ముహూర్తం బాలేదా.. చంద్రబాబుకు వరుస 'విపత్తులు'..!
అదేం చిత్రమో కానీ.. సీఎంగా నాలుగోసారి ప్రమాణం చేసిన తర్వాత.. చంద్రబాబు వరుస విపత్తులు ఎదుర్కొంటున్నారు.
అదేం చిత్రమో కానీ.. సీఎంగా నాలుగోసారి ప్రమాణం చేసిన తర్వాత.. చంద్రబాబు వరుస విపత్తులు ఎదుర్కొంటున్నారు. నెలకొక రీతిలో పెద్ద ఎత్తున సవాలు ఆయనకు ఎదురు అవుతోంది. వీటిలో ఎక్కువ మందికి గుర్తున్నది విజయవాడలో బుడమేరు వరదలు మాత్రమే. కానీ, దీనితో సమానంగా పలు జిల్లాల్లో చోటు చేసుకున్న ఘటనలు కూడా చంద్రబాబుకు ఆయన ప్రభుత్వానికి ఇబ్బందిగానే మారాయి. విశాఖలోని ఫార్మా కంపెనీలో చోటు చేసుకున్న విషాదంలో ఆరుగురు మృత్యువాత పడ్డారు.
విజయవాడ వరదలు కొన్ని వేల ఇళ్లను ముంచేసింది. ఆ తర్వాత.. అకాల వర్షాలతో కర్నూలు,నెల్లూరు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ఆయా పరిస్థితుల్లో అనేక మంది మృతి చెందారు. ఇక, కాకినాడలో నూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత.. రాజకీయ హత్యలు, దాడులు నిత్యకృత్యంగా మారాయి. అదే సమయంలో మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు కూడా సర్కారును ఇబ్బంది పెడ్డాయి. ఇక, తాజాగా తిరుపతిలో తొక్కిసలాట ఘటన మరింతగా చంద్రబాబుకు ఇబ్బందిగా మారింది. దీంతో సర్కారు నానా తిప్పలు పడే పరిస్థితి వచ్చింది.
అయితే.. ఏ సమస్య వచ్చినా వెంటనే రియాక్ట్ అవుతూ.. దానిపై విపక్షాలు రియాక్ట్ అయ్యే దాకా కూర్చోకుండా.. చంద్రబాబు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించి వాటి నుంచి కొంత రిలీఫ్ పొందారు. అయితే.. తాజాగా తిరుపతి ఘటన మాత్రం జాతీయస్థాయిలో మీడియా దృష్టిని ఆకర్షించడం.. జాతీయ స్థాయిలో ప్రచారం రావడంతో సర్కారుకు ఒకింత ఇబ్బందనే చెప్పాలి. ఆరుగురు మృతి చెందడం, పదుల సంఖ్యలో గాయాలపాలవడం వంటివి చంద్రబాబుకు కూటమి సర్కారుకు ఇబ్బంది కలిగించాయి.
ఈ పరిణామాలను గమనిస్తున్న తమ్ముళ్లు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన ముహూర్తం సరి కాదేమోననే కామెంట్లు చేస్తున్నారు. గత ఏడాది జూన్ 12న చంద్రబాబు ప్రమాణం చేశారు. ఆ తర్వాత.. వరుసగా అనేక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తమ్ముళ్లు ఇలా వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే.. వీటిని చంద్రబాబు లెక్కలోకి తీసుకునే అవకాశం తక్కువ. సెంటిమెంట్ల కంటే కూడా.. ప్రాక్టికల్‌గా ఆలోచించే చంద్రబాబు.. తమ్ముళ్ల వాదనను పెద్దగా పట్టించుకోరనే అంటున్నారు పరిశీలకులు.