మాజీ సీఎం య‌డియూర‌ప్ప‌పై పోక్సో కేసు.. దేశంలోనే సంచ‌ల‌నం

క‌ర్ణాట‌క మాజీ ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు య‌డియూర‌ప్ప‌పై పోక్సో కేసు న‌మోదైంది.

Update: 2024-03-15 11:30 GMT

క‌ర్ణాట‌క మాజీ ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు య‌డియూర‌ప్ప‌పై పోక్సో కేసు న‌మోదైంది. ఇదేమీ ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు. కీల‌క‌మైన పార్ల‌మెంటు ఎన్నిక‌ల వేళ‌.. లింగాయ‌త్ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడిపై ఏకంగా పోక్సో పెట్ట‌డం.. ఆరోప‌ణ‌లు రాగానే ఆయ‌న‌పై కేసు న‌మోదు చేయాల‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోవ‌డం సంచ‌ల‌నంగానే మారింది. లింగాయ‌త్‌లు ఆగ్ర‌హిస్తార‌నే జంకు కూడా లేకుండా కాంగ్రెస్ తీసుకున్న నిర్ణ‌యం ఎన్నిక‌ల్లో ఎలాంటి ఫ‌లితం ఇస్తుందో చూడాలి.

ఏం జ‌రిగింది?

మాజీ సీఎంగా ఉన్న య‌డియూర‌ప్ప నివాసానికి స్థానికంగా ఉంటున్న ఓ మ‌హిళ తన 17 ఏళ్ల కుమార్తెను వెంట‌బెట్టుకుని వెళ్లారు. గ‌త ఫిబ్ర‌వ‌రి 2న త‌మ కుటుంబంపై కొంద‌రు అన్యాయంగా చీటింగ్ కేసు పెట్టా ర‌ని.. న్యాయ స‌హాయం అందించాల‌ని ఈ మ‌హిళ వేడుకునేందుకు య‌డ్డీని క‌లిశారు. అయితే.. ఈ స‌మ‌యంలో య‌డియూర‌ప్ప‌.. ఆ మ‌హిళ కుమార్తె 17 ఏళ్ల యువ‌తిపై లైంగికంగా దాడి చేశార‌నేది మ‌హిళ చెబుతున్న వాద‌న‌. దీనిని యువతి కూడా పేర్కొంది.

వెంట‌నే స్థానిక కాంగ్రెస్ నేత‌ల‌ను క‌లిసి.. త‌మ ఆవేద‌న‌ను వెల్ల‌డించ‌డంతో వారి సూచ‌న‌ల మేర‌కు.. య‌డియూర‌ప్ప వ్య‌వ‌హారాన్ని పోలీసుల‌కు వివ‌రించారు. దీనిపై అనేక త‌ర్జ‌న భ‌ర్జ‌న‌ల అనంత‌రం.. ప్ర‌భుత్వం నుంచివ‌చ్చిన సూచ‌న‌ల మేర‌కు, వెంట‌నే య‌డియూర‌ప్ప‌పై పోలీసులు పోక్సో(మ‌హిళ‌లు, యువ‌తుల‌పై లైంగిక నేరాల క‌ట్ట‌డికి ఉద్దేశించిన క‌ఠిన‌మైన చ‌ట్టం) కేసు న‌మోదుచేశారు. దేశంలో ఇలా.. ఒక మాజీ ముఖ్య‌మంత్రిపై పోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు కావ‌డం ఇదే తొలిసారి. దీంతో ఈ విష‌యం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది.

బీజేపీ రియాక్ష‌న్ ఇదే!

ఇలా మాజీ సీఎం య‌డ్డీపై కాంగ్రెస్ ప్ర‌భుత్వం కేసు పెట్ట‌డాన్ని బీజేపీ నేత‌లు తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. ఇది రాజ‌కీయంగా ఆయ‌న‌ను అణ‌గ‌దొక్కేందుకు వేసిన ఎత్తుగ‌డ‌గా పేర్కొన్నారు. అంతేకాదు.. ఆయ‌న వ‌య‌సు ఇప్పుడు 80 ఏళ్ల‌ని.. ఈ వ‌య‌సులో లైంగిక నేరాలు ఎలా చేస్తార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఎన్నికల వేళ ఆయ‌న‌ను ప్ర‌చారం నుంచి క‌ట్ట‌డి చేసేందుకే ఇలా చేస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు.

Tags:    

Similar News