బాబుకు సంక‌టం: క‌ళ్ల‌ముందే 500 కోట్ల సంప‌ద‌.. వాడ‌లేరు, వ‌ద్ద‌న‌లేరు

అదేంటి.. క‌ళ్ల ముందే 500 కోట్ల సంప‌ద క‌నిపిస్తుంటే చంద్ర‌బాబుకు ఇబ్బందులు ఏంటి? అని అనుకుం టున్నారా?

Update: 2024-10-08 23:30 GMT

అదేంటి.. క‌ళ్ల ముందే 500 కోట్ల సంప‌ద క‌నిపిస్తుంటే చంద్ర‌బాబుకు ఇబ్బందులు ఏంటి? అని అనుకుం టున్నారా? పైగా అస‌లే రాష్ట్ర స‌ర్కారు అప్పుల్లో ఉంది క‌దా.. ఆబ‌గా ఆ సొమ్మును వాడుకునేందుకు అవ‌కాశం ఉంది క‌దా? అని నొస‌లు చిట్లిస్తున్నారా? నిజ‌మే. కానీ, ధ‌నం రూపంలో లేదు. `ఇంద్ర‌భ‌వ‌నం` రూపంలో ఉంది. అదే.. విశాఖ‌లోని రుషి కొండ‌పై వైసీపీ హ‌యాంలో అప్ప‌టి సీఎం జ‌గ‌న్ ప‌నిగ‌ట్టుకుని ప్ర‌జాధనం వెచ్చించి నిర్మించిన `ప్యాలెస్‌`

దీని కోసం గ‌త మూడేళ్ల‌లో రూ.500 కోట్ల‌కుపైగా ప్ర‌జాధనాన్ని వెచ్చించిన‌ట్టు అధికారిక రికార్డులు చెబుతు న్నాయి. క‌ళ్ల ముందు ఇంత పెద్ద సంప‌ద పెట్టుకున్నా.. దీనిని వినియోగించుకునే అవ‌కాశం లేదు. అలాగ‌ని వ‌ద్ద‌నే ప‌రిస్థితి కూడా లేదు. పోనీ.. ప్ర‌జాధ‌నం దుర్వినియోగం చేశార‌ని కేసులు పెట్టి.. చర్య‌లు తీసుకుందామా? అంటే.. స‌ర్కారు అవ‌స‌రాల కోసమే క‌దా ఖ‌ర్చెపెట్టింది.. మేమేమ‌న్నా తినేశామా? వాడుకోండి! అంటూ.. వైసీపీ నుంచి ఎదురు మాట‌లు. న్యాయ వ్య‌వ‌స్థ ప‌రిశీల‌న‌కు కూడా అంద‌ని త‌ర్కం!!

వెర‌సి.. ఇప్పుడు ఆ 500 కోట్ల ఇంద్ర భ‌వ‌నాన్ని ఏం చేయాల‌న్న‌ది చంద్ర‌బాబుకు పెద్ద త‌ల‌నొప్పిగా మా రింది. దీనిని సంర‌క్షించేందుకు(అంటే.. అసాంఘిక శ‌క్తులకు అడ్డాగా మార‌కుండా.. ఇత‌ర్రత్రా వ్య‌క్తులు ఆక్ర‌మించుకోకుండా) ప‌దుల సంఖ్య‌లో పోలీసుల‌ను మూడు షిప్టుల్లో ఇక్క‌డ భ‌ద్ర‌త‌కు కేటాయించారు. వీరికి ఇంకేమీ ప‌నిలేదు. అక్క‌డే ఉండి.. భ‌ద్ర‌త క‌ల్పించ‌డం. వీరిలో ఎస్సై స్థాయి అధికారి నుంచి కింది స్థాయి వ‌ర‌కు ఉన్నారు. దీంతో వీరికి ఇచ్చే జీత‌భ‌త్యాల భారం మ‌రో లెక్క‌గా ఉంది.

ఏం చేయాల‌న్నా తంటానే..

అతి పెద్ద భ‌వ‌నం కావ‌డం, అత్యాధునిక వ‌స‌తులు కావ‌డంతో దీనిని సాధార‌ణ ప్ర‌భుత్వ కార్యాల‌యంగా వినియోగించాల‌ని అనుకున్నా.. సాధ్య ప‌డ‌డం లేదు. పోనీ.. అక్క‌డే సీఎం ఉందామ‌న్నా.. ఆయ‌న‌కు ఇంత విలాస వంత‌మైన భ‌వ‌నంలో ఉండి.. పేద‌ల‌ను పాలించాల‌ని కూడా లేదు. పోనీ.. ఏ ప్రైవేటు సంస్థ‌కు అద్దెకు ఇవ్వాల‌న్నా.. గ్రీన్ ట్రైబ్యున‌ల్ స‌హా .. హైకోర్టులో కేసులు పెండింగులో ఉన్నాయి. దీంతో ఈ 500 కోట్ల అధునాత ఇంద్ర భ‌వ‌నాన్ని ఏం చేయాలో తెలియ‌క‌.. భ‌ద్ర‌త‌కు అవుతున్న ఖ‌ర్చును భ‌రించలేక‌.. స‌ర్కారు స‌త‌మ‌తం అవుతుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News