మహా నగరాలూ...ఏపీ కష్టాలూ...బాబు కామెంట్స్!

ఏపీ అన్నది మొదటి నుంచి అవస్థ పడుతూనే ఉంది. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఏపీ ఉంది.

Update: 2024-12-15 18:30 GMT

ఏపీ అన్నది మొదటి నుంచి అవస్థ పడుతూనే ఉంది. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఏపీ ఉంది. ఆనాడు పదకొండు జిల్లాలతో ఏపీ ఉంది. అయితే ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఏపీ నేతలను ప్రజలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారు అన్న బాధతో పాటు ఆంధ్రులకు ఒక రాష్ట్రం సొంతంగా ఉండాలన్న భాషాభిమానంతో అమరజీవి పొట్టి శ్రీరాములు ఏకంగా 58 రోజుల పాటు అమ్రణ నిరాహర దీక్షను చేశారు. ఆయన 1052 అక్టోబర్ 19న ఈ దీక్షకు కూర్చున్నారు. చివరికి ఆయన ఆత్మ బలిదానం డిసెంబర్ 15న చేశారు.

ఆయన మరణానంతరం కేంద్రం ఏపీని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించింది. అలా 1953 అక్టోబర్ 1న తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏపీ ఏర్పాటు అయింది. ఇక్కడిదాక కొంత న్యాయం జరిగింది అనుకున్నా మద్రాస్ రాష్ట్రం అభివృద్ధిలో అత్యధిక కష్టం ఆంధ్రులదే ఉంది అని చరిత్ర చెప్పే సత్యం.

చెన్నమనాయుడు అన్న ఆంధ్రుడి పేరే చెన్నపట్నంగా మారింది. ఆ తరువాత మద్రాస్ గా అది పేరు మార్చుకుంది. మళ్లీ చెన్నైగా కూడా మార్చారు. ఇలా చరిత్రలో చూస్తే చెన్నపట్నాన్ని నిర్మించింది ఆంధ్రులే అని చెబుతారు. ఆ తరువాత మద్రాస్ అభివృద్ధిలో ఆంధ్రుల కష్టం ఉంది అని కూడా అంటారు. అలా మద్రాస్ రాజధానిగా ఏపీని ప్రకటించాలని ఆంధ్రులు కోరినా కూడా కేంద్రం వద్ద అప్పటి మద్రాస్ స్టేట్ పాలకుల పలుకుబడి ముందు అది వీగిపోయింది.

దాంతో కర్నూల్ రాజధానిగా కొత్త స్టేట్ ఏర్పాటు అయింది. ఇదిలా ఉంటే 1956 నవంబర్ 1న ఉమ్మడి ఏపీగా నాటి హైదరాబాద్ స్టేట్ తో కలుపుకుని ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించింది. అది 2014 దాకా కొనసాగింది. మళ్లీ విభజన ఏర్పడింది. కష్టాలు స్టార్ట్ అయ్యాయి. ఈ రోజున చూస్తే చెన్నై ఒక పెద్ద మహా నగరం రెండవది హైదరాబాద్ మరో మహా నగరం.

ఆంధ్రులు ఈ రెండింటి అభివృద్ధిలో పాటు పడి ఉత్త చేతులతోనే ఈ రోజు మిగిలారు. 2014 విభజన లో ఏపీకి రాజధాని లేకుండా పోయింది. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భనా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన పోరాట స్పూర్తిని తలచుకున్నారు. ఆయన మహనీయుడు అని కొనియాడారు.

ఆయన వల్లనే ఏపీ కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించింది అన్నారు. చరిత్ర ఒక్కసారి చూస్తే అంధ్రులు విభజనల వల్ల ఎంతో ఇబ్బంది పడ్డారని బాబు కామెంట్స్ చేశారు. పొట్టి శ్రీరాములు స్పూర్తితో ఏపీని అభివృద్ధి చేసుకుందామని కూడా ఆయన చెప్పారు.ఏపీలో పొట్టి శ్రీరాములు పేరుతో ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని అన్నారు.

పవన్ కళ్యాణ్ అయితే పొట్టి శ్రీరాములు ఆంధ్ర జాతికే నాయకుడు అని కొనియాడారు. ఆయనను సదా గుర్తు చేసుకోవాలని అన్నారు. ఆయన ఆంధ్రులకు చిరస్మరణీయుడు అని అన్నారు. ఆయనకు కులం లేదని ఆంధ్రులకే ఆయన నాయకుడు అని అన్నారు.

ఇదిలా ఉంటే పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవాలను కూడా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ఏడాది పాటు అంతా నిర్వహిస్తోంది. మొత్తం మీద చూస్తే అమరజీవి త్యాగాలను గుర్తు పెట్టుకుని ప్రభుత్వం ఈ తరహాలో కార్యక్రమాలు నిర్వహించడం అన్నది గ్రేట్ అనే చెప్పాలి. అమరజీవి ఆంధ్రులకు ఆశాజ్యోతి అన్నదే రేపటి తరం తెలుసుకోవాల్సిన విషయం.

Tags:    

Similar News