శ్రీవారి ల‌డ్డూ: 'సిట్' ప‌ర్య‌వేక్ష‌ణాధికారి గురించి తెలుసా?

సెప్టెంబ‌రు 18వ తేదీ నుంచి ఈ నెల 3వ తేదీ వ‌రకు ఈ వివాదం కొన‌సాగుతూనే ఉంది.

Update: 2024-10-06 13:32 GMT

ప‌విత్ర తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో వినియోగించే నెయ్యి క‌ల్తీ జ‌రిగింద‌న్న ఆరోప‌ణ‌లు రాజ‌కీ యంగా దుమారం రేపిన విష‌యం తెలిసిందే. సెప్టెంబ‌రు 18వ తేదీ నుంచి ఈ నెల 3వ తేదీ వ‌రకు ఈ వివాదం కొన‌సాగుతూనే ఉంది. వైసీపీ హ‌యాంలో ఇచ్చిన కాంట్రాక్టులు, నెయ్యిని చ‌వ‌కగా కొనుగోలు చేయ‌డం.. నాణ్య‌త త‌గ్గింద‌ని భ‌క్తుల నుంచి విమ‌ర్శ‌లు వ‌చ్చినా ప‌ట్టించుకోక‌పోవ‌డం వంటివి టీడీపీ పెద్ద ఎత్తున వెలుగులోకి తీసుకువ‌చ్చింది.

ఈ ప‌రిణామాల క్ర‌మం.. నేరుగా సుప్రీంకోర్టును చేరింది. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన సుప్రీంకోర్టు డివిజ‌న్ బెంచ్‌.. ఈ వ్య‌వ‌హారంపై నిగ్గు తేల్చేందుకు ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని(సిట్‌) ఏర్పాటు చేసింది. దీనిలో సీబీఐ నుంచి ఇద్ద‌రు, ఏపీ పోలీసు శాఖ నుంచి ఇద్ద‌రు, భార‌త‌ ఆహార నాణ్యత‌ విభాగం(ఎఫ్ ఎస్ ఎస్ ఏఐ) నుంచి ఒక‌రు చొప్పున నియ‌మించింది. అయితే.. ఈ ద‌ర్యాప్తును ప‌ర్య‌వేక్షించే అధికారం పూర్తిగా సీబీఐ డైరెక్ట‌ర్‌కు అప్ప‌గించింది. అంటే.. సిట్ ఏం చేసినా.. ఎలా ద‌ర్యాప్తు చేసినా.. దీనికి పూర్తి బాధ్య‌త సీబీఐ డైరెక్ట‌ర్‌దే అవుతుంది.

దీంతో సీబీఐ డైరెక్ట‌ర్ ఎవ‌రు? ఆయ‌న ఎక్క‌డివారు? ఎలాంటి వారు? అనే ప్ర‌శ్న‌లు ప్ర‌స్తుతం తెర‌మీదికి వ‌చ్చాయి. ప్ర‌స్తుతం సీబీఐ డైరెక్ట‌ర్‌గా ప్ర‌వీణ్ సూద్ ఉన్నారు. ఈయ‌న సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి. 2023, మేలో ఈయ‌న‌ను ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోడీ నేరుగా సీబీఐ డైరెక్ట‌ర్‌గా నియ‌మించారు. అప్ప‌టి వ‌రకు క‌ర్ణాట‌క డీజీపీగా వ్య‌వ‌హ‌రించారు సూద్‌. అయితే.. ఆయ‌న ప‌నితీరు.. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న విధానం వంటివి ప‌రిశీలించిన ప్ర‌ధాని ఏరికోరి ఆయ‌న‌ను ఎంపిక చేశారు.

సూద్ డైరెక్ట‌ర్ ప‌ద‌విని చేప‌ట్టే స‌మ‌యానికి సీబీఐ అత్యంత క్లిష్ట‌మైన‌, సునిశిత‌మైన కేసుల‌ను ద‌ర్యాప్తు చేస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న‌ను నియ‌మించడం ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఇప్పుడు కీల‌క‌మైన తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంపై విచార‌ణ చేసే ద‌ర్యాప్తు బృందానికి ఆయ‌న నేతృత్వం వ‌హించ‌నున్నారు. ఆయ‌న‌పై ఉన్న విశ్వాసం.. విశ్వ‌స‌నీయ‌త , గ‌త రికార్డుల‌ను ప‌రిశీలిస్తే.. ల‌డ్డూక‌ల్తీపై నిజానిజాలు వెలుగు చూస్తాయ‌న‌డంలో సందేహం లేదు.

Tags:    

Similar News