష్ణు బౌన్సర్లు.. మధ్యలో ఆవేశంతో ఊగిపోయిన మోహన్ బాబు.. వీరందరి మధ్యా నలిగిపోయిన మీడియా ప్రతినిధులు అనే స్థాయిలో పరిస్థితి మారిపోయింది!

ఆ సమయంలో ఆగ్రహంతో ఊగిపోయిన మోహన్ బాబు.. మీడియా ప్రతినిధుల చేతుల్లోని మైకులు బలవంతంగా లాక్కుని, వాటిని నేలకేసి కొట్టారని అంటున్నారు. దీంతో... మీడియా జర్నలిస్టులపై మోహన్ బాబు దాడిని తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. మరోపక్క తాజాగా కేసు నమోదైంది.

అవును... మోహన్ బాబు కుటుంబంలోని వివాదం అత్యంత చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో తమకు ప్రాణహాని ఉందంటూ అటు మోహన్ బాబు, ఇటు మనోజ్ లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సమయంలో అసలు అక్కడ ఏమి జరుగుతుందని కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేశారు!

దీంతో... మోహన్ బాబుపై కేసు నమోదైంది. మీడియా ప్రతినిధులపై దాడి నేపథ్యంలో పహాడీ షరీఫ్ పోలీసులు బీ.ఎన్.ఎస్. 118 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మరోపక్క దాడిని నిరసిస్తూ మంగళవారం రాత్రి మీడియా ప్రతినిధులు ధర్నాకు దిగారు. మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

ఇదే సమయంలో... మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు, మంచు మనోజ్ లకు రాచకొండ సీపీ సుధీర్ బాబు నోటీసులు జారీ చేశారు. వీరు ముగ్గురుని బుధవారం ఉదయం 10:30 గంటలకు సీపీ కార్యాలయంలో హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మీడియా దాడి నేపథ్యంలోనే ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News