దువ్వాడ కుటుంబంపై కేసులే కేసులు

అనంత‌రం.. అదే రోజు అర్థ‌రాత్రి భార్య వాణి, పిల్ల‌లు త‌న ఇంటికి రావ‌డంతో కోపోద్రిక్తుడైన దువ్వాడ వారిపై దాడికి య‌త్నించారు.

Update: 2024-08-10 21:30 GMT

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస‌రావు కుటుంబ క‌థా చిత్రం గ‌త రెండు మూడు రోజులుగా తార‌స్థాయిలో వార్త‌ల్లోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఆయన వేరే మ‌హిళ‌తో స‌హ‌జీవ‌నం చేస్తూ.. త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆయ‌న భార్య, జడ్పీటీసీ దువ్వాడ వాణి, ఇద్ద‌రు కుమార్తెలు ఆరోపించిన విష‌యం తెలిసిందే. ఇక‌, శుక్ర‌వారం ఉద‌యం నుంచి చోటు చేసుకున్న హైడ్రామాలో స‌హ‌జీవ‌నం ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న దివ్వెల మాధురి మీడియా ముందుకు వ‌చ్చి వివ‌ర‌ణ ఇచ్చారు. అనంత‌రం.. అదే రోజు అర్థ‌రాత్రి భార్య వాణి, పిల్ల‌లు త‌న ఇంటికి రావ‌డంతో కోపోద్రిక్తుడైన దువ్వాడ వారిపై దాడికి య‌త్నించారు.

ఈ క్ర‌మంలో పోలీసులు రంగంలోకి దిగి ఇరు ప‌క్షాల‌ను అడ్డుకున్నారు. అయితే.. అటు దువ్వాడ శ్రీనివాస్‌పై ఆయ‌న భార్య‌, పిల్ల‌లు ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు కేసులు పెట్టారు. అదేస‌మ‌యంలో త‌న భార్యా పిల్ల‌ల‌పై దువ్వాడ ఫిర్యాదు చేయ‌డంతో వారిపైనా పోలీసులు కేసులు న‌మోదు చేశారు. మొత్తంగా దువ్వాడ కుటుంబంపై 9 కేసులు పెట్టారు. దీనిలో శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఎక్కువ కేసులు భార్యా, పిల్ల‌ల‌పైనే పెట్టిన‌ట్టు తెలిసింది. అదేస‌మ‌యంలో స‌హ‌జీవ‌నం చేస్తున్న మ‌హిళ మాధురి ఇచ్చిన ఫిర్యాదుతో వాణిపై కూడా పోలీసులు మ‌రో కేసు పెట్టిన‌ట్టు తెలిపారు.

ర‌గ‌డ వెనుక రాజ‌కీయం?

దువ్వాడ కుటుంబంలో వెలుగు చూసిన కుటుంబ వివాదం వెనుక ఆస్థుల వ్య‌వ‌హారం లేద‌ని ముందుగానే తెలిసింది. అయితే.. అసలు ఎందుకీ వివాదం అనే విష‌యంపై చ‌ర్చ సాగుతోంది. ప్ర‌ధానంగా రాజ‌కీయ కోణం ఉంద‌ని అంటున్నారు. వైసీపీలో దువ్వా డ అంటే గిట్ట‌ని నాయ‌కులు వాణిని ప్రోత్స‌హిస్తున్నార‌ని.. ఆయ‌న ఎమ్మెల్సీ స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేయించాల‌నే వ్యూహంతోనే ఇలా చేస్తున్నార‌న్న‌ది ఒక టాక్‌. అయితే.. మ‌రో వాదన కూడా వినిపిస్తోంది. త‌న‌ను , త‌న పిల్ల‌ల‌ను అన్యాయానికి గురి చేసిన భ‌ర్త‌ను వ‌దిలి పెట్ట‌కూడ‌ద‌న్న క‌సితోనే వాణి రోడ్డుకెక్కార‌న్న మ‌రో చ‌ర్చ కూడా న‌డుస్తోంది.

అయితే.. ఇంత జ‌రిగినా.. పార్టీ ప‌రంగా చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ జ‌గ‌న్ కానీ, ఇత‌ర నేత‌లు కానీ స్పందించ‌డం లేదు. పార్టీ ప‌రంగా దువ్వాడ‌ను పిలిచి మాట్లాడ‌డ‌మో పార్టీప‌రంగా ఆయ‌న‌పై స‌స్పెన్ష‌న్ వేటు వేయ‌డ‌మో చేయాల్సి ఉన్నా.. జ‌గ‌న్ అస‌లు త‌న‌కు ఏమీ తెలియ‌న‌ట్టుగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అనుకూల మీడియాలో మాత్రం దువ్వాడ వ్య‌వ‌హారాన్ని వేరే కోణంలో చూపించ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News