తమ్ముడు-తమ్ముడే, చంద్రబాబు-చంద్రబాబే.. లంచమా మజాకా!
సీఎం చంద్రబాబు.,. తన సొంత నియోజకవర్గంలో కుప్పంలో ఇల్లు కట్టుకుంటున్న విషయం తెలిసిందే కదా.
లంచం.. దీనిని చాలా మంది అధికారులు హక్కుగా భావిస్తారు. లంచం తీసుకోకుండా పనిచేయడం అంటే.. తలకొట్టేసినట్టుగా లెక్కగడతారు. ఇలాంటి ప్రబుద్ధుడైన ఓ అధికారి ఏకంగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు స్థలానికి సంబంధించి కూడా లంచం మేసేశారు. తమ్ముడు-తమ్ముడే.. చంద్రబాబు-చంద్రబాబే.. ఎవరైనా లంచానికి అతీతులుకారు! అన్నట్టుగా వ్యవహరించారు. మరి ఆ అధికారి ఎవరు? ఆయన రుబాబు ఏ రేంజ్‌లో ఉందో మనమూ తెలుసుకుందాం..
సీఎం చంద్రబాబు.,. తన సొంత నియోజకవర్గంలో కుప్పంలో ఇల్లు కట్టుకుంటున్న విషయం తెలిసిందే కదా. అయితే.. ఈ స్థలాన్ని సబ్ డివిజన్(ఉప విభజన) చేయాల్సి ఉంది. దీనిని సాధారణంగా సర్వేయర్లు చేస్తుంటారు. ఇక్కడ కూడా ఓ సర్వేయర్ రంగంలోకి దిగారు. అయితే. ఈయనకు లంచం లేందే సంతకం చేసే అలవాటు.. సర్వే చేసే అలవాటు కూడా లేదు. దీంతో ఆయన తన కింద పనిచేసే డిప్యూటీ సర్వేయర్‌ను పంపించారు. పెద్దసారు ఆదేశంతో రంగంలోకి దిగిన చిన్నసారు.. లంచం ఇస్తేనే సర్వే అన్నట్టు వ్యవహరించారు. తీసుకున్నారు కూడా!
కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలోని కడపల్లి పంచాయతీ శివపురం వద్ద తన సొంత ఇంటి నిర్మాణం కోసం చంద్రబాబు ఏడాది కిందటస్థలం కొన్నారు. నేషనల్ హైవే పక్కనే ఉన్న వ్యవసాయ భూముల్లో స్థలం కావడంతో దీనిని ఉప విభాగాలుగా విభజించి.. ఇంటి కోసం కేటాయించాలి. ఇది రెవెన్యూ అధికారుల బాధ్యత. దీని కోసమే చంద్రబాబు కూడా దరఖాస్తు చేశారు. స్థలాన్ని సబ్ డివిజన్ చేయాలని కోరారు. అయితే.. దీనిని చేయాల్సిన సర్వేర్.. డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుస్సేన్ ను పంపించారు.
యథాలాపంగా.. సర్వేయర్ స్థానంలో ఉన్న హుస్సేన్.. రూ.2 లక్షల లంచాన్ని డిమాండ్ చేశారు. ఆ మొత్తం ఇస్తేనే గాని ప్రక్రియ చేపట్టనని తేల్చి చెప్పడంతో.. స్థానిక నాయకులు ఈ విషయాన్ని చంద్రబాబుకు చెప్పకుండా.. అడిగిన లంచం ముట్టజెప్పారు. అప్పట్లో వైసీపీ సర్కారు ఉందని భయపడ్డారో ఏమో.. తెలియదు.. కానీ, తాజాగా కూటమి సర్కారు వచ్చాక.. స్థానిక నాయకులు ఈ విషయాన్ని చంద్రబాబుకు వివరించారు.
దీంతో ఆగ్రహించిన చంద్రబాబు కలెక్టర్ సుమిత్ కుమార్, డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసులను రంగంలోకి దింపారు. వారు సర్వే శాఖ ఏడి గౌస్ భాషాతో శాఖ పరమైన విచారణ చేయించగా డబ్బులు తీసుకున్న మాట వాస్తవమేనని తేలింది. దీంతో అందరూ అవాక్కవుతున్నారు.