ఆ ఎమ్మెల్యేలు చంద్రబాబుని లైట్ తీసుకుంటున్నారా?

ఆంధ్రప్రదేశ్ లో కొత్త లిక్కర్ పాలసీ.. ప్రభుత్వానికి సరికొత్త సమస్యలు తెచ్చిపెట్టేలా ఉందనే అభిప్రాయాలు తెరపైకి వస్తున్నాయి

Update: 2024-10-19 04:10 GMT

ఆంధ్రప్రదేశ్ లో కొత్త లిక్కర్ పాలసీ.. ప్రభుత్వానికి సరికొత్త సమస్యలు తెచ్చిపెట్టేలా ఉందనే అభిప్రాయాలు తెరపైకి వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో అన్నీ కేంద్రీకరించి అవినీతి జరిగేదని.. ఈ ప్రభుత్వంలో వికేంద్రీకరణ స్టాండ్ లో జరుగుతుందనే కామెంట్లు ఇప్పటికే మొదలైపోయాయి. ఈ సమయంలో బాబు మాటను ఎమ్మెల్యేలు లైట్ తీసుకుంటున్నారనే విషయం వైరల్ గా మారింది.

అవును... ఏపీలో నూతన లిక్కర్ పాలసీ అని చెప్పారు కానీ.. పాత ధరలే ఉన్నాయి.. కాకపోతే అన్ని బ్రాండ్లూ దొరుకుతున్నాయి.. ప్రైవేటు వ్యక్తులు అమ్ముతున్నారు.. అంతకు మించి తేడా ఏమీ లేదంటూ ఇప్పటికే పలువురు మందుబాబులు అసహనం వ్యక్తం చేస్తున్నారు! ఈ సమయంలో ప్రైవేటు వ్యక్తులకు మద్యం దుకాణాలు అప్పగించాలనే ఈ లిక్కర్ పాలసీతో సరికొత్త సమస్యలు వస్తున్నాయని అంటున్నారు.

వివరాళ్లోకి వెళ్తే... మద్యం, ఇసుక విషయాల్లో జోక్యం చేసుకోవద్దని, ప్రభుత్వ విధానాలను అడ్డు రావొద్దని, ప్రభుత్వ విధానాలను కాదని ఎవరూ సొంతపెత్తనాలు చేయొద్దని, మద్యం వ్యాపారులపై బెదిరింపులకు పాల్పడోద్దని, అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని టీడీపీ అధినేత, సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు! అయినా కూడా చాలా మంది ఎమ్మెల్యేలు ఆ హెచ్చరికలను లైట్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.

తమ నియోజకవర్గాల్లో లిక్కర్ షాపు ఓపెన్ చేయాలంటే తమకు 20 నుంచి 30 శాతం వాటా ఇవ్వాల్సిందే అని కొంతమంది ఎమ్మెల్యేలు.. అసలు మీకు వ్యాపారం ఎందుకు.. మీ లైసెన్సులు మాకు ఇచ్చి గుడ్ విల్ తీసుకుని వెళ్లండి అని మరికొందరు.. లైసెన్సు దారులకు హుకుం జారీ చేస్తున్నారనే విషయం ఇప్పుడు చాలా నియోజకవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది!

ఈ విషయంలో ఆ ప్రాంతం ఈ ప్రాంతం అనే తారతమ్యాలేమీ లేవని.. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ ఇదే పరిస్థితి నెలకొందని.. నాయకుల దెబ్బకు కొంతమంది దుకాణాలు తెరవాలంటేనే భయపడుతున్నారని తెలుస్తోంది. ఈ విషయంలో కొతమంది నాయకులు నేరుగా బెదిరింపులకు పాల్పడుతుంటే.. మరికొంతమంది తమ అనుచరులను పంపిస్తుంటే.. ఇంకొంతమంది పోలీసులను ఎంటర్ చేస్తున్నారని అంటున్నారు.

ఇందులో భాగంగా... తాజాగా నరసరావుపేట నియోజకవర్గ పరిధిలో మద్యం దుకాణాల లైసెన్సులు దక్కించుకున్న వారిని ఓ ముఖ్యనాయ్యకుడి ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్ కు పిలుస్తున్నారని.. గత రెండు రోజులుగా ఈ తంతు నడుస్తుందని.. సదరు ముఖ్య నాయకుడికి 25 శాతం వాటా ఇవ్వాలని లైసెన్స్ దారుడిపై నేరుగా పోలీసులే స్టేషన్ కు పిలిపించిమరీ ఒత్తిడి తెస్తున్నారని అంటున్నారు.

ఈ క్రమంలో లైసెన్సులు దక్కించుకున్న పలువురు ప్రవాసాంధ్రుల నుంచి ఇప్పటికే పలువురు నేతలు దుకాణాలను చేజిక్కించుకున్నారని.. ప్రతిగా కొంత గుడ్ విల్ ఇచ్చారని తెలుస్తోంది. మరికొన్ని చోట్ల చేసేదేమీ లేక స్థానిక నేతలు అడిగినమట్టుకు వాటా చెల్లించడానికి సిద్ధపడి షాప్ ఓపెన్ చేసుకుంటున్నారని సమాచారం. దీంతో... ఈ విషయంలో ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి వస్తుందని అంటున్నారు.

దీంతో... ఈ విషయం అటు పార్టీకి, ఇటు ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తెస్తుందని.. స్వయంగా చంద్రబాబే చెప్పినా తమ్ముళ్లు వినిపించుకోకపోవడం అతిపెద్ద అప్రతిష్టను తెచ్చిపెడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు! మరోపక్క ఈ విషయంపై చంద్రబాబు సీరియస్ గా ఉన్నారని.. తన మాటను తీసిపారేసే వారిని ఉపేక్షించేది లేదని అంటున్నారని తెలుస్తోంది.

Tags:    

Similar News