అద్గది చంద్రబాబు అంటే.. 10 రోజుల తర్వాత బస్సు నుంచి ఇంటికి

ఈ సినిమా టైటిల్ 35 అయినా..దాని ఉపశీర్షిక మాత్రం ‘చిన్నకథ కాదు’. చిత్తూరు జిల్లాతో పాటు రాయలసీమలో ఎక్కువ మంది వాడే ఊతపదంగా దీన్ని చెప్పాలి.

Update: 2024-09-11 04:53 GMT

ఈ మధ్యన విడుదలైన బడ్జెట్ మూవీ "35" ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావటమే కాదు.. సినిమా చూస్తున్నంత సేపు తెలియని ఆహ్లాదం కమ్మేస్తుంది. సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ సినిమా తాలుకూ గురుతులు వెంటాడుతుంటాయి. ఈ సినిమా టైటిల్ 35 అయినా..దాని ఉపశీర్షిక మాత్రం ‘చిన్నకథ కాదు’. చిత్తూరు జిల్లాతో పాటు రాయలసీమలో ఎక్కువ మంది వాడే ఊతపదంగా దీన్ని చెప్పాలి.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి చెప్పాలంటే.. ఈ ఊత పదం ఇట్టే సూట్ అవుతుంది. ఆయనతో చిన్నకథ కాదన్నట్లుగా ఉంటుంది. ఎందుకంటే.. ఆయన ఎంతటి కమిట్ మెంట్ తో ఉంటారో.. ఏదైనా అనుకుంటే దాన్ని సాధించే వరకు వెనక్కి తగ్గని మొండితనం ఆయన సొంతం. ఈ కారణంతోనే ఇంతటి వయసులోనూ.. అంతటి ఒత్తిడిలోనూ ఎన్నికల్లో కష్టపడి చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్నారు. పాలనాపరంగా బాబు తీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఏదైనా అనూహ్య విపత్తు విరుచుకుపడితే.. ఇంటిని వదిలేసి.. జనంతో మమేకం అయ్యే అలవాటు చంద్రబాబుకు ఉన్నదే. విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వేళలో.. విశాఖను అతలాకుతలం చేసిన హుధూద్ తుపాను విధ్వంసం వేళ.. కలెక్టరేట్ కు బస్సును తెప్పించుకొని అందులోనే కూర్చొని పని చేయటం.. పరిస్థితిని చక్కెబెట్టటం తెలిసిందే.

కట్ చేస్తే.. తాజాగా విజయవాడను ముంచెత్తిన భారీ వర్షం.. ముంపు కారణంగా విజయవాడలోని పలు ప్రాంతాలు జలమయం కావటమే కాదు.. వారానికి పైనే వరద నీరు ఇళ్లల్లో ఉండిపోయిన పరిస్థితి. ముంపు తీవ్రత.. విజయవాడ నష్టపోయిన వైనాన్ని చూసిన తర్వాత ఇంటికి వెళ్లకుండా ఉండిపోయిన చంద్రబాబు.. కలెక్టరేట్ వద్దకు ప్రత్యేక బస్సును తెప్పించుకొని.. అక్కడే ఉండిపోయారు. పరిస్థితి చక్కబడే వరకు తాను ఇంటికి వెళ్లన్న ఆయన.. తాను అన్న మాటకు తగ్గట్లే అలానే ఉండిపోయారు బస్సులో.

రాత్రిళ్లు కొన్ని గంటలు మాత్రమే విశ్రాంతి తీసుకునేవారు. ఇలా ఒకరోజు కాదు రెండు రోజులు కాదు. ఏకంగా పది రోజులు ఉన్న ఆయన.. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్న వేళలో.. ఆయన బస్సును వదిలి ఇంటికి వెళ్లారు. ఇదంతా చూస్తే.. ఇంత వయసులోనూ చంద్రబాబు కమిట్ మెంట్ కు ముచ్చట పడటమే కాదు.. ఆయన స్ఫూర్తి ఈ తరానికి చాలా అవసరమని చెప్పాలి. పది రోజులుగా బస్సులోనే ఉండి..పరిస్థితులు చక్కబడిన తర్వాత మంగళవారం ఇంటికి వెళ్లిన చంద్రబాబును చూసినోళ్లు చాలామంది.. చిన్నకథ కాదు బాబుతో అని అనుకోకుండా ఉండలేని పరిస్థితి.

Tags:    

Similar News