బాబు పొలిటికల్ రిటైర్మెంట్ అపుడేనా ?
అటువంటి చంద్రబాబు నోట రిటైర్మెంట్ మాట రావడం అయితే ఆశ్చర్యంగానే ఉంది అని అంటున్నారు అంతా.;
జీవితం నిరంతర సాగే ప్రవాహం. అయితే ఇందులో కొందరు కొన్ని రంగాలు ఎంచుకుని తమ సత్తా చాటుతూ ఉంటారు. ఆయా రంగాలలో ఎంత రాణించినా మరెంతగా విజయపధంలో దూసుకునిపోయినా కూడా ఎపుడో ఒకపుడు ఆ పరుగుకు ఫుల్ స్టాప్ పడుతుంది. రిటైర్మెంట్ అన్నది ఏదో రోజున పలకరిస్తుంది.
ఇక రాజకీయాల్లో చూసుకుంటే రిటైర్మెంట్ లేదు అన్న వారూ ఉన్నారు. కొందరు అయితే కొంత ఏజ్ వచ్చాక తప్పుకుని వారసులకు అప్పగించేవారూ ఉన్నారు. మరికొందరు తమ జీవితకాలమంతా పనిచేయడానికి సిద్ధమని చెప్పేవారు కూడా ఉన్నారు.
అయితే ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు విషయం తీసుకుంటే ఆయన డిక్షనరీలో రిటైర్మెంట్ అన్న పదం ఉండదనే అంతా అనుకుంటారు. బాబుకు పనిచేయడమే ఇష్టం. ఆయన అందులోనే తన ఆనందాన్ని చూసుకుంటారు. ఆయన ఏ రోజూ ఖాళీగా ఉండేది లేదు. ఏడున్నర పదుల వయసులో ఉన్న చంద్రబాబు ఈ రోజుకీ ఫుల్ ఫిట్ నెస్ తో ఉంటారు. ఆయన ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటూ తనకంటే జూనియర్లను సైతం దాటుకుని ముందుకు సాగుతారు. ఏపీలో బాబుతో పోటీ పడే పరిస్థితి ఈ విషయంలో ఎవరికీ లేదనే చెప్పాల్సి ఉంటుంది.
అటువంటి చంద్రబాబు నోట రిటైర్మెంట్ మాట రావడం అయితే ఆశ్చర్యంగానే ఉంది అని అంటున్నారు అంతా. బాబు తన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ దగ్గుబాటి రిటైర్మెంట్ లైఫ్ ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని అన్నారు. తాను ఆయనను ఎలా సమయాన్ని గడుపుతున్నారని అడిగాను అని చెప్పారు.
తనకు అటువంటి పరిస్థితి వస్తే ముందుగా ప్లాన్ చేసుకోవడానికే అడిగాను అని బాబు చెప్పారు. మరి ఆ విధంగా బాబు ఆలోచిస్తున్నారా ఆయనకు రిటైర్మెంట్ అయ్యే చాన్స్ ఉందా అసలు అలాంటి ఉద్దేశ్యాలు బాబుకు ఎందుకు ఉన్నాయన్నది ఇపుడు పెద్ద ఎత్తున చర్చగా ఉంది.
దగ్గుబాటి అయితే రాజకీయంగా క్రియాశీలంగా ఉండి చాలా ఏళ్ళు గడచిపోయాయి. పైగా ఆయన పార్టీని లీడ్ చేయడం లేదు. అదే బాబు అయితే ముప్పయ్యేళ్ళుగా టీడీపీని లీడ్ చేస్తున్నారు. నాలుగు సార్లు సీఎం అయ్యారు. జాతీయ రాజకీయాల్లో కీలకంగా అనేకసార్లు ఉన్నారు. ఇపుడు మరోసారి కూడా ఉన్నారు.
బాబు ఊపిరే రాజకీయం అని అంటారు. ఆయనకు రాజకీయాలను దూరం పెట్టడం వల్ల అవుతుందా అన్నదే పెద్ద చర్చ. అయితే బాబు ఆలోచనలు వేరేగా ఉన్నాయని అంటున్నారు. ఆయన తన కుమారుడు లోకేష్ ని సీఎం గా చేయాలని చూస్తున్నారు అని అంటున్నారు. బాబుకు తగిన వారసుడిగా లోకేష్ ని ఇప్పటికే తీర్చిదిద్దే పనిలో ఉన్నారు.
లోకేష్ ప్రస్తుతం పార్టీ బాధ్యతలను చక్కగానే చూసుకుంటున్నారు. ఇక ప్రభుత్వ బాధ్యతలను కూడా అప్పగించడానికి బాబు పూర్వ రంగం సిద్ధం చేస్తున్నారా అందుకేనా బాబు వంటి రాజకీయ దిగ్గజం నోట రిటైర్మెంట్ అన్న మాట వచ్చింది అని అంతా చర్చించుకుంటున్నారు.
నిజానికి బాబు మరో దశాబ్దం పైగా రాజకీయంగా ఇదే ఉత్సాహంతో ఉండగలరని అంతా అంటున్నారు. ఆయన రాజకీయాల్లో కొనసాగాలని అభిమానులు కూడా కోరుతున్నారు. కానీ బాబు తన గురించి కాకుండా టీడీపీ భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తున్నారు. లోకేష్ ని సీఎం గా చేయడం అంటూ జరిగితే అది 2029లో జరుగుతుందని అంటున్నారు. అప్పటికి లోకేష్ కి 46 ఏళ్ళు దాటుతాయి. రాజకీయంగా మరింతగా రాటు తేలుతారు. బాబు కూడా 45 ఏళ్ళ వయసులో తొలిసారి సీఎం అయ్యారు.
దాంతో లోకేష్ కి పార్టీ ప్రభుత్వ పగ్గాలు అప్పగించి తాను తెర వెనక నుంచి మార్గదర్శకత్వం చేస్తూ లోకేష్ తో ముందు ముందు టీడీపీని సక్సెస్ ఫుల్ గా నడిపించాలని ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. అందుకే ఆయన నోటివెంట రిటైర్మెంట్ అన్న మాట వచ్చిందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో. బాబు రిటైర్మెంట్ ఆలోచనల వెనక ఏ రాజకీయ వ్యూహాలు ఉన్నాయో.