బాబు సభలో జై జగన్ నినాదాలు.. దిమ్మతిరిగేలా వార్నింగ్ ఇచ్చిన సీఎం

ఏపీ రాజకీయాలు ఎప్పుడూ త్రిల్లర్ సినిమా క్లైమాక్స్ ను తలపించేలా ఉంటాయనేదానికి ఇదో ఉదాహరణ.;

Update: 2025-04-02 04:57 GMT
బాబు సభలో జై జగన్ నినాదాలు.. దిమ్మతిరిగేలా వార్నింగ్ ఇచ్చిన సీఎం

ఏపీ రాజకీయాలు ఎప్పుడూ త్రిల్లర్ సినిమా క్లైమాక్స్ ను తలపించేలా ఉంటాయనేదానికి ఇదో ఉదాహరణ. ఎన్నికలు ఇప్పట్లో లేకపోయినా ప్రతిరోజూ ఎన్నికే అన్నట్లు ఏపీ రాజకీయాలు ఉంటాయి. ముఖ్యంగా అధికార కూటమి ఎంత బలంగా ఉన్నా, 40 శాతం ఓటు షేర్ దక్కించుకున్న వైసీపీ కూడా అంతే గట్టిగా నిలబడేందుకు ప్రయత్నిస్తోంది. దీనికి తాజా ఉదాహరణ బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో జరిగిన సీఎం చంద్రబాబు కార్యక్రమం. చిన్న గంజాం మండలం కొత్త గొల్లపాలెంలో పింఛన్ల పంపిణీ తర్వాత ప్రజావేదికలో సీఎం ప్రసంగిస్తుండగా, కొందరు వైసీపీ అభిమానులు జై జగన్ అంటూ నినదించారు. అయితే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం సమయస్ఫూర్తితో వ్యవహరించి వైసీపీ కార్యకర్తలకు షాకిచ్చారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు వరుసగా అరెస్టు అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన సాధారణ కార్యకర్తల వద్ద కూడా కూటమికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటానికి చాలా మంది వైసీపీ కార్యకర్తలు వెనకడుగు వేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. కానీ, అక్కడక్కడ కొందరు కార్యకర్తలు మాత్రం ధైర్యంగా పోరాడుతున్నారు. పార్టీపై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సభలో వైసీపీకి అనుకూలంగా నినాదాలు చేయడమంటే చిన్న విషయం కాదు. అయితే పర్చూరు నియోజకవర్గంలో జరిగిన సీఎం చంద్రబాబు సభలో ఇద్దరు వైసీపీ కార్యకర్తలు మాత్రం ఈ పనిచేసి వైసీపీ కార్యకర్తల్లో ధైర్యం నూరిపోశారు. సీఎం చంద్రబాబు ప్రసంగిస్తుండగా, జై జగన్ అంటూ నినాదాలు చేసి కలకలం సృష్టించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతుండగా, వారు అలా నినాదాలు చేయడంతో సభలో కొంతసేపు గందరగోళం నెలకొంది. ఊహించని ఈ పరిణామంతో టెన్షన్ పడిన పోలీసులు వెంటనే అప్రమత్తమై నినాదాలు చేసిన వారిని అడ్డుకున్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం వైసీపీ కార్యకర్తల చేష్టలను తేలిగ్గా తీసుకున్నారు.

‘‘43 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం నాది.. ఎవరికైనా ఏదైనా కావాలంటే గౌరవంగా వచ్చి నన్ను అడగండి. మీ సమస్యను పరిష్కరిస్తాను. అంతేగాని ఇలాంటి చిల్లర వేషాలు వేస్తే నేను భయపడను’’ అంటూ చంద్రబాబు తేల్చిచెప్పారు. అంతేకాకుండా కడపు నొప్పి ఉంటే డాక్టర్ దగ్గరకు వెళ్లాలి. వేరే ఏదైనా బాధ ఉంటే నా దగ్గరకు రావాలి. కానీ, ఇలా కేకలు వేస్తే కడుపు నొప్పి పెరుగుతుందని సభలో నవ్వులు పూయించారు. వైసీపీ కార్యకర్తల చేష్టలకు ముఖ్యమంత్రి సంయమనంతో సమాధానం చెప్పడం సభికులను ఆకట్టుకుందని అంటున్నారు. మొత్తానికి గతంలో రాయచోటి, తాజాగా పర్చూరుల్లో వైసీపీ కార్యకర్తలు చూపించిన తెగువ చర్చనీయాంశమవుతోంది. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులుగా పనిచేసిన వారు జడుసుకుని ఇళ్లల్లో నుంచి బయటకు రావడం లేదని, అదే సమయంలో సాధారణ కార్యకర్తలు మాత్రం తెగించి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారంటూ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Full View
Tags:    

Similar News