లైఫ్ లో ఒక్కసారి కూడా రాజకీయ కక్షకు పాల్పడలేదన్న బాబు

తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ రాజకీయ కక్షలకు పాల్పడలేదన్న ఆయన.. అందుకు తగ్గట్లే బోలెడన్ని సంగతుల్ని చెప్పుకొచ్చారు.

Update: 2024-10-26 08:30 GMT

సుదీర్ఘ రాజకీయ జీవితం.. పాత రాజకీయాలు.. కొత్త రాజకీయాల్ని చూసిన తెలుగు రాజకీయ అధినేతల కోవలోకి వస్తారు ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు. తెలుగు రాజకీయాల్లో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా.. విపక్ష నేతగా వ్యవహరించిన రికార్డు చంద్రబాబుదే. ఆయన రాజకీయ జీవితాన్ని చూస్తే బోలెడన్ని కోణాలు కనిపిస్తాయి. విజనరీగానూ.. వివాదాస్పద అంశాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తారు. ఇలాంటి రెండు యాంగిల్స్ ఉన్న చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఎదురుకాని ఎన్నో ఎదురుదెబ్బల్నే కాదు.. ఎప్పుడూ పొందనంత గ్రాండ్ సక్సెస్.. రెండూ గత రెండేళ్లలో ఆయనకు ఎదురయ్యాయి.

మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. సీరియస్ కం సరదా ఇంటర్వ్యూలు చాలా తక్కువగా ఇచ్చారని చెప్పాలి. అందునా తన బావమరిది కం వియ్యంకుడైన బాలయ్యకు ఇంటర్వ్యూ ఇవ్వటం.. ఈ సందర్భంగా బోలెడన్ని అంశాలు చర్చకు రావటం తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద అన్ స్టాపబుల్ గా విశేష అభిమానాన్ని ఎంచుకున్న సీరిస్ 3లో మొదటి ఇంటర్వ్యూ చంద్రబాబుతో చేశారు బాలయ్య. ఈ సందర్భంగా బోలెడన్ని అంశాలు చర్చకు వచ్చాయి.

ఇందులో రాజకీయ కక్షల మీద చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ రాజకీయ కక్షలకు పాల్పడలేదన్న ఆయన.. అందుకు తగ్గట్లే బోలెడన్ని సంగతుల్ని చెప్పుకొచ్చారు. అదేమిటన్నది చంద్రబాబు మాటల్లోనే చదివితే మరింత ఎఫెక్టివ్ గా ఉంటుంది. ''అరెస్టు చేస్తారనో, ప్రాణం పోతుందనో భయపడితే అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చలేం. నా జీవితంలో ఎప్పుడూ రాజకీయ కక్షలతో ముందుకెళ్లలేదు. ముందు నేను రూలింగ్‌లో ఉన్నాను. రాజశేఖర్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉండేవారు. ఆయన కొన్ని సార్లు రెచ్చిపోయినా సంయమనం పాటించాను. రాజశేఖర్‌రెడ్డి కొన్ని విషయాల్లో దూకుడుగా మాట్లాడారు. ఎదుర్కొని వార్నింగ్‌ ఇచ్చాను. మళ్లీ తగ్గి క్షమాపణలు చెప్పిన సందర్భాలున్నాయి'' అని పేర్కొన్నారు.

మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లో కక్ష పూరిత రాజకీయాలు వచ్చిన పరిస్థితి నెలకొందన్న చంద్రబాబు.. ''ఆ కక్ష రాజకీయాలు వ్యక్తిగత ద్వేషాలయ్యాయి. నేను మాత్రం లక్ష్మణ రేఖ దాటను. తప్పు చేసిన వాడిని వదిలిపెట్టను. తప్పులు చేయకపోతే మాత్రం వారి జోలికి పోను. జైల్లో ఉన్నప్పుడు ఒకటే ఆలోచించాను. బయటకొచ్చి నా కోసం పోరాడిన ప్రజల కోసం శేష జీవితం అంకితం చేయాలని, ముందుకెళ్లాలని ఆత్రపడ్డాను'' అని వ్యాఖ్యానించారు. తన జీవితంలో అనేక సంక్షోభాల్ని చూశానని.. ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకుంటూ సమాజం కోసం పని చేసుకుంటూ వచ్చినట్లుగా చెప్పారు.

బాధ.. ఆవేదన సంఘటనల్ని ఎప్పుడూ మర్చిపోలేనన్నారు. ప్రజాక్షేత్రంలో నంద్యాలలో మీటింగ్ పెట్టి అక్కడ నుంచి నేరుగా బస్సు దగ్గరకు వచ్చి.. రాత్రి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో బయట రాత్రంతా అలజడి క్రియేట్ చేవారు. తర్వాత కిందకు వస్తే ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అరెస్టు అన్నారన్నారు. ఏ అంశంలో అరెస్టు చేస్తున్నారో చెప్పాలని అడిగానని.. చెప్పుకుండా అరెస్టు అంటున్నారని చెబుతూ.. ''వారెంట్ ఇస్తున్నాం. ఆ తర్వాత నోటీసు ఇస్తామని చెప్పారు.

ప్రజాస్వామ్యంలో ఎక్కడా ఇలా జరగలేదు. జరుగుతుందని కూడా ఊహించలేం. ప్రజాస్వామ్యంలో ఏ చిన్నవాడు తప్పు చేసినా.. ఎక్కడ చేవాడో చెప్పి.. అతడి దగ్గర సమాధానం తీసుకొని అందులోని విషయాలు పరిశీలించిన తర్వాత తీవ్రమైన విషయం అనుకుంటే అప్పుడు అరెస్టు చేస్తారు. కానీ.. దీన్ని లెక్క పెట్టకుండా అరెస్టు చేశారు'' అని పేర్కొన్నారు.

తన జీవితంలో ఏ పని చేసినా చట్టధిక్కరణ చేయలేదని.. ఒకటికి నాలుగుసార్లు ఆలోచించి చేశానని చెప్పిన చంద్రబాబు.. ''రాజ్యాంగం ప్రకారం ఏం చేయాలో దానికి కట్టుబడి చేశాను. ఇలాంటివన్నీ చేసిన తర్వాత ఆ రోజు జరిగిన సంఘటనను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నా. అది రాష్ట్రంలో ఉన్న అనాటి పరిస్థితి. ఆ రోజు అక్కడి నుంచి నేరుగా తీసుకెళ్లడం.. తర్వాత పరిణామాలు రాష్ట్ర ప్రజలందరూ చూశారు. నేను ఎప్పుడూ ఒక్కటే ఆలోచిస్తాను. ఎప్పుడూ తప్పు చేయలేదు. నిప్పులాగా బతికాను. ప్రజలు నన్ను సపోర్టు చేస్తారన్న విశ్వాసం ఉంది. అదే నన్ను గెలిపించింది. అదే నిలబెట్టింది'' అంటూ సుదీర్ఘంగా స్పందించారు.

Tags:    

Similar News