జగన్ కు ఇంకా తత్వం బోధపడినట్లు లేదు... పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో ఈ రోజు ఎన్డీయే శాసనసభా పక్ష సమావేశం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో ఈ రోజు ఎన్డీయే శాసనసభా పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు పలువురు మంత్రులు, కీలక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ పై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అవును... ఏపీలో నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ఈ మేరకు తొలిరోజు గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం సభను వాయిదా వేశారు. అనంతరం చంద్రబాబు అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో ఎన్డీయే శాసన సభాపక్ష సమావేశం జరిగింది. అసెంబ్లీ అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రస్థావించాల్సిన అంశాలపై ఈ భేటీలో చర్చించారు.
ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ పై పవన్ కల్యాణ్, చంద్రబాబులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో... ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా జగన్ కు ఇంకా తత్వం బోధపడినట్లు లేదని.. నెలరోజుల్లోనే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆక్షేపించారు పవన్. ఈ సందర్భంగా గ్రూపు తగాదాకు రాజకీయ రంగు పులిమి అవాస్తవాలు చెబుతూ కుట్రలకు తెరలేపుతున్నారని విమర్శించారు.
అదేవిధంగా... సభలోకి వచ్చే ముందు పోలీసులతో గొడవ, గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగలమని ఎమ్మెల్యేలను రెచ్చగొట్టడం అతని అహంకార ధోరణికి నిదర్శనమని తెలిపారు. ఈ నేపథ్యంలోనే.. ఎల్లకాలం అధికారంలో కొనసాగుతామనే భ్రమ నుంచి ప్రజలు బయట పడేసినా ఇంకా తనే సీఎం అని అనుకుంటున్నారేమోనని పవన్ ఎద్దేవా చేశారు.
ఇదే క్రమంలో... రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. తాను, జనసేన పార్టీ నూటి నూరు శాతం సహకరిస్తామని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో జగన్ ఈ రోజు వ్యవహరించిన విషయంపై చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ఇందులో భాగంగా.. శాంతిభద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా ఉపేక్షించేది లేదని.. తప్పు చేసిన వారిని చట్టప్రకారమే కఠినంగా శిక్షిద్దామని అన్నారు. ఇదే సమయంలో... వివేకా హత్యకేసులో నడిపిన నాటకాన్నే జగన్ మళ్లీ మొదలుపెట్టారని, వినుకొండ వ్యవహారంలో ఇదే కుట్ర చేస్తున్నారని బాబు ఫైర్ అయ్యారు.
ప్రభుత్వం వచ్చి నెల రోజులు కూడా కాలేదు అప్పుడే విమర్శలా అని ప్రశ్నించిన చంద్రబాబు... తప్పులు చేయడం, వాటిని పక్కవారిపైకి నెట్టేయడం జగన్ కు అలవాటేనని.. వివేకా హత్య వ్యవహారంలో ఇలానే ప్రయత్నించారని అన్నారు. ఈ సందర్భంగా అక్రమ కేసులో 53 రోజులు జైల్లో ఉన్నట్లు గుర్తుచేసుకున్న చంద్రబాబు... కక్షసాధింపు చర్యలకు దిగాలంటే ముందుండాల్సింది తానే అని అన్నారు.
అయితే... ప్రజలు మనల్ని అందుకు గెలిపించలేదనే విషయం గుర్తుపెట్టుకోవాలని సూచించారు. అసెంబ్లీ కమిటీ హాలులో నిర్వహించిన శాసనసభా పక్ష సమావేశంలో మాట్లాడిన బాబు ఈ వ్యాఖ్యలు చేశారు. సుమారు గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా శాంతిభద్రతలపై చర్చించారు.