బాబు దొరికిపోయారా...పవన్ తప్పించుకున్నారా ?

ఇక చంద్రబాబు తన ఎన్నికల ప్రచారంలో ఆప్ మీద కేజ్రీవాల్ మీద ధాటీగా విమర్శలు గుప్పించారు. అది కూడా చర్చనీయాంశం అవుతోంది.

Update: 2025-02-03 15:30 GMT

రాజకీయ దురంధరుడిగా చంద్రబాబుకే పేరు. ఆయన రాజకీయాలను ఎవరూ సరిగ్గా అంచనా సైతం వేయలేరు. అపర చాణక్యుడు అనే బిరుదు ఆయనకు ఉంది. అలాంటి చంద్రబాబు ఢిల్లీ సాక్షిగా దొరికిపోయారా అన్న చర్చ అయితే సాగుతోంది.

ఈ నెల 5న ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. దేశ రాజధాని ప్రాంతం కావడంతో ఈ ఎన్నికలు దేశం మొత్తాన్ని ఆకర్షిస్తున్నాయి. ఇక చూస్తే ఇది కాంగ్రెస్ మీద రాజకీయ పోరాటం కాదు టీడీపీ మాదిరిగానే మరో ప్రాంతీయ పార్టీగా ఢిల్లీలో పట్టు సాధించిన ఆప్ మీద పోరాటం. ఆ పని బీజేపీ చేస్తోంది.

ఆప్ ని దెబ్బ తీసి ఢిల్లీని దక్కించుకోవాలని చూస్తోంది. దాని కోసం సర్వ శక్తులను పెడుతోంది. ఇదిలా ఉంటే ఢిల్లీ ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోలేదు. బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులను సైతం రప్పించి ప్రచారం వేడి పెంచింది. అంతే కాదు ఎన్డీయే మిత్రులను కూడా ప్రచారానికి ఆహ్వానించింది.

ఆ విధంగా చూస్తే ఏపీ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి కూడా బీజేపీ పెద్దల నుంచి ఆహ్వానాలు వెళ్లాయి. అయితే పవన్ ఈ ఎన్నికల ప్రచారానికి పోలేదు. కానీ చంద్రబాబు ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్ళి అరవింద్ కేజ్రీవాల్ కి వ్యతిరేకంగా పెద్ద గొంతు చేశారు.

నేరుగా ఒకనాటి తన మిత్రుడిని ఆయన ఢీ కొట్టారు. నిజానికి చూస్తే ఆప్ తటస్థ పార్టీగా ఉంది. పైగా 2018లో బీజేపీతో విభేదించి ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన టీడీపీకి మద్దతుగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. అంతే కాదు ఆయన 2019 ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా ప్రచారం చేసి పెట్టారు.

అలాంటి కేజ్రీవాల్ కి వ్యతిరేకంగా చంద్రబాబు ప్రచారం చేయడం పట్ల ఒక వైపు చర్చ సాగుతోంది. మరో వైపు చూస్తే కేజ్రీవాల్ కి దేశవ్యాప్తంగా బలమైన వర్గాలు మద్దతుగా ఉన్నాయి. ఉన్నత మధ్యతరగతి వర్గాలే ఆప్ కి భారీ ఓటు బ్యాంక్. అలాగే విద్యావంతులు మేధావులు కూడా ఆ పార్టీని సపోర్టు చేస్తారు.

ఏపీలో కూడా వారి సంఖ్య గణనీయంగా ఉంది. వారంతా టీడీపీకి కూడా అనుకూల వర్గాలే. అటువంటిది ఈ లెక్కలు ఏవీ చూసుకోకుండా కేవలం మిత్ర పక్షం బీజేపీ కోరింది అన్న కారణంతోనే చంద్రబాబు ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం చేశారు అని అంటున్నారు. వ్యూహాత్మకంగా ఇది పొరపాటుగానూ విశ్లేషిస్తున్న వారు ఉన్నారు. బాబు ఈ విధంగా చేయడాన్ని ఏపీలోని తటస్థ ఓటర్లు ఎవరూ మెచ్చడం లేదని అంటున్నారు. బాబు ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం పట్ల ఆయా వర్గాలు హర్షం వ్యక్తం చేయడం లేదు అని అంటున్నారు.

ఇక చంద్రబాబు తన ఎన్నికల ప్రచారంలో ఆప్ మీద కేజ్రీవాల్ మీద ధాటీగా విమర్శలు గుప్పించారు. అది కూడా చర్చనీయాంశం అవుతోంది. ఆయన ఏపీ మాజీ సీఎం జగన్ తో కేజ్రీవాల్ ని పోలుస్తూ చేసిన విమర్శలు కూడా చర్చకు దారి తీస్తున్నాయి. విశాఖలో జగన్ రుషికొండ ప్యాలెస్‌తో జగన్ నిర్మించినట్లే కేజ్రీవాల్ ప్రజల సొమ్ముతో శేషమహల్ అనే ప్యాలెస్‌ను నిర్మించుకున్నారని చంద్రబాబు తీవ్ర విమర్శలే చేశారు.

అంతే కాదు ఏపీ ప్రజలు తమ డబ్బును వృధా చేసినందుకు జగన్‌ కి ఎలాంటి ఫలితం దకిందో కేజ్రీవాల్ సర్కార్‌కి అలాంటి ఫలితం దక్కాలని ఆయన అక్కడి ప్రజలకు పిలుపు ఇచ్చారు. ప్రస్తుతం ఢిల్లీలో పరిస్థితులు తనకు 1995 నాటి హైదరాబాద్‌ పరిస్థితులను గుర్తుకు తెస్తున్నాయని కూడా బాబు హాట్ కామెంట్స్ చేశారు. అంటే ఆప్ వల్ల ఢిల్లీలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆయన చెప్పారన్న మాట.

అయితే బీజేపీ కోసం చంద్రబాబు కేజ్రీవాల్ మీద ఈ తరహా ఘాటు విమర్శలు చేయడాన్ని చాల మంది చర్చినుకుంటున్నారు. నిజానికి బాబు ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్ళకుండా ఉండాల్సింది అని కూడా టీడీపీని అభిమానించే వర్గాలు అంటున్న మాటగా ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ విషయంలో బీజేపీ ఆహ్వానాన్ని సున్నితంగా తెలివిగా పక్కన పెట్టేశారని గుర్తు చేసుకుంటున్నారు.

మరి రాజకీయ అనివార్యతలు ఎన్ని ఉన్నా కూడా బాబు లాంటి రాజకీయ చాణక్యుడు కేజ్రీవాల్ కి ఎదురు నిలిచి తప్పులో కాలేశారా అన్నది కూడా చర్చగా ఉంది. మొత్తానికి పవన్ ఎన్నికల ప్రచారానికి వెళ్ళకపోవడం బాబు వెళ్ళడం మీద తీవ్ర స్థాయిలో చర్చ సాగుతోంది. మరి ఎవరు చేసిన పని మంచిది అన్నది ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడించవచ్చు అని అంటున్నారు.

Tags:    

Similar News