చంద్రబాబు : విజయవాడ టూ హైదరాబాద్... ఉండవల్లి కి వెళ్ళరా ?

ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలోనే గత వారం రోజులుగా మకాం వేశారు.

Update: 2024-09-07 16:41 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలోనే గత వారం రోజులుగా మకాం వేశారు. బెజవాడ వరదలలో నిండుగా మునిగింది కాబట్టే తాను విజయవాడ కలెక్టరేట్ లో ఉంటూ పరిస్థితి మొత్తం అదుపులోకి వచ్చాక కానీ అక్కడ నుంచి కదలను అని భీష్మించారు. ఆ విధంగానే బాబు ఉన్నారు. ఆఖరుకు వినాయక చవితి పండుగను సైతం బాబు కలెక్టరేట్ లోనే జరుపుకున్నారు.

ఇప్పటికీ విజయవాడకు వానల బెడద ఉన్నా బుడమేరు గండ్లను పూడచడంతో చాలా వరకూ ముప్పు బాధ తప్పినట్లు అయింది. దాంతో పాటు సహాయ చర్యలు కూడా కీలక దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆదివారం విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తారు అని వార్తలు వస్తున్నాయి.

బాబు వారం రోజుల తరువాత హైదరాబాద్ లోని తన ఇంటికి చేరుకుని అక్కడ విశ్రాంతిగా గడుపుతారు అని అంటున్నారు ఇక బాబు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళి మళ్లీ విజయవాడకే వస్తారు అని కూడా అంటున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నా మధ్యలో ఉండవల్లి సంగతేటి అన్నదే చర్చగా ఉంది.

ఉండవల్లిలో బాబు నివాసం ఉంది. అక్కడ కూడా వరద నీరు పారిందని బాబు ఇంటికి కూడా అది వచ్చి చేరిందని అందుకే ఆయన విజయవాడ కలెక్టరేట్ కి మకాం మార్చారు అని వైసీపీ ఒక వైపు ఆరోపిస్తున్న నేపథ్యం ఉంది. దానిని టీడీపీ గట్టిగానే ఖండించినా ఇప్పటివరకూ చూస్తే బాబు కానీ చినబాబు కానీ ఉండవల్లి వైపు చూడటం లేదు.

పైగా వరద నీరు ఉండవల్లిలోని బాబు నివాసానికి చేరుకుందని కొన్ని విజువల్స్ కూడా మీడియాలో కనిపించాయి. మరి ఉండవల్లి పరిస్థితి ఏంటి అన్నది మాత్రం తెలియడం లేదు అని అంటున్నారు. అయితే విజయవాడలో ఇంకా సహాయ చర్యలు చేపట్టాల్సి ఉందని అవన్నీ పూర్తి అయ్యేంతవరకూ బాబు విజయవాడలోనే ఉంటారు అని అంటున్నారు.

ముఖ్యమంత్రి విజయవాడలో ఉండడాన్ని ఎవరూ తప్పు పట్టకపోయినా వైసీపీ చేస్తున్న ఆరోపణలను కూడా గమనిస్తున్నారు. ఉండవల్లిలోని బాబు నివాసం సేఫ్ గానే ఉందా అన్న సందేహాలు వ్యక్తం చేసేవారూ ఉన్నారు. ఇంకో వైపు చూస్తే ఆక్రమణల వల్లనే విజయవాడకు వరదలు వచ్చాయని నిపుణులతో పాటు అంతా అంటున్న మాట.

అలాంటిది ఒక ముఖ్యమంత్రి కరకట్ట మీద కట్టిన ఇంటిలో ఎలా ఉంటారు అని కూడా ప్రశ్నించే వారూ ఉన్నారు. మరో వైపు మాజీ మంత్రి అంబటి రాంబాబు వంటి వారు అయితే ముందు చంద్రబాబు ఉండవల్లిలోని నివాసాన్ని ఖాళీ చేయించి ఆ మీదట బుడమేరు కరకట్ట అక్రమ నిర్మాణాల మీద మాట్లాడితే బాగుంటుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి సూచించారు. ఏది ఏమైనా బాబు ఇప్పట్లో ఉండవల్లి వెళ్లరా అన్నదే చర్చగా ఉంది. చూడాలి మరి.

Tags:    

Similar News