రొటీన్ కి భిన్నంగా... సీబీఐ దర్యాప్తుపై సీబీఐ విచారణ!

వివరాళ్లోకి వెళ్తే... రాష్ట్రంలోని నర్సింగ్ కాలేజీల్లో అవకతవకలు జరిగాయని, మౌలిక వసతులు లేవనే ఆరోపణలపై మధ్యప్రదేశ్ హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది.

Update: 2024-05-22 04:41 GMT

సాధారణంగా దేశంలో ఎక్కడైనా అక్రమాలు జరిగితే.. సంబంధిత కేసును సీబీఐ విచారణకు ఇవ్వడం తెలిసిందే. ఈ విషయంలో కొన్ని సార్లు విపక్షాలు డిమాండ్ చేస్తే.. ఇంకొన్ని సార్లు అధికార పక్షాలే డిమాండ్ చేస్తుంటాయి. ఫలితంగా... ఆయా రాష్ట్రాల్లో పలు సీబీఐ ఎంక్వైరీలు నడుస్తుంటాయి! అయితే ఇప్పటికే సీబీఐ ఎంక్వైరీ నడుస్తున్న ఒక కేసుపై సీబీఐ ఎంక్వైరీ వేయాల్సిన పరిస్థితి రావడం ఇప్పుడు ఆసక్తిగా మారింది.

అవును... ఇప్పటికే ఒక కేసుపై సీబీఐ విచారణకు ఆదేశించింది హైకోర్టు. దీంతో గతకొన్ని రోజులుగా సదరు వ్యవహారంపై సీబీఐ విచారణ జరుగుతుంది. ఈ సమయంలో అనూహ్యంగా ఆ సీబీఐ ఎంక్వైరీలోని పలువురు అధికారులు సైతం అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు రావడంతో... ఈ సీబీఐ ఎంక్వైరీ నడుస్తున్న కేసుపై సీబీఐ ఎంక్వైరీ వేయాల్సి వచ్చింది. అది ఎక్కడ, ఎందుకు మొదలైన విషయాలు ఇప్పుడు చూద్దాం...!

వివరాళ్లోకి వెళ్తే... రాష్ట్రంలోని నర్సింగ్ కాలేజీల్లో అవకతవకలు జరిగాయని, మౌలిక వసతులు లేవనే ఆరోపణలపై మధ్యప్రదేశ్ హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. అయితే విచారణకు వెళ్లిన సీబీఐ అధికారుల్లో కొందరు... రాష్ట్రంలోని నర్సింగ్ కాలేజీలతో కుమ్మక్కై లంచాలకు ఫిట్‌ మెంట్ సర్టిఫికెట్లు ఇవ్వడం ప్రారంభించడంతో పనులు తారుమారయ్యాయని తెలుస్తుంది!

ఇందులో భాగంగా... ఈ కాలేజీల నుంచి ఒక్కో సర్టిఫికేషన్‌ కు సీబీఐ అధికారులు రూ.2-10 లక్షలు వసూలు చేస్తున్నారని.. వీరిలో స్థానిక అధికారులతో పాటు ఇద్దరు సీబీఐ ఇన్‌స్పెక్టర్లు నేరుగా పాల్గొన్నారనే చర్చ తెరపైకి వచ్చింది! ఈ నేపథ్యంలో... నర్సింగ్ కాలేజీ కుంభకోణానికి సంబంధించి లంచం కేసులో ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు!

మధ్యప్రదేశ్‌ లోని భోపాల్, ఇండోర్, రత్లాం సహా మూడు చోట్ల సీబీఐ అధికారుల బృందం దాడులు నిర్వహించి నర్సింగ్ కాలేజీ కుంభకోణానికి సంబంధించి లంచం కేసులో ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసినట్లు అధికారులు ఆదివారం ఇక్కడ తెలిపారు. ఈ కేసులో ఇద్దరు మహిళలు, ఆరుగురు పురుషులతో సహా ఎనిమిది మందిని సీబీఐ, స్థానిక పోలీసులు అరెస్టు చేశారు!

ఇందులో భాగంగా... కాలేజీల "ఓకే రిపోర్టు" ఇచ్చేందుకు కొందరు సీబీఐ అధికారులు లంచాలు తీసుకుంటున్నట్లు విచారణలో పాల్గొన్న సీబీఐ అధికారులకు తెలిసిందని తెలుస్తుంది. కాలేజీ డైరెక్టర్‌, ప్రిన్సిపాల్‌ నుంచి సీబీఐ అధికారి ఒకరు రూ.10 లక్షలు లంచం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ కేసులో ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ బృందం.. సీబీఐ అధికారితో పాటు మరికొందరిని అరెస్టు చేసిందని అంటున్నారు.

Tags:    

Similar News